వరవరరావుకు బెయిల్‌ పొడిగింపు

విరసం నేత వరవర రావుకు బాంబే హైకోర్టు బెయిల్‌ను పొడిగించింది. 2018 భీమా కోరేగావ్ అల్లర్లకు సంబంధించి ఆయన నిందితుడిగా ఉన్న సంగతి తెల్సిందే. ఆ ఏడాది ఆగస్టు 28 నుంచి ఆయన జైలులో ఉన్నారు. అయితే, ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో గతేడాది ఆయన బెయిల్‌ పిటిషన్‌ పెట్టుకున్నారు. దీంతో మెడికల్ గ్రౌండ్స్ లో 2021 మార్చి 6న ఆరు నెలల పాటు వరవరరావుకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆగస్టులో సరెండర్ అవ్వాల్సి ఉన్నా బెయిల్ ను పొడిగించాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు ఆమోదించింది. తాజాగా ఇవాళ ఆయన సరెండర్ విషయంపై జరిగిన విచారణలో భాగంగా మరోసారి బాంబే హైకోర్టు వరవరరావు బెయిల్‌ను పొడిగించింది.

Read Also: కేసీఆర్‌కు చేతనైందల్లా గలీజు తిట్లు.. గారడీ మాటలు: షర్మిల

థర్డ్ వేవ్ లో కేసులు భారీగా పెరుగుతున్నాయని, ఇలాంటి టైంలో మళ్లీ ఆయన్ను జైలుకు పంపించలేమని జస్టిస్ ఎస్ఎస్ షిండే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నానాటికి వరవరరావు ఆరోగ్యం క్షీణిస్తోందని, కరోనా కేసులూ పెరుగుతున్నాయని, ఇలాంటి టైంలో ఆయన్ను జైలుకు పంపించాల్సిన అవసరం ఏముందంటూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులను ప్రశ్నించింది. కరోనా థర్డ్ వేవ్ 50 నుంచి 60 రోజులు ఉండే అవకాశం ఉందని, చాలా మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు మహమ్మారి బారిన పడుతున్నారని గుర్తు చేసింది. కరోనా మొదటి వేవ్, రెండోవేవ్‌ కన్నా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని చెప్పింది. వాస్తవానికి వరవర రావుకు కేవలం ఆరు నెలలకు మాత్రమే బెయిల్ ఇచ్చారని, ఇప్పటికే పలుమార్లు ఆయన బెయిల్ ను పొడిగించారని ఎన్ఐఏ తరఫు అడ్వొకేట్ సందేశ్ పాటిల్ వాదించారు. ఎన్ఐఏ వాదనలను తోసిపుచ్చిన కోర్టు.. వరవర రావు మెడికల్ బెయిల్‌ను ఫిబ్రవరి 5 వరకు పొడగిస్తూ తీర్పునిచ్చింది. ఆయన దాఖలు చేసిన శాశ్వత బెయిల్ పిటిషన్ పై ఆ రోజే విచారణ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.

Related Articles

Latest Articles