పదేళ్ళ ‘శ్రీరామరాజ్యం’

పౌరాణిక చిత్రాల రూపకల్పనలో తెలుగువారిదే పైచేయి. అంతకు ముందు, ఆ తరువాత ఎందరు పౌరాణిక చిత్రాలు తీసి విజయాలు సాధించినా, పురాణగాథలతో తెరకెక్కిన తెలుగువారి చిత్రాల ముందు వెలవెల బోయాయనే చెప్పాలి. ఇక మన తెలుగు చిత్రసీమ పౌరాణిక చిత్రాలలో నిస్సందేహంగా ‘శ్రీలలితా శివజ్యోతి’ వారి పంచవర్ణ చిత్రం ‘లవకుశ’ అగ్రస్థానంలో నిలుస్తుంది. తెలుగువారి తొలి రంగుల చిత్రంగా రూపొందిన ‘లవకుశ’ 1963 మార్చి 29న వెలుగు చూసింది. తెలుగునాట తొలి వజ్రోత్సవ చిత్రంగా ‘లవకుశ’ చరిత్ర సృష్టించింది. ఈ నాటికీ ఆ స్థాయిలో విజయం సాధించిన పురాణ చిత్రమేదీ మన ముందు నిలువలేదు. ఇక అందులోని కథావస్తువు ఉత్తర రామాయణంలోని సీతాపరిత్యాగము, లవకుశుల జననం, శ్రీరామునితో కుశలవుల పోరాటం, సీతారాములు వైకుంఠం చేరుట ప్రధానాంశాలు. ఇదే కథను తరువాత ఎందరు తెరకెక్కించినా, అంతగా అలరించలేకపోయారు. ఇక 1963 నాటి ‘లవకుశ’లో నటీనటుల ప్రతిభ, సాంకేతిక నిపుణుల ప్రావీణ్యం అన్నీ సమతూకంగా సాగి ఆ చిత్రాన్ని ప్రేక్షకుల మదిలో సుస్థిరస్థానం సంపాదించేలా చేశాయి. ఆ చిత్రకథతోనే బాపు దర్శకత్వంలో బాలకృష్ణ శ్రీరామునిగా, నయనతార సీతగా యలమంచి సాయిబాబు ‘శ్రీరామరాజ్యం’ నిర్మించారు. 2011 నవంబర్ 17న ఈ చిత్రం జనం ముందు నిలిచింది.

నిజం చెప్పాలంటే అంతకు ముందే యన్టీఆర్ జీవించి ఉండగా, బాపు-రమణ కలయికలో రామారావు ‘ఉత్తర రామాయణం’ తీయాలని భావించారు. అయితే ‘లవకుశ’ వంటి మహత్తర చిత్రరాజం ఉండగా, ఆ సాహసం చేయలేమని బాపు-రమణ చెప్పారు. దాంతో యన్టీఆర్ ఆ ప్రయత్నం మానుకున్నారు. తరువాత వారితోనే తన చివరి చిత్రంగా విడుదలయిన ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’ నిర్మించారు. అయితే యన్టీఆర్ తో చేయలేని సాహసం బాపు-రమణ, ఆయన తనయుడు బాలకృష్ణతో చేశారు. తత్ఫలితమే ‘శ్రీరామరాజ్యం’. ఈ చిత్రంలో కాలానుగుణంగా చోటు చేసుకున్న సాంకేతిక అభివృద్ధి చక్కగా చొప్పించారు. తప్పితే ఎక్కడా ‘లవకుశ’తో పోటీపడలేకపోయారనే చెప్పాలి. తొలి రంగుల చిత్రం ‘లవకుశ’లోనే శ్రీరామునిగా నటించిన యన్టీఆర్ కు నీలమేఘశ్యామునిగా మేకప్ చేసిన తీరుకు, సాంకేతికంగా ఎంతగానో అభివృద్ధి చెందిన తరుణంలో ‘శ్రీరామరాజ్యం’లో బాలకృష్ణ వేషధారణకు ఎంతో తేడా ఉంది. పైగా ఈ చిత్రానికి దర్శకులు బాపు స్వతహాగా విఖ్యాత చిత్రకారులు. అందువల్ల కలర్ కాంబినేషన్ సెట్ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మరి ఎందుకనో, శ్రీరాముని మేకప్ విషయంలో పొరబాటు జరిగిందని చెప్పవచ్చు.

ఇక సంగీతం విషయానికి వస్తే – ‘లవకుశ’లోని అన్ని పాటలనూ జనరంజకంగా స్వరకల్పన చేశారు ఘంటసాల మాస్టారు. ఆ స్థాయిలో కాకపోయినా, ఇళయరాజా సైతం తన చేతనైన రీతిలో ‘శ్రీరామరాజ్యం’కు బాణీలు కట్టారు. ఆయన స్వరకల్పనలో “జగదానంద కారకా..”, “దేవుళ్ళే మెచ్చింది… మీ ముందు నిలిచింది…”, “సీతారామ చరితం…”, “సీతా శ్రీమంతము…”, “ఎవరున్నారీ లోకంలో…” వంటి పాటలు అలరించాయి. ‘లవకుశ’ ప్రభావం నుండి తప్పించుకోను వీలుకాదని చాటుతూ, ఓ సన్నివేశంలో లవకుశ పాత్రధారుల నోట “లేరు కుశలవులకు సాటి…” అనే పాత పాటనే పలికించారు. అన్ని పాటలను జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాశారు.

నటీనటుల నుండి తనకు కావలసిన అభినయాన్ని రాబట్టుకోవడంలో సిద్ధహస్తులు బాపు. ఇందులో బాలకృష్ణతో సాత్వికాభినయాన్నే పండించేలా చేశారు. ఇక సీత పాత్రలో నయనతారను ఒదిగిపోయేలా చేశారు బాపు. అందువల్లే ఈ సినిమా ద్వారా నయనతారకు ఉత్తమనటిగా నంది అవార్డు కూడా లభించింది. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది దక్కింది. వీటితో పాటు ఉత్తమ సంగీత దర్శకునిగా ఇళయరాజా, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా రాజు, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా పి.రాంబాబు, బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా శ్రీను నంది అవార్డులు సంపాదించారు.

ఈ చిత్రాన్ని జనంలోకి తీసుకుపోవడంలో నిర్మాత యలమంచి సాయిబాబు చక్కని ప్రణాళికను అనుసరించారు. విశేషమైన లాభాలు ఆర్జించక పోయినా, ఈ చిత్రంపై తరగని అభిమానంతో హైదరాబాద్ శాంతి థియేటర్ లో డైరెక్టుగా వందరోజులు ప్రదర్శితమయ్యేలా చేసి ఆనందించారు నిర్మాత. బాపు-రమణ చివరి చిత్రంగా తెరకెక్కిన ‘శ్రీరామరాజ్యం’ నవతరం ప్రేక్షకులకు కొత్తగా కనిపించింది. దాంతో చాలా ఊళ్ళలో మొదటి రెండు వారాలు మంచి వసూళ్ళు చూసిందీ చిత్రం. తరువాత చప్పబడింది. ఏది ఏమైనా ‘లవకుశ’ వంటి మహత్తర చిత్రరాజాన్ని పునర్నిర్మించడం అన్నది సాహసమే! ఫలితం ఎలా ఉన్నా, తమ సాహసాన్ని చేసి చూపించారు ‘శ్రీరామరాజ్యం’ చిత్ర బృందంలోని సభ్యులు.

Related Articles

Latest Articles