మే నెలలో ఇంటర్ పరీక్షలు.. రంగం సిద్ధం చేస్తున్న తెలుగు రాష్ట్రాలు

తెలంగాణలో ఇంటర్ పరీక్షలను మే 2 నుంచి ప్రారంభించాలని ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు ఏప్రిల్ నెలలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్తూ వచ్చిన ఇంటర్ బోర్డు.. కరోనా కారణంగా ఆఫ్‌లైన్ తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడం, థర్డ్ వేవ్ దృష్ట్యా మే నెలలో నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు మే 2న పరీక్షలను ప్రారంభించి 20వ తేదీకి పూర్తయ్యేలా ప్రణాళికలను రూపొందిస్తోంది.

మరోవైపు ఇటీవల ఇంటర్ ఫస్టియర్‌లో 2.35 లక్షల మంది విద్యార్థులు తప్పగా… ప్రభుత్వం పాస్ మార్కులు వేసింది. పాస్ మార్కులతో సంతృప్తి పడని విద్యార్థులు బెటర్‌మెంట్ రాసే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో అసలే ఒత్తిడిలో ఉన్న ఆ విద్యార్థులు ఒక రోజు ఫస్టియర్, మరుసటి రోజు సెకండియర్ పరీక్షలు రాయాలంటే ఆందోళనకు గురవుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కనీసం ప్రధాన సబ్జెక్టుల పరీక్షల మధ్యనైనా రెండు రోజుల వ్యవధి ఉంటే బాగుంటుందని, ఆ దిశగా బోర్డు టైమ్ టేబుల్ రూపొందించాలని పలువురు సూచిస్తున్నారు.

అటు ఏపీలోనూ ఇంటర్ పరీక్షలను మే నెలలోనే నిర్వహించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. మే 5 నుంచి 22 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హాఫ్ ఇయర్లీ పరీక్షలు పూర్తి చేసిన అధికారులు పబ్లిక్ వార్షిక పరీక్షలపై దృష్టి సారించారు. కరోనా ఉధృతి లేకపోతే మే నెలలో సవ్యంగా పరీక్షలను జరపాలని అధికారులు యోచిస్తున్నారు.

Read Also: మనిషిని నాశనం చేసే ఐదు విషపూరిత అలవాట్లు

Related Articles

Latest Articles