బాన్సువాడలో కేడర్‌ తీరుతో స్పీకర్‌ పోచారానికి చికాకులు..!

పెద్ద పదవిలో ఉన్నప్పటికీ .. లోకల్‌గా కేడర్‌ తీసుకొస్తున్న చికాకులు పెద్దాయనకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయా? పలుమార్లు ఆయన హెచ్చరించినా అనుచరులు మాటవినడం లేదా? ఇంతకీ ఎవరా నేత? ఏమా చీకూ చింత? లెట్స్‌ వాచ్‌..!

కేడర్‌తో పోచారానికి చికాకులు తప్పడం లేదా?

పోచారం శ్రీనివాసరెడ్డి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌. రాజకీయాల్లో సీనియర్‌ నేత. అలాంటి నాయకుడికి బాన్సువాడలో అనుచరులు, సెకండ్‌ కేడర్ తీరు తలనొప్పిగా మారిందట. నియోజకవర్గంలో ఏ మండలంలో చూసినా.. చికాకులు పెడుతున్న శ్రేణులతో చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నారట పోచారం. ప్రస్తుతం ఈ అంశంపైనే అధికార పార్టీలో చర్చ జరుగుతోందట.

డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లకు పోచారం ప్రాధాన్యం?

డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల విషయంలో స్థానికంగా ఉన్న కొందరు అధికారపార్టీ శ్రేణుల తీరు పోచారానికి ఇబ్బందులు తెచ్చిపెడుతోందట. వైఖరి మార్చుకోవాలని ఆయన పలుమార్లు హెచ్చరించినా కేడర్‌ దారికి రావడం లేదట. స్థలం ఉన్నవారు డబుల్‌ బెడ్రూమ్‌ ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందేలా పోచారం చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో కట్టిన రెండు పడకల గదుల ఇళ్లను మండలాల వారీగా లబ్ధిదారులకు అందజేస్తున్నారు కూడా.

డబ్బులు వసూలు చేస్తున్న కేడర్‌కు పోచారం క్లాస్‌..!

డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించే క్రమంలో పార్టీ శ్రేణుల్లో కొందరు డబ్బులు వసూళ్లు చేశారట. ఈ అంశంపై బాన్సువాడ టౌన్‌లో పెద్ద రగడే జరిగింది. మరికొందరు నకిలీ పట్టా సర్టిఫికెట్లు తయారు చేసి డబుల్‌ బెడ్‌రూమ్‌లు ఇవ్వాలని రావడంతో.. పోచారం ఓపెన్‌గానే క్లాస్ పీకారు. రెండు పడకల గదుల ఇళ్ల విషయంలో ఎవరైతే మాట వినడం లేదో.. మండలాల వారీగా వారిని పిలిచి తీరు మార్చుకోవాలని వార్నింగ్‌ ఇచ్చారట. పెద్దాయన కన్నెర్ర చేస్తున్నా.. అవినీతికి అలవాటుపడ్డ కేడర్‌ మాత్రం దారికి రావడం లేదట.

ఇక ఉపేక్షించకూడదని డిసైడ్‌ అయ్యారా?

బాన్సువాడలో ఒకవైపు వైరిక్షాలు స్వరం పెంచుతున్నాయి. వాటికి సమాధానం చెబుతూనే.. ఇటు కేడర్‌ను అదుపులో పెట్టడం పోచారానికి పెద్ద సవాల్‌గా మారిందట. పెద్దాయన కోప్పడతారు కానీ.. ఏం చేయలేరనే ధీమానో ఏమో.. అదేపనిగా తప్పులు చేస్తున్నారట అనుచరులు. అయితే ప్రస్తుతం కేడర్‌ పోకడలు ముదురు పాకాన పడుతుండటంతో ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్నారట పోచారం. దారిలోకి వస్తే సరి.. లేదంటే చర్యలు తీసుకోకతప్పదని ఆంతరంగిక సంభాషణల్లో చెబుతున్నారట. ఇంటిపోరును చక్కదిద్దే విషయంలో పెద్దాయన ఏ మేరకు సక్సెస్‌ అవుతారో అన్న చర్చ కూడా జరుగుతోంది. మరి.. పోచారం ఏం చేస్తారో చూడాలి .

Related Articles

Latest Articles