అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన రూ.10 లక్షల నగదు

సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలోని ఓ ఇంట్లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఇంట్లో ఉన్న రూ.10 లక్షల నగదు కాలి బూడిదైంది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము మంటల్లో కాలిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. నేలమర్రి గ్రామానికి చెందిన సన్నకారు రైతు కప్పల లక్ష్మయ్యకు రెండు ఎకరాల పొలం ఉంది. నాలుగు రోజుల క్రితం తన తండ్రికి చెందిన ఆస్తి అమ్మడంతో రూ.10 లక్షలు వచ్చాయి. దీంతో ఆ నగదును బీరువాలో దాచిపెట్టాడు.

గురువారం నాడు లక్ష్మయ్యతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూలీపనులకు వెళ్లారు. ఈ సమయంలో వారి ఇంట్లో ప్రమాదవశాత్తూ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని సామాగ్రితో పాటు బీరువాలో దాచిన డబ్బులు కూడా కాలిపోయాయి. పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఎలా జరిగిందో వివరాలు తెలుసుకున్నారు. నిజంగా ప్రమాదం సంభవించిందా లేదా ఎవరైనా కావాలని పూరింటికి నిప్పు పెట్టారా అనే కోణంలో వారు విచారణ జరుపుతున్నారు.

Related Articles

Latest Articles