ట్యాంక్‌ బండ్‌లో గణేష్‌ నిమజ్జనంపై ఉత్కంఠ..!

నిమజ్జనంపై తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. హైకోర్టు తీర్పుతో సిటీలో గణేశ్‌ నిమజ్జనంపై .. గందరగోళం నెలకొంది. నిమజ్జనం నిబంధనలకు సంబంధించి తీర్పును పునఃసమీక్షించలేమని.. హైకోర్టు తేల్చి చెప్పడంతో సిటీలోని భారీ గణనాథుల నిమిజ్జనంపై సందిగ్ధం ఏర్పడింది. ట్యాంక్ బండ్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనానికి హైకోర్టు నిరాకరించడంతో.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది జీహెచ్‌ఎంసీ. దీనిపై రేపు ఉదయం విచారణ చేపట్టనున్న అత్యున్నత ధర్మాసనం.. ఎలాంటి తీర్పునిస్తుందనేది ఉత్కంఠరేపుతోంది. ఇప్పటికే ట్యాంక్ బండ్‌లో నిమజ్జనం ఏర్పాట్లు మొదలు పెట్టారు అధికారులు. మరోవైపు ట్యాంక్ బండ్ లోనే గణేష్ నిమజ్జనం చేస్తామంటుంది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. పోలీసులు అడ్డుకుంటే.. అక్కడే నిరసన చేపడతామని హెచ్చరించింది ఉత్సవ సమితి. దీంతో, నిమజ్జనం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు తీర్పు పై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పోలీసులూ అయోమయంలో పడ్డారు. దీంతో, ప్రత్యమ్నాయ ఏర్పాట్ల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

తిథి బాగుండటంతో.. హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనాన్ని ఈనెల 19న నిర్వహించాలని అధికారికంగా నిర్ణయించారు. పోలీసులు కూడా అందుకు అనుగుణంగానే బందోబస్తు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. హైకోర్టు తీర్పు, తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో ఈ ప్రణాళికలో మార్పులు చేర్పులు చేశారు. ప్రధాన నిమజ్జనోత్సవానికి ముందే.. కొన్ని విగ్రహాలను స్థానిక కుంటల్లో నిమజ్జనం చేస్తే చివరిరోజున ఒత్తిడి తగ్గించవచ్చని భావిస్తున్నారు. మట్టిగణపతులపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో.. వాటి నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు ప్రారంభించింది. పీవోపీ విగ్రహాలను చెరువులు, హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని ఇచ్చిన ఆదేశాల్లో ఎలాంటి మార్పు లేదని హైకోర్టు స్పష్టం చేయడంతో.. బల్దియా అధికారులు చర్యలు ప్రారంభించారు. నిమజ్జన కేంద్రాల దగ్గర క్రేన్లు ఏర్పాటు చేస్తామనీ… గజ ఈతగాళ్లు, నిమజ్జన వ్యర్థాల తొలగింపు కోసం సిబ్బందిని కేటాయిస్తామనీ చెప్పారు. అయితే, కేవలం మట్టి ప్రతిమలనే నిమజ్జనానికి అనుమతిస్తామని ఇంజినీరింగ్‌ విభాగం స్పష్టం చేసింది.

మరోవైపు, మంత్రి తలసాని శ్రీనివాస్ తో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, వీహెచ్‌పీ ప్రతినిధులు సమావేశమయ్యారు. వినాయక నిమజ్జనం, కోర్ట్ ఆదేశాల పై చర్చించారు. నిమజ్జనం జరపొద్దని కోర్టు ఎక్కడా చెప్పలేదన్నారు ఉత్సవ సమితి సభ్యులు. ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసైనా.. ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. అయితే, నిమజ్జనంపై సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకుంటామన్నారు మంత్రి తలసాని. నగరంలోని చెరువులు, మినీ పాండ్స్‌ వద్ద వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసేలా.. ఏర్పాట్లు చేసింది. పది అడుగుల కంటే చిన్న విగ్రహాలను మినీ పాండ్స్‌లో నిమజ్జనం చేస్తున్నారు. పది అడుగులకు మించి ఎత్తున్న విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేసేలా భారీ క్రేన్లను ఏర్పాటు చేసింది. నగరంలోని చెరువుల వద్ద ఇప్పటికే నిర్మించిన మినీపాండ్స్‌ దగ్గర నిమజ్జనాలు జరుగుతున్నాయి. పెద్ద సైజు విగ్రహాల కోసం క్రేన్లను అందుబాటులో ఉంచారు. కూకట్‌పల్లి చెరువు దగ్గర వద్ద ఈ ఏడాది అదనంగా క్రేన్లు ఏర్పాటు చేశారు. చెరువు వద్ద ఉన్న పాండ్స్‌లో చిన్న విగ్రహాలను… భారీ విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. పూజ సామగ్రిని చెరువులో, పాండ్‌లో వేయకుండా ప్రత్యేకంగా బాక్స్‌లను ఏర్పాటు చేశారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-