రివ్యూ : ది ప్రీస్ట్

ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన తాజా చిత్రం ‘ది ప్రీస్ట్’. గత యేడాది జులైలో విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్ కు కరోనా కారణంగా బ్రేక్ పడింది. దాంతో అన్ లాక్ తర్వాత షూటింగ్ ను పూర్తి చేసి, ఈ యేడాది మార్చి 11న థియేటర్లలో విడుదల చేశారు.  ఏప్రిల్ 14 నుండి ఈ సినిమా అమెజాన్ లోనూ వీక్షకులకు అందుబాటులో ఉంది. మరి ఈ సూపర్ నేచురల్ హారర్ మిస్టరీ మూవీ ‘ది ప్రీస్ట్’ ఎలా ఉందో తెలుసుకుందాం.

ఫాదర్ కార్మెన్ బెనెడిక్ట్ (మమ్ముట్టి) మెంటలిస్ట్. ఆయనకు ఆత్మలను గుర్తించి, వాటి సమస్యలను తీర్చే శక్తి ఉంటుంది. అలాంటి ఫాదర్ కార్మెన్ దగ్గరకు దివ్య అలెక్స్ (సానియా ఇయ్యప్పన్) వచ్చి… ఓ ధనవంతుల కుటుంబంలోని సభ్యులంతా ఒక్కొక్కరిగా మనోవ్యధకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కానీ వారి మరణం వెనుక ఏదో మిస్టరీ ఉందనే అనుమనం వ్యక్తం చేస్తుంది. అలా మొదలైన ఫాదర్ కార్మెన్ పరిశోధన… ఊహించని విధంగా కథ కొంత నడిచే సరికీ, మరో మలుపు తిరుగుతుంది. ధనవంతుల కుటుంబంలో కార్మెన్ కు తారస పడిన అమేయా (బేబీ మోనిక) లో వేరొకరి ఆత్మ ఉందని ఆయన గుర్తిస్తాడు. అమేయాకు ఆమె టీచర్ జెస్సీ (నిఖిలా విమల్)కి, చనిపోయిన ఆమె అక్క సుసాన్ చెరియన్ (మంజు వారియర్)కు మధ్య ఉన్న సంబంధం ఏమిటో ఛేదించడమే చివరకు ఫాదర్ కార్మెన్ అసలు పనిగా మారిపోతుంది. ఊహించని మలుపులు తిరిగే ఈ హారర్ మిస్టరీ కథ ఎలా సుఖాంతమైందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

మలయాళంలో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో చాలానే సినిమాలు వచ్చాయి. ‘ది ప్రీస్ట్’ మూవీని చూస్తుంటే గతంలో వచ్చిన నాగార్జున ‘రాజుగారి గది -2’ సినిమా గుర్తొస్తుంది. అందులో కూడా నాగార్జునది ఆత్మలు ఆవహించిన వక్తుల జబ్బులను నయం చేసే పాత్రే. చిత్రం ఏమంటే… ఆ సినిమా మలయాళ చిత్రం ‘ప్రేతమ్’కు రీమేక్. సో… ఒకే తరహా కథాంశాలు దక్షిణాదిన అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాయి. కాకపోతే… మమ్ముట్టి ఇందులో ఫాదర్ కార్మెన్ పాత్ర పోషించడం, ఆ పాత్రలోని వైవిధ్యం కారణంగా అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. విశేషం ఏమంటే ఎంతో కాలంగా మలయాళ చిత్రసీమలో ఉన్న మమ్ముట్టి, మంజు వారియర్ ఈ సినిమాలో తొలిసారి కలిసి నటించారు. ఇక పెర్ఫామెన్స్ విషయానికి వస్తే… మమ్ముట్టి సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ చాలా స్టేబుల్ గా ఎక్కడా గ్రాఫ్ తగ్గకుండా నటించాడు. అయితే ఆయన నుండి యాక్షన్ సీన్స్ ను ఆశించిన అభిమానులు మాత్రం కాస్తంత నిరాశ పడక తప్పలేదు. ఇక స్కూల్ టీచర్ గా కీలక మైన పాత్ర పోషించిన మంజు వారియర్ నటిగా తానేమిటో మరోసారి నిరూపించుకుంది. ‘అల్లరి’ నరేశ్ ‘మేడమీద అబ్బాయి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిఖిలా రామన్ ఇందులో జెస్సీ  పాత్ర పోషించింది. ఆమెది కూడా చాలా ప్రధానమైన పాత్రే! అలానే ఈ సినిమాలో ఇంకో కీలకమైన పాత్ర అమేయది. ఈ పాత్రను బేబీ మోనికా చక్కగా చేసింది. 

ధనవంతుల కుటుంబంలో చోటు చేసుకున్న మరణాల వెనుక మిస్టరీని ఛేదించేదిగా మొదలయ్యే ఈ సినిమా ఆ తర్వాత అక్కాచెల్లెళ్ళ అనుబంధం వైపుకు మళ్ళడం విశేషం. అలానే  అందులో అక్క హఠాన్మరణానికి గురి కావడం… ఆమె మరణం వెనుక ఉన్న మిస్టరీ… ఇవన్నీ కూడా దర్శకుడు జోఫిన్ టి చాకో చక్కగా తెరకెక్కించాడు. కానీ ప్రథమార్థంలో ఉన్న టెంపో ద్వితీయార్థంకు సడలిపోయింది. కొన్ని చోట్ల మరీ ఎక్కువ డిటేల్స్ లోకి దర్శకుడు వెళ్లడం ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ పై దర్శకుడు దృష్టి పెట్టి, కొన్ని అనవసరమైన సన్నివేశాలను తొలగించి ఉంటే బాగుండేది. సినిమా చూస్తున్న వాళ్ళకు నేరస్థులు ఎవరు అనేది ఒక స్టేజ్ కు వచ్చాక అర్థమైపోతుంది. అయితే… ఫాదర్ కు తారసపడే ఆత్మల విషయంలో మాత్రం దర్శకుడు మంచి సస్పెన్స్ ను మెయిన్ టైన్ చేశాడు. అదే ఈ సినిమాలో కాస్తంత థ్రిల్లింగ్ గా అనిపించేది. ఇక ఆత్మలు సైతం తమ శత్రువులను గుర్తించే విషయంలో పొరపాటు పడటం అనేది మనం ఆ మధ్య వచ్చిన ‘యూ టర్న్’ మూవీలో చూశాం. అందువల్ల… క్లయిమాక్స్ తేలిపోయింది. అయితే ఓ చిన్న ట్విస్ట్ తో దర్శకుడు సినిమాకు శుభం కార్డు వేయడం బాగుంది. ఏదేమైనా…. మొదటి సినిమాతోనే జోఫిన్ టి చాకో దర్శకుడిగా మంచి మార్కులే పొందాడు. భవిష్యత్తులో అతని నుండి ఇంకాస్త బెటర్ మూవీస్ ను ఆశించొచ్చు. ‘ది ప్రీస్ట్’ మూవీ మమ్ముట్టి అభిమానులకు, ముఖ్యంగా హారర్ జోనర్ ను ఇష్టపడే వారికి నచ్చే ఆస్కారం ఉంది. 

ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
రాహుల్ రాజ్ సంగీతం
అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ

మైనెస్ పాయింట్స్
కొత్తదనం లేని క్లైమాక్స్
నత్తనడకన సాగే ద్వితీయార్ధం

రేటింగ్ : 2.25 / 5

ట్యాగ్ లైన్ : కొంత ఊరట కలిగించే ‘ది ప్రీస్ట్’!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-