రివ్యూ: ది బేకర్ అండ్ ది బ్యూటీ (వెబ్ సీరిస్)

ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ తన బాహువులను విస్తరింపచేస్తోంది. పరభాషా డబ్బింగ్ సినిమాలను స్ట్రయిట్ గా ఓటీటీలో విడుదల చేయడంతో పాటు, థియేట్రికల్ రిలీజ్ అయిన తెలుగు మూవీస్ ను ఆలస్యం చేయకుండా వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇక ‘వివాహ భోజనంబు’ వంటి కొత్త కార్యక్రమాలనూ షురూ చేసింది. ఎంతో కాలంగా వెబ్ సీరిస్ లను ప్రసారం చేస్తున్న ఆహా విదేశీ వెబ్ సీరిస్ ను అడాప్ట్ చేసుకుని ‘కమిట్ మెంటల్’, ‘తరగతి గది దాటి’ వంటి వాటిని స్ట్రీమింగ్ చేసింది. తాజాగా ఇజ్రాయిల్ వెబ్ సీరిస్ ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ తెలుగు అడాప్షన్ ను అదే పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, ఆహా ఈ నెల 10వ తేదీ నుండి ప్రసారం చేస్తోంది.

కథ విషయానికి వస్తే విజ్జు… విజయ్ దాసరిపల్లె (సంతోష్‌ శోభన్) మధ్య తరగతికి చెందిన కుర్రాడు. అతని తల్లిదండ్రులు పద్మ, వెంకటేశ్వర్లు (ఝాన్సీ, శ్రీకాంత్ అయ్యంగార్)కు ఓ బేకరీ, దానితో పాటే సూపర్ మార్కెట్ ఉంటుంది. తన తమ్ముడు విక్కీ (సంగీత్ శోభన్‌), చెల్లి మీరా (సాయి శ్వేత) సహకారంతో ఈ రెండింటి నిర్వహణ విజయ్ చేస్తుంటాడు. విజయ్ తో దాదాపు తొమ్మిదేళ్ళ సాన్నిహిత్యం ఉన్న గర్ల్ ఫ్రెండ్ మహేశ్వరి (విష్ణుప్రియ) ఓ రోజున విజయ్ కు కెఫేలో ప్రపోజ్ చేస్తుంది. కానీ అతను కొంచెం సమయం కావాలంటాడు. దాంతో సహనం కోల్పోయిన మహీ చేతిలోని సూప్ ను అతని మీద పోసి వెళ్ళిపోతుంది. ఈ తతంగాన్ని అంతా అక్కడే ఉన్న ప్రముఖ మోడల్, సినీ నటి ఐరా వాసిరెడ్డి (టీనా శిల్పరాజ్), ఆమె బృందం గమనిస్తుంది. జస్ట్ దానికి ముందే ఐరాకు రోహన్ కపూర్ (కేతన్ సాయి)తో బ్రేకప్ అయి ఉంటుంది. దాంతో కాస్తంత డిప్రెషన్ లో ఉన్న ఐరా దృష్టి విజ్జు మీద పడుతుంది. మహి నుండి చేదు అనుభవం ఎదుర్కొన్న విజ్జు సైతం ఐరా కంపెనీని ఎంజాయ్ చేస్తాడు. ఊహించని ఈ కొత్త బంధం వీరి జీవితాలను ఏ తీరాలకు చేర్చిందన్నదే మిగతా కథ.

బేకరి నడుపుకునే ఓ సాధారణ యువకుడు, స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడితే చుట్టూ ఉన్నవారి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆ హీరోయిన్ ను ప్రొటక్ట్ చేయాలని చూసే మేనేజర్ ఎలాంటి ఎత్తులు పైఎత్తులు వేస్తాడు? అనేది ఆసక్తికరమైన అంశమే. అయితే ఇది విజ్జు, ఐరాకు సంబంధించిన ప్రేమకథ మాత్రమే కాదు. సింగర్ కావాలనుకునే విజ్జు తమ్ముడు విక్కీ ఆశలు, అమ్మాయిలను ఇష్టపడే విజ్జు చెల్లి మీరాకు సంబంధించిన వ్యవహారాలూ ఇందులో ముడిపడి ఉన్నాయి.

పది ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సీరిస్ తొలి రెండు భాగాలు ఫుల్ కామెడీతో సాగాయి. విజ్జు, మహి ప్రేమాయణం, ఆ వెంటనే అది బ్రేకప్ కావడం, విజ్జును ఐరా తన కారులో ఎక్కించుకుని గచ్చిబౌలీ రోడ్స్ మీద తిప్పడంతో దర్శకుడు జోనాధన్ సూటిగా, సుత్తిలేకుండా భలే కధలోకి తీసుకెళ్ళాడే అనిపిస్తుంది. అలానే సెకండ్ ఎపిసోడ్ ‘జూబ్లీ హిల్స్ సూపర్ మ్యాన్’ లో కూడా ఐరా పార్టీకి వెళ్ళిన విజ్జు అక్కడ ఎలా బకరా అయ్యోడో తెలుపుతుంది. ఇది కూడా వినోదాల విందును వడ్డించే భాగమే. ఆ తర్వాత ఐరాతో కలిసి విజ్జు దుబాయ్ వెళ్ళడం, అక్కడ బాలీవుడ్ నిర్మాతతో ఐరాకు ఎదురయ్యే చేదు అనుభవాలు సైతం థ్రిల్ ను కలిగిస్తాయి. కానీ ఎప్పుడైతే ఐరా సెక్రటరీ లక్ష్మీ (వెంకట్) వీరిద్దరి ప్రేమకు అడ్డు నిలబడాలని చూడటం మొదలెట్టాడో అక్కడ నుండి కథ పలచబడిపోయింది. తిరిగి ఐదో భాగం ‘ఫెస్టివల్ ఆఫ్ లైస్’ వినోదాన్ని పంచింది. కానీ అక్కడ నుండి విజ్జు- ఐరా మధ్య సాగే ఆన్ అండ్ ఆఫ్ లవ్ ఎపిసోడ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. కథ ఎంతకూ ముందుకు సాగదేమిటీ అనిపిస్తుంది. తొమ్మిదేళ్ళ ప్రయాణం తర్వాత కూడా విష్ణు ప్రియను తిరస్కరించడానికి విజ్జు కారణాలు వెత్తుక్కోవడం కన్వెన్సింగ్ లేదు. లేనిపోని భయాలు, ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్స్ తో విజయ్; మాజీ బాయ్ ఫ్రెండ్ తన జీవితంలోకి తిరిగి వస్తే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని అసందిగ్థావస్థలో ఐరా; తనకు దక్కని విజయ్ ప్రేమ ఐరాకూ దక్కకూడదని అడ్డదారులు తొక్కే మహి; ఐరా జీవితం నుండి విజయ్ ను ఎలానైగా తప్పించాలనుకునే మేనేజర్ లక్ష్మీ… వీరి చర్యలను నిజానికి మరింత ఆసక్తికరంగా చూపించి ఉండాల్సింది. కానీ చివరి మూడు , నాలుగు ఎపిసోడ్స్ లో అది కరువైంది. దానికి తోడు విజ్జు చెల్లి లెస్బియన్ కావడం, తమ్ముడు విక్కీ పక్కదారులు తొక్కి అయినా డబ్బులు సంపాదించుకోవాలను కోవడంతో ఆ పాత్రలు వ్యూవర్స్ సానుభూతిని కోల్పోతాయి. ఒకానొక దశలో తండ్రికి విజయ్ క్లాస్ పీకడం, అలానే మహి చర్యను సమర్థిస్తూ పక్కింటి సుశీ ఆంటీ ఏకంగా విజ్జు తల్లిని కుటుంబ సభ్యులు అందరి ముందు లిప్ కిస్ చేయడం వ్యూవర్స్ డైజెస్ట్ చేసుకోలేని అంశాలు.

విదేశీ వెబ్ సీరిస్ ను మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చుకోవడం అనేది చాలా కామన్. అయితే పాత్రధారులతో తెలంగాణ యాస మాట్లాడించినంత మాత్రాన నేటివిటీ వచ్చేయదు! మన ఆచార వ్యవహారాలు, మన సంప్రదాయాలను ఆ పాత్ర ద్వారా తెర మీద చూపించాలి. అలా కాకుండా అసహజమైన, అనైతికమై లెస్బియనిజం, గే కల్చర్ ను ప్రోత్సహించే విధంగా ఇలాంటి వెబ్ సీరిస్ తీయడం దారుణం. చట్టపరంగా వాటికి ఓ స్థాయిలో ఆమోదం దక్కి ఉండొచ్చు. కానీ చట్టపరంగా జరిగేదంతా మంచి అని చెప్పలేం. మన కుటుంబ వ్యవస్థలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. వాటిని సినిమాల ద్వారా ఈ తరానికి నేర్పకపోయినా ఫర్వాలేదు కానీ ఆ వ్యవస్థను విచ్ఛినం చేసే చర్యకు దర్శక నిర్మాతలు పాల్పడటం సరికాదు. గతంలో గే వ్యవహారాన్ని తెలుగు సినిమాల్లో కామెడీ కోసం ఉపయోగించే వారు. ఇప్పుడు అది ఆమోద ముద్ర వేసే వరకూ వచ్చింది. ఈ తీరు ఇలానే కొనసాగితే భవిష్యత్తులో మన స్టార్ హీరోలను గే గా, హీరోయిన్లను లెస్బియన్స్ గా చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి పాత్రల ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం వెళుతుందో ఊహించుకోవచ్చు.

నటీనటుల విషయానికి వస్తే… సంతోష్ శోభన్, రాహుల్ విజయ్ ఈ మధ్యకాలంలో తెలుగు తెరకు లభించిన ప్రామిసింగ్ యంగ్ ఆర్టిస్టులు. రాహుల్ విజయ్ సినిమాలతో పాటు ఇటీవలే ‘కుడిఎడమైతే’ వెబ్ సీరిస్ లో చేశాడు. అలానే ‘ఏక్ మినీ కథ’తో గుర్తింపు తెచ్చుకున్న సంతోష్‌ శోభన్ ఇప్పుడీ వెబ్ సీరిస్ లో నటించి మెప్పించాడు. చక్కని పెర్ఫార్మెన్స్ ను అతని నుండి దర్శకుడు రాబట్టుకున్నాడు. విశేషం ఏమంటే… అతని తమ్ముడు, ఆ మధ్య వచ్చిన ‘పిట్టకథలు’ అంథాలజీలో నటించిన సంగీత్ శోభన్ ఇందులో విక్కీ పాత్రను చేశాడు. అంటే తన సొంత అన్నకు తమ్ముడిగా! అతనిలో చలాకీ దనం బాగానే ఉంది కానీ ఆ క్యారెక్టరైజేషన్ కు సరైన తీరూతెన్నూలేకుండా దర్శకుడు చేశాడు. స్టార్ హీరోయిన్ గా టీనా శిల్పరాజ్ ను యాక్సెప్ట్ చేయడం కొంత సమయం వరకూ కష్టంగా అనిపించింది. ఓ రకంగా ఆమె కంటే మహి పాత్రధారి విష్ణుప్రియ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అయితే టీనా లవ్ లోని పెయిన్ ను బాగా ఎక్స్ ప్రెస్ చేసింది. ఇక విష్ణు ప్రియ కాస్తంత లౌడ్ ఎక్స్ ప్రెషన్స్ తో తన పాత్రకు న్యాయం చేకూర్చింది. చివరి రెండు ఎపిసోడ్స్ లో విష్ణుప్రియ క్యారెక్టర్ లోని గ్రే షేడ్స్ ను చూపించారు. అక్కడా ఆమె చక్కని పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలానే ఝాన్సీ, శ్రీకాంత్ అయ్యంగార్, సాయిశ్వేత, తరుషా సక్సేనా చక్కగా నటించారు. ఈ వెబ్ సీరిస్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి నటుడు వెంకట్. హీరోయిన్ మేనేజర్ పాత్రకు సరిగ్గా సూట్ అయ్యాడు. వెంకట్ బాడీ లాంగ్వేజ్, వాయిస్ కల్చర్, యాక్టింగ్ అంతా చక్కగా సెట్ అయ్యింది. ఈ మధ్యే వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’లో హీరోయిన్ అన్నగా నటించిన వెంకట్ కు అక్కడ సరైన న్యాయం జరగలేదు. ఆ లోటును ఈ వెబ్ సీరిస్ తో తీరింది. సో… వెంకట్ కు రైట్ కమ్ బ్యాక్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు!

‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ ప్లస్ పాయింట్ దాని సాంకేతిక నిపుణులు కూడా. ప్రశాంత్ ఆర్. విహారి అందించిన నేపథ్య సంగీతం సూపర్. అలానే సురేశ్ రఘుతు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో తీసిన సన్నివేశాలను పక్కన పెడితే, అవుట్ డోర్ లో సీన్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. నాగార్జున తల్లపల్లి సౌండ్ డిజైనింగ్ ఇంప్రసివ్ గా ఉంది. సాహితీ ప్రకాశ్‌, అభిషేక్ మహర్షి, మహేశ్వరరెడ్డి రాసిన సంభాషణలు బాగున్నాయి. క్యారెక్టర్స్ ను దృష్టిలో పెట్టుకుని సంభాషణలు సాగడం విశేషం. అయితే చివరి ఎపిసోడ్స్ లో ఎడిటింగ్ కాస్తంత పూర్ గా ఉంది. ఓ ఫీల్ గుడ్ సీన్ సాగుతున్న సమయంలో ఠక్కున కట్ చేసి మరో సన్నివేశంలోకి వెళ్ళిపోవడం బాగాలేదు. దాంతో ఏ సన్నివేశంతోనూ వ్యూవర్ కనెక్ట్ కాలేని పరిస్థితి ఏర్పడింది. క్లయిమాక్స్ చివరి అరగంట ఇలాంటి షార్ట్ డివిజన్ ఓకే కానీ చాలా ఎపిసోడ్స్ లో అలానే జరిగింది. సుప్రియ యార్లగడ్డ అన్నపూర్ణ స్టూడియోస్ గుడ్ విల్ ను నిలబెట్టే విధంగా ఈ వెబ్ సీరిస్ నిర్మించారు. దర్శకుడు జోనాథన్ గతంలో ‘అమరం అఖిలం ప్రేమ’ ను డైరెక్ట్ చేశాడు. సినిమా రంగంలో ఉన్న అనుభవం ఈ వెబ్ సీరిస్ రూపకల్పనకు తోడ్పడింది. కానీ లాస్ట్ ఎపిసోడ్స్ ని మరింత గ్రిప్ గా తీయాల్సింది. నిజానికి పది ఎపిసోడ్స్ కు కమిట్ కాకుండా ఆరు, ఏడు ఎపిసోడ్స్ తో దీనిని క్రిస్ప్ గా ముగించి ఉంటే ఇంకా బాగుండేది. లెన్బియన్ వ్యవహారాన్ని పరిహరించి ఉంటే… కుటుంబమంతా కలిసి చూసే వెబ్ సీరిస్ గా ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ గుర్తింపు పొంది ఉండేది.

ప్లస్ పాయింట్స్
కథలోని కొత్తదనం
నటీనటుల నటన
మేకింగ్ వ్యాల్యూస్
మ్యూజిక్ అండ్ ఫోటోగ్రఫీ

మైనెస్ పాయింట్స్
ఏకంగా పది ఎపిసోడ్స్ ఉండటం
క్లయిమాక్స్ గ్రిప్పింగ్ గా లేకపోవడం
లవ్ సీన్స్ ను కన్వెన్సింగ్ గా చూపకపోవడం

రేటింగ్ : 3 / 5

ట్యాగ్ లైన్: బేకింగ్ కంటే బాగున్న బ్యూటీ!

SUMMARY

ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ తన విహంగాలను విస్తరింపచేస్తోంది. పరభాషా డబ్బింగ్ సినిమాలను స్ట్రయిట్ గా ఓటీటీలో విడుదల చేయడంతో పాటు, థియేట్రికల్ రిలీజ్ అయిన

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-