రేపే మోగనున్న బడి గంట.. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ..!

దాదాపు 18 నెలల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో… బడులు ప్రారంభించాలని సర్కార్‌ నిర్ణయించింది. ఏడాదిన్నర తర్వాత… విద్యార్థులకు ప్రత్యక్ష బోధన జరగనుంది. పాఠశాలల్లో పూర్తి స్థాయిలో శానిటైజేషన్, క్లీనింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల యాజమాన్యాలు… తరగతి గదులను శుభ్రం చేస్తున్నాయి. క్లాసు రూమ్‌లతో పాటు బెంచ్‌లు, కుర్చీలను… శానిటైజ్‌ చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే… ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. అందుకనుగుణంగా… గదులను సిద్ధం చేస్తున్నారు ఉపాధ్యాయులు. తొలి రోజు విద్యార్థుల హాజరును బట్టి… బెంచ్‌కి ఒక్కరా లేదా ఇద్దరూ కూర్చోవాలా అన్న దాన్ని నిర్ణయించనున్నారు. తరగతి గదుల్లో ఎక్కడికక్కడ కోవిడ్‌ నిబంధనలు పాటించేలా బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు ఎవరి వస్తువులు వారే తెచ్చుకోవాలని యాజమాన్యాలు ఇప్పటికే తల్లిదండ్రులకు మేసెజ్‌లు పంపాయి. ఎటువంటి అపోహ లేకుండా తల్లిదండ్రులు ధైర్యంగా తమ పిల్లలను స్కూల్‌కు పంపవచ్చని టీచర్లు భరోసా ఇస్తున్నారు.

ఇక ప్రాథమిక పాఠశాల విద్యార్థులను… జాగ్రత్తగా చూసుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు టీచర్లు. చిన్నారులకు కోవిడ్ నిబంధనలు అంతగా తెలియవని… అందుకే వారిపై నిఘా వేసి ఉంచుతామని చెబుతున్నారు. ఒక తరగతి గదిలో ఇరవై మంది పిల్లలను మాత్రమే కూర్చోబెడుతామని యాజమాన్యాలు చెబుతున్నాయి. పిల్లలకు మాస్క్ ఇచ్చి… వాటిని ధరించేలా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. చాలా పాఠశాలలు… ప్రత్యేకంగా ఐసోలేషన్‌ గదులను ఏర్పాటు చేశాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ… హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేకుండా ఉత్తర్వులు జారీ చేశారని పిటిషనర్‌ పేర్కొన్నారు. కోవిడ్‌ సమయంలో పాఠశాలలను ప్రారంభించి పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.. మరి.. హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది.

Related Articles

Latest Articles

-Advertisement-