అనంతపురం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్‌..!

ముహూర్తం దగ్గర పడుతోంది. అలాగే ఆశావహుల్లో టెన్షన్‌ కూడా పెరిగిపోతోంది. జిల్లాకు ఎన్ని పదవులు వస్తాయో ఏమో కానీ.. వాటికోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య మాత్రం చాలానే ఉంది. అయితే సీనియారిటీ, సామాజిక కోణాల్లో అధినేత వేటికి ప్రాధాన్యం ఇస్తారో అర్థంకాక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఆశావహులు.

అనంతలో మంత్రి పదవి కోసం ఐదుగురు పోటీ..!

ప్రస్తుతం అనంతపురం అధికారపార్టీలో వినిపిస్తున్నది ఒక్కటే మాట. నెక్ట్స్‌ మంత్రిగా ఎవరికి ఛాన్స్ వస్తుంది. త్వరలోనే కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు అవకాశాలు ఉండటంతో నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటికే కేబినెట్‌లోకి ఎవర్ని తీసుకోవాలన్న దానిపై సీఎం జగన్ టీం ఒక క్లారిటీకి వచ్చిందని, అయినా చివరి నిమిషంలో మార్పులు ఉంటాయని ఆశావహులు ఆశిస్తున్నారు. మంత్రివర్గంలోకి తీసుకునే వాళ్లలో ఉన్నారంటూ.. అనంతపురం జిల్లాలో ప్రధానంగా ఐదుగురి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్, శింగనమల ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. జిల్లాలో ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలు రేసులో ఉన్నా ప్రధానంగా ఈ ఐదుగురిలో ఎవరో ఒకరికి కేబినెట్‌లో చోటు ఖాయమని చర్చ జరుగుతోంది.

సీనియారిటీనా.. సామాజిక సమీకరణమా?

కేబినెట్‌లో చోటు ఆశిస్తోన్న వారిలో ఎవరి ప్లస్‌లు వారికి ఉన్నాయి. ఇందులో సీనియారటీ ఒకటి, సామాజికవర్గ సమీకరణాలు, పార్టీకోసం పనిచేయడం మరొకటి. అయితే అధిష్ఠానం వీటిల్లో వేటిని పరిగణనలోకి తీసుకుంటుందో తెలియడం లేదు. జిల్లాలో ప్రస్తుతం మంత్రిగా ఉన్న శంకర నారాయణ కురుబ కులానికి చెందిన వారు. ఈ సామాజికవర్గం నుంచి శంకర నారాయణను తప్పిస్తే.. అదే కులానికి చెందిన ఉషాశ్రీ చరణ్‌కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుందట. అందులో ఆమెకు మాహిళా కార్డు పనిచేసే అవకాశం ఉంది. ప్రస్తుతం బీసీలకైతే ఒకరికి ఛాన్స్‌ ఉంటుందని టాక్‌. ఉషాశ్రీ చరణ్‌కు అవకాశం ఇవ్వకపోతే.. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రేస్‌లో ఉంటారు. రామచంద్రారెడ్డి సీఎం జగన్‌కు సన్నిహితుడు. మొదటి నుంచి జగన్‌తో ఉన్నారు.

ఇద్దరికి ఛాన్స్‌ ఇస్తే.. ఒకటి రెడ్డి సామాజికవర్గానికి ఇస్తారా?

ఇక జిల్లాలో ఇద్దరు మంత్రులకు ఛాన్స్‌ ఉంటే మాత్రం ఈసారి రెడ్డి సామాజికవర్గం నుంచి అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి బలంగా పోటీ పడుతున్నారు. వీరిలో అనంత వెంకట్రామిరెడ్డి సీనియర్‌. అనుభవం ఉన్న నేత. ఎంపీగా పనిచేసిన అనంతను .. జగన్‌ ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. మొదట్లో అనంత ఇష్టపడకున్నా.. జగన్‌ నచ్చజెప్పడంతో సరే అన్నారు. దాన్నే ఆయన ఇప్పుడు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. ఇక ప్రకాష్‌రెడ్డి పరిటాల ఫ్యామిలీపై 15 ఏళ్లుగా పోరాటం చేసి గెలిచారు. అది తనకు ప్లస్‌ అనుకుంటున్నారట.

ఎస్సీ కోటాలో బెర్త్‌ ఆశిస్తున్న శింగనమల ఎమ్మెల్యే..!

ఇక ఎస్సీ కోటాలో ఛాన్స్‌ వస్తే శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే పద్మావతి భర్త సాంబశివారెడ్డి సీఎం జగన్‌కు సన్నిహితమనే ప్రచారం ఉంది. అంతేకాకుండా మహిళా కోటా కూడా పనికి వస్తుందని ఆమె లెక్కలు వేసుకుంటున్నారు. గతంలో అయితే ఏ ప్రభుత్వం ఉన్నా సీనియారిటీ ప్రాతిపదికన మంత్రి పదవులు వచ్చాయి. కానీ.. సీఎం జగన్‌ అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఫస్ట్‌ టైమ్‌ గెలిచిన శంకర నారాయణను మంత్రిని చేశారు. మరి.. ఇప్పుడు అలాంటి నిర్ణయమే ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఎన్నికల టీమ్‌ను రెడీ చేసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్‌.. అందుకు తగ్గట్టే కేబినెట్‌ కూర్పు జరిగేలా ఉండొచ్చని ఇంకో విశ్లేషణ. మరి.. అనంతలో కిరీటం ఎవరికి దక్కుతుందో చూడాలి.

-Advertisement-అనంతపురం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్‌..!

Related Articles

Latest Articles