టీడీపీవి వెన్నుపోటు రాజకీయాలు : ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి

బద్వేల్‌ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగియడం సంతోషదాయకమని ప్రభుత్వ చీఫ్‌ విప్‌, వైయస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడంతో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకున్నారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఓటు వేయకుండా, పోలింగ్‌ శాతాన్ని తగ్గించాలనే దురుద్దేశంతో బీజేపీ చాలా అరాచకాలు చేయడానికి ప్రయత్నించింది.

గుర్తింపు కార్డు ఉన్నా… ఓటు వేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలుతో పాటు, పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓటర్లను బీజేపీ శ్రేణులు భయభ్రాంతులకు గురి చేశాయి. బీజేపీ కోరిన విధంగా 281 బూత్‌ల్లో కూడా వెబ్‌ కాస్టింగ్‌ పెట్టడం జరిగింది. ఇంత నిష్పక్షపాతంగా పోలింగ్‌ జరిగినా ఓట్లు తమకు పడవని, చాలా దారుణంగా ఓటమి తప్పదనే తెలిసి ముందస్తు ప్రణాళికతో ఎల్లో మీడియా సహకారంతో వైయస్సార్‌ సీపీపై బుదరచల్లే కార్యక్రమం చేసింది.

తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉన్నామని ప్రకటించినా, పోలింగ్‌ బూత్‌ల వద్ద టీడీపీ ఏజెంట్లు కూర్చోవడం, వారి సహకారాన్ని బీజేపీ తీసుకోవడం వాస్తవం కాదా? చంద్రబాబు పోటీకి దూరం అంటూనే వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారు. కొన్ని బూత్‌ల్లో టీడీపీ-బీజేపీ ఏజెంట్లు కలిసి కూర్చోలేదా? బీజేపీ కొన్ని చోట్ల వారి పార్టీకి చెందిన ఏజెంట్లను పెట్టుకోలేక మాపై నిందలు వేస్తే ఎలా? బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేయించుకోవడం చేయాలి కానీ, మాపై బురద చల్లడం ఎంతవరకు సమంజసం. అయినా మీకు ఏం చూసి ప్రజలు ఓటు వేస్తారో సమాధానం చెప్పగలరా?

కట్టుదిట్టమైన భద్రత మధ్య, ఎన్నికల అధికారులు సహకారంతో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగితే దాన్ని కూడా బీజేపీ జీర్ణించుకోలేక మాపై అసత్యాలు మాట్లాడటమా? ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు కూడకట్టుకోవాలి తప్ప, ఏదో జరిగిపోయిందనేలా సీన్‌ క్రియేట్‌ చేసి సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పడం ఎంతవరకూ సమర్థనీయమో వాళ్లకు వాళ్లు ప్రశ్నించుకోవాలి. బద్వేల్‌ లో ఏం జరిగిందో తెలిసినా, ఎదురు దాడి చేయడం తగదు. పబ్బం గడుపుకోవడానికి మాట్లాడటం సరికాదు. బలం లేనిచోట ఏజెంట్లును పెట్టుకోలేక వైయస్సార్‌ సీపీ మీద, ప్రభుత్వంపై నిందలు వేస్తారా? ఏ అధికారి అయినా మాకు పక్షపాతంగా వ్యవహరించారో చూపించగలరా?

మేము ప్రజలనే నమ్ముకున్నాం. మేము అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓటు వేయమని ప్రజలను అడిగాం. శాంతియుతంగా ఉప ఎన్నిక జరగడంతో పాటు, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకున్న బద్వేల్‌ ప్రజలను అభినందిస్తున్నాం. వర్షం లేకుండా ఉంటే ఇంకో పదిశాతం పోలింగ్‌ పెరిగేది అని మేము భావిస్తున్నాం’ అని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

Related Articles

Latest Articles