వీకెండ్ లో ఏకంగా పది చిత్రాలు!

నవంబర్ మొదటి రెండు వారాలు కలిపి దాదాపు పది తెలుగు చిత్రాలు విడుదలయ్యాయి. అయితే అందుకు భిన్నంగా ఒక్క మూడో వారంలోనే పది సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటం విశేషం. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుండే పెద్ద చిత్రాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో మరో రెండు నెలల పాటు తమకు థియేటర్లు దొరకవేమోననే ఆందోళనలో చిన్న చిత్రాల నిర్మాతలు ఉన్నారు. ఎందుకంటే డిసెంబర్ తో పాటు జనవరిలోనూ అగ్ర కథానాయకుల చిత్రాలు మూడు పండగ బరిలో నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల మూడు, నాలుగు వారాల్లో కనుక సినిమా విడుదల చేయకుంటే, రెండు నెలలు తమ చిత్రాలను వాయిదా వేసుకోవాలనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. అందుకనే ఈ వారాంతంలో ఏకంగా పది సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. ఇందులో తేజ సజ్జా, జీవితా రాజశేఖర్ కుమార్తె శివానీ జంటగా నటించిన ‘అద్భుతం’ మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మిగిలిన తొమ్మిది చిత్రాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.

‘కేరింత’ ఫేమ్ పార్వతీశం, శ్రీలక్ష్మీ ప్రధాన పాత్రధారులుగా నటించిన ‘సావిత్రి వైఫాఫ్ సత్యమూర్తి’ చిత్రం నవంబర్ 19న విడుదల అవుతోంది. పూరి జగన్నాథ్ శిష్యుడు చైతన్య కొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నరేంద్ర గోగుల నిర్మించారు. ఇక అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్, చాందిని తమిళ్ రాసన్, శాని సాల్మాన్, శెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించిన ‘పీనట్ డైమండ్’ మూవీ పేరును ఇప్పుడు ‘రామ్ – అసుర్’గా మార్చి శుక్రవారం విడుదల చేస్తున్నారు. వీటితో పాటే ‘ఊరికి ఉత్తరాన’, ‘పోస్టర్’, ‘రావణలంక’, ‘మిస్సింగ్’, ‘మిస్టర్ లోన్లీ’, ‘ఛలో ప్రేమిద్దాం’, ‘స్ట్రీట్ లైట్’ చిత్రాలు కూడా తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నాయి. ఇక నవంబర్ చివరి వారంలోనూ దాదాపు ఐదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Related Articles

Latest Articles