రాజకీయ నేతలు – సినిమా వాళ్ళ ఆస్తుల లెక్క తీద్దామా!? తమ్మారెడ్డి భరద్వాజ

కోవూరు శాసన సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సినిమా రంగానికి చెందిన వ్యక్తులపై చేసిన వ్యాఖ్యలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రంగా ఖండించారు. సినిమా వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదిస్తారే కానీ ఎవరినీ దోచుకుని ఆస్తులు కూడగట్టుకోవడం లేదని అన్నారు. అదే భావనలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే… ప్రజా ప్రతినిధులు, సినిమా వాళ్ళ ఆస్తుల లెక్కలు తీద్దామా!? అంటూ ఆయన సవాల్ విసిరారు. సినిమా రంగానికి కులాన్ని, మతాన్ని ఆపాదించడం ఎంతమాత్రం సరికాదని భరద్వాజ అన్నారు. ప్రతిభతో వ్యక్తులను ఎంపిక చేసుకుని వారిని ఉపయోగించే ఒకే ఒక్కటి సినిమా రంగమని, కులం చూసి ఎవరికీ ఇక్కడ అవకాశాలు ఇవ్వరని భరద్వాజ అన్నారు. సిగ్గు, దమ్ము, ధైర్యం సినిమా రంగంలో ఉన్న అందరికీ ఉన్నాయని, ఎవరికో భయపడి ఉండాల్సిన అవసరం తమకు లేదని భరద్వాజ అన్నారు. తెలుగు సినిమా వాళ్ళకు బలిసింది అంటూ ఓ శాసన సభ్యుడు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమైనవని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

Read Also : ‘డోంట్ మ్యారీ… బీ హ్యాపీ’… నాగ చైతన్య ఫుల్ చిల్

ఇదే సమయంలో సినిమా టిక్కెట్ రేట్లను తెలంగాణ ప్రభుత్వానికి పెంచే హక్కు ఉన్నట్టుగానే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తగ్గించే హక్కు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే సినిమా టిక్కెట్ రేట్లు మరీ తక్కువ ఉన్న సమయంలో చట్టం సాయంతో నిర్మాతలు టిక్కెట్ రేట్లను ఫెక్సిబుల్ గా, వేరియబుల్ గా పెంచుకోవచ్చని, ఆ విధమైన ప్రయత్నం చేస్తే మంచిదని సలహా ఇచ్చారు. ఇక ‘ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్’ చిత్రాల విడుదల వాయిదా పడటాన్ని ఏపీలో టిక్కెట్ రేట్లు తగ్గడమే కారణం అంటూ కొందరు అంటున్నారని, కానీ అందులో వాస్తవం లేదని అన్నారు. ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలు దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాయిదా పడ్డాయే కానీ తగ్గిన టిక్కెట్ రేట్ల కారణంగా కాదని ఆయన తెలిపారు. తెలంగాణలో టిక్కెట్ రేట్లు పెంచిన కారణంగా ‘అర్జున ఫాల్గుణ’ వంటి సినిమా చచ్చిపోయిందని, ఎగ్జిబిటర్స్ మేల్కొని సినిమా టిక్కెట్ రేట్ తగ్గించే సరికే జరగాల్సిన డామేజ్ జరిగిపోయిందని అన్నారు.

Read Also : ఏపీలో థియేటర్ల సమస్యపై మాట్లాడతా… – మంత్రి తలసాని

‘అఖండ, పుష్ప’ లాంటి సినిమాలు కంటెంట్ కారణంగా టిక్కెట్ రేట్లు తక్కువ ఉన్నా ప్రజాదరణ పొందాయని, ఈ విషయాన్ని కూడా గమనించాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ టిక్కెట్ రేట్లను క్రమబద్ధీకరించడానికి కమిటీని వేసిందని, దాని ద్వారా ఓ పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. టిక్కెట్ రేట్ల విషయంలో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ కల్పించుకోవడం లేదంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు కూడా కరెక్ట్ కాదని, ఆ విషయాలు మాట్లాడటానికి ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి ప్రతినిధులు ఉన్నారని అన్నారు. ఒకవేళ సినిమా రంగంలోని వారు కులాలను ప్రస్తావించినా, అది తప్పేనని అన్నారు. అదే విధంగా ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం మంచిదని, దానిని తీసుకురావాలని ఎప్పటి నుండో తామే కోరుతున్నామని అన్నారు. ప్రభుత్వం కాకుండా దానిని ఎఫ్‌.డి.సి. నిర్వహించడం మంచిదని, అదే పని ఏపీ ప్రభుత్వం చేస్తానని చెప్పడం హర్షణీయమని అన్నారు. బుక్ మై షో లాంటి వారు దారుణమైన దోపిడీ చేస్తున్నారని, ఈ రెండు ప్రభుత్వాలు సరైన వారికి అప్పగిస్తే బాగుంటుందని అన్నారు.

Related Articles

Latest Articles