చంద్రబాబు ఏడవడానికి కారణం ఆ ఫోన్ కాల్..?

గంభీరంగా ఉండే చంద్రబాబు అంతలా వెక్కి వెక్కి ఏడ్వడానికి కారణమేంటి? తాను వేసే ప్రతి అడుగునూ కార్యకర్తలు గమనిస్తారని తెలిసినా.. ఆ స్థాయిలో విలపించడం వెనకున్న రీజనేంటి..? గట్టిగా పోరాడాలని కార్యకర్తలకు నూరిపోసే చంద్రబాబు ఎందుకు డీలా పడ్డారు..? టీడీఎల్పీ భేటీలో.. మీడియా ఎదుట భావోద్వేగాలను ఎందుకు కంట్రోల్‌ చేసుకోలేకపోయారనేది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

టీడీఎల్పీలో ఓ ఫోన్‌ వచ్చాక బాబు కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయా?

ఏపీ అసెంబ్లీలో అనూహ్య పరిణామాల తర్వాత ఎన్నడూ లేని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా ఎదుట భోరుమంటూ విలపించారు. అంతకుముందు టీడీఎల్పీలోనూ దానికి రెండింతలు గుక్కపెట్టి కన్నీళ్లు పెట్టుకున్నట్టు సమాచారం. చంద్రబాబును ఆ పరిస్థితిలో గతంలో ఎన్నడూ చూడని పార్టీ సీనియర్లు, ఇతర నాయకులు షాక్‌ అయ్యారట. సభ నుంచి ఛాంబర్‌లోకి వచ్చి టీడీఎల్పీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఐదు నిమిషాల వరకు ఆయన గంభీరంగానే ఉన్నారట. ఆ తర్వాత చంద్రబాబుకు వచ్చిన ఓ ఫోన్‌ కారణంగా.. అప్పటి వరకు అణిచిపెట్టుకుని ఉన్న కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయని అంటున్నారు పార్టీ ఎమ్మెల్యేలు.

సముదాయించలేక బిత్తరపోయిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..!

తన ఛాంబర్లోని యాంటీ రూమ్‌లోకి వెళ్లిన చంద్రబాబు ఫోన్‌లో ఎవరితో సంభాషించారనే అంశంపై పార్టీ ఎమ్మెల్యేలు ఆరా తీశారట. ఆ ఫోన్ చేసింది చంద్రబాబు భార్య భువనేశ్వరీ అని తెలిసిందట. భార్యతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే ఛాంబర్‌లోని తన ఛైర్‌లోకి వచ్చి కూర్చొని బోరు బోరుమంటూ ఏడ్చేశారట చంద్రబాబు. దీంతో ఆయన్ని ఎలా సముదాయించాలో తెలియక బిత్తరపోయారట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఐదు నిమిషాల అనంతరం సర్దుకుని సమావేశాన్ని కొనసాగించారట చంద్రబాబు.

మీడియాతో మాట్లాడలేనని చెప్పిన చంద్రబాబు?

ఈ పరిస్థితుల్లో మీడియా సమావేశం నిర్వహించాలా.. వద్దా? అనే అంశంపై పార్టీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తనను తాను కంట్రోల్‌ చేసుకోలేకపోతున్నానని.. మీడియా సమావేశం పెట్టలేనని పార్టీ నేతల వద్ద ప్రస్తావించారట. అయితే సభలో ప్రకటనకు అవకాశం దక్కలేనందున.. మీడియాతో మాట్లాడితేనే ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలమని ఎమ్మెల్యేలు బదులిచ్చారట. ఆ తర్వాతే ఆయన మీడియా ముందుకు వచ్చారని తెలుస్తోంది.

గతంలో ఎప్పుడూ వెక్కివెక్కి ఏడ్చిన సందర్భాలు లేవా?

గతంలో ఈస్థాయిలో చంద్రబాబు ఎన్నడూ వెక్కివెక్కి ఏడ్చిన సందర్భాలు లేవన్నది పార్టీ నేతల మాట. తమకు గుర్తుండి గతంలో బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన సందర్భంగా ఓసారి, ఆ తర్వాత ఎర్రన్నాయుడు చనిపోయినప్పుడు మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారని గుర్తు చేసుకుంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే అప్పుడు కంటతడి పెట్టారే తప్ప.. ఈ స్థాయిలో చూడలేదంటున్నారు నాయకులు.

Related Articles

Latest Articles