రేపటి నుండి తెలంగాణాలో థియేటర్లు తెరచుకుంటున్నాయి!

గత నెల (జూన్) 20 నుండి తెలంగాణాలో నూరు శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో సినిమాలను ప్రదర్శించవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ సినిమా థియేటర్ల యాజమాన్యం మాత్రం పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించే వరకూ థియేటర్లు తెరవమని చెప్పేశారు. అంతే కాకుండా అక్టోబర్ నెలాఖరు వరకూ నిర్మాతలెవరూ ఓటీటీలలో సినిమాలను విడుదల చేయవద్దంటూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ తీర్మానం కూడా చేసింది.

అయితే… శనివారం తమ సమస్యలను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, థియేటర్ల యాజమాన్యంకు చెందిన ప్రతినిథులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దృష్టికి తీసుకెళ్ళారు. తమ ఇబ్బందులను లిఖితపూర్వకంగా మంత్రికి అందచేశారు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికల సందర్భంగా సి.ఎం. కేసీఆర్ సినిమా రంగానికి చేసిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు కోరారు. వారి సమస్యలను సావకాశంగా విన్న మంత్రి శ్రీనివాస యాదవ్ సానుకూలంగా స్పందించారు. ‘సీఎం కేసీఆర్ మాట మీద నిలబడతారని, ఎగ్జిబిటర్స్ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తార’ని తెలిపారు.

దాంతో థియేటర్ల యాజమాన్యం ఆదివారం నుండి తమ సినిమా హాళ్ళను తెరుస్తామని మంత్రికి తెలిపింది. అందుబాటులో ఉన్న చిత్రాలతో తొలుత ప్రదర్శన మొదలు పెట్టడానికి ఎగ్జిబిటర్స్ సిద్ధమవుతున్నారు. నిర్మాతలు కొత్త చిత్రాలను విడుదల చేయడం మొదలు పెడితే, థియేటర్లు కళకళలాడటం ఖాయం. మరి ఆంధ్ర ప్రదేశ్ లోనూ యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడపవచ్చని అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అక్కడి సినిమా హాళ్లూ తెరుస్తారేమో చూడాలి. ఇవాళ మంత్రి శ్రీనివాస యాదవ్ ను కలిసిన వారిలో సునీల్ నారంగ్, అభిషేక్ నామా, అనుపమ్ రెడ్డి, సదానంద్ గౌడ్, గోవింద రాజ్, కిశోర్ బాబు తదితరులు ఉన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-