దేశ రాజధానిలో తెలుగు డాక్టర్ ఔదార్యం…

“కరోనా” పేషెంట్ల ప్రాణాలను ఎలా కాపాడాలో అన్నీ తెలిసి కూడా ఏమీ చేయలేని నిస్సహాయత. కళ్లముందే ప్రాణాలు పోతుంటే, చలించిపోయున ఓ తెలుగు డాక్టర్ ఓ వారంగా తీవ్రంగా పలు ప్రయత్నాలు చేశారు. స్థలం దొరికితే, “కోవిడ్” సెంటర్ పెట్టి, “కరోనా” పేషెంట్లకు ఉచిత వైద్య సేవలు అందించాలని తాపత్రయపడ్డారు. ఆక్సిజన్ తో సహా, ఉచితంగా మందులు కూడా అందించాలనే సత్సంకల్పంతో, ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి లో పనిచేస్తున్న రోబో సర్జన్ డాక్టర్. కల్పన రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. 

తెలుగు  పండుగలు, సమావేశాలు, తెలుగు వారంతా ఒక చోట సమావేశమై సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించుకొనేందుకు, తెలుగు ప్రజల సంక్షేమం  కోసం 70 వ దశకంలో కేంద్ర ప్రభుత్వం “ఖాన్ మార్కెట్” కు సమీపంలో కేటాయించిన స్థలంలో 4 అంతస్తుల “ఆంధ్ర అసోసియేషన్” ప్రధాన కార్యాలయం నిర్మాణం జరిగింది. అన్ని వసతులు ఉన్న ఈ నాలుగు అంతస్థుల భవనంలో “కోవిడ్ సెంటర్” ఏర్పాటు చేసేందుకు అనుమతివ్వాలని నిర్వహణ కమిటీ ని డా. కల్పన రెడ్డి అభ్యర్దించారు. అయితే , నిర్వహణ కమిటీ ససేమిరా అన్నారు. “కోవిడ్” తో బాధ పడుతున్న చాలామంది తెలుగువారు ఫోన్లు చేసి వైద్యసహాయం చేయాలని మొరపెట్టుకుంటున్నారని, వారికి మాత్రమే వైద్య సేవలు ఉచితంగా అందిస్తానని, ఒక డాక్టర్ గా ఇతర మెడికల్ స్టాఫ్ ను, నిపుణులను, ఇతరత్రా కావాలసిన  మానవ వనరులను కూడా సమకూర్చుకుంటానని “ఆంధ్ర అసోసియేషన్” నిర్వహణ కమిటీ ని ఆమె అభ్యర్ధించారు. కానీ, నిర్వహణ కమిటీ మాత్రం డాక్టర్ కల్పన రెడ్డి అభ్యర్ధనను అంగీకరించలేదు. 

అయితే , డాక్టర్. కల్పన రెడ్డి మాత్రం తన ప్రయత్నాలను విరమించలేదు. అనేక స్కూళ్ల యాజమాన్యాలను సంప్రదించారు. చివరకు, లజపత్ నగర్ లోని అమర్ కాలనీ లో ఉన్న “సరస్వతి బాల మందిర్” యాజమాన్యం ఒప్పుకుంది….వెంటనే, యుధ్దప్రాతిపదికన స్కూల్ ప్రాంగణంలో 30 బెడ్లతో “కోవిడ్ సెంటర్” ను ఏర్పాటు చేశారు. “ఆంధ్ర అసోసియేషన్” భవనంలో “కోవిడ్” సెంటర్ పెడితే, మన తెలుగు వారికే 100 శాతం వైద్య సేవలు అందించవచ్చని అనుకున్నాను. కానీ, వారు ఒప్పుకోలేదు. అయునా, “సరస్వతి బాల మందిర్” లో 30 బెడ్లతో ఏర్పాటు చేసిన “కోవిడ్” సెంటర్ లో మొత్తంగా తెలుగువారికే సహాయం చేయలేకపోవచ్చు. కానీ, “కోవిడ్” తో బాధ పడే మన తెలుగు వారికి కూడా ఇక్కడ వైద్య సేవలు అందిస్తామని”, డాక్టర్. కల్పన రెడ్డి అన్నారు.

డా.కల్పన రెడ్డి, సహచరులు డాక్టర్. ప్రసన్న తో పాటు,  మరి కొద్ది మంది స్నేహితులు, స్కూలు యాజమాన్యం కూడా  కలిసి అవసరమైన ఆర్ధిక వనరులు సమకూర్చుకున్నారు. 5 లీటర్ల సామర్ధ్యం కల 30 “ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్” ను 30 బెడ్ల వద్ద ఏర్పాటు చేశారు. అదనంగా మరో 20 బెడ్ల వరకు పెంచుకునేందుకు  అవకాశం ఉందని”,  డాక్టర్ కల్పన రెడ్డి తెలిపారు. రానున్న మరో పది రోజుల్లో మరో 20 బెడ్లను, అదనంగా డాక్టర్లను కూడా సిధ్దం చేసుకుంటామని డాక్టర్ కల్పన రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి, మొత్తం 8 మంది డాక్టర్లు, మరో 8 మంది మెడికల్ స్టాఫ్ తో “కోవిడ్ సెంటర్” లో ఉచిత వైద్య సేవలు అందించేందుకు సిధ్దంగా ఉన్నామని డా. కల్పన రెడ్డి అంటున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-