టీఆర్ఎస్లో ఆ నేతల మౌనం వెనక మతలబు ఏంటి? రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను అంచనా వేసే పనిలో ఉన్నారా? సమయం.. సందర్భం చూసి అడుగులు వేస్తారా? ఎవరా నాయకులు?
మూడేళ్లయినా లోకల్ ఎమ్మెల్యేతో గ్యాప్
2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర సమితి.. రెండోసారి అధికారాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పలువురు టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో విలీనం అయ్యారు. ఆ అంశంపై అధికార టీఆర్ఎస్ .. విపక్ష కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు.. అప్పటికే టీఆర్ఎస్‌లో ఉన్న స్థానిక నాయకులకు మధ్య నిప్పు రాజుకుంది. ఎన్నికలు జరిగి మూడేళ్లయినా.. ఆ గ్యాప్ పూడలేదు.
అసంతృప్త నేతలతో కలిగే నష్టం ఏంటి?
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరిన కొత్తగూడెం, కొల్లాపూర్, మహేశ్వరం, నకిరేకల్‌తోపాటు ఒకటి.. రెండు నియోజకవర్గాల టీఆర్ఎస్‌లో అలజడి మొదలైంది. కొత్త, పాత పార్టీ శ్రేణుల మధ్య ఆధిపత్య పోరు మొదలై.. నిత్యం కుంపట్లు రాజుకుంటున్నాయి. వాటిపై పార్టీలో పంచాయితీలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. పార్టీ పెద్దలు ఆయా నియోజకవర్గాలలో పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో తాజా పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. అక్కడి పరిణామాల ప్రభావం ఏంటి? రాజకీయ రచ్చ తప్పదా? అసంతృప్త వర్గాలతో కలిగే నష్టంపై చర్చ జరుగుతోంది.
తమ ముందున్న ఆప్షన్లపై వడపోతలు
నకిరేకల్‌లో వేముల వీరేశం, కొత్తగూడెంలో జలగం వెంకట్రావు, కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు, మహేశ్వరంలో తీగల కృష్ణారెడ్డిలు ప్రస్తుతం సైలెంట్. ఎవరికి వాళ్లు నియోజకవర్గాలలో తమ గ్రూప్‌తో టచ్‌లో ఉంటూ నియోజకవర్గాల్లో పట్టు కోల్పోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను అంచనా వేస్తున్నట్టు సమాచారం. రాజకీయ భవిష్యత్తుపైనా ఆలోచనలు చేస్తున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. సమయం.. సందర్భం చూసుకుని పొలిటికల్‌గా మళ్లీ యాక్టివ్ అవ్వాలన్న ఆలోచనలో ఉన్నారట. అందుకే తమ ముందున్న ఆప్షన్‌లలో లాభనష్టాలను బేరీజు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
రాజకీయ భవిష్యత్‌ను దిద్దుకునే పనిలో నేతలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నిచోట్ల లోకల్ ఎమ్మెల్యేతో విభేదించి అనుచరులను గెలిపించుకున్నారు. నియోజకవర్గాల్లో పట్టు కోల్పోకుండా జాగ్రత్త పడినప్పటికీ.. ఆ ప్రయత్నాలకు పార్టీ పెద్దల ముందు మార్కులు పడలేదని సమాచారం. దీంతో చివరి వరకు వేచి చూడకుండా.. ఇప్పటి నుంచే పొలిటికల్ ఫ్యూచర్‌ను దిద్దుకునే పనిలో పడ్డారట నాయకులు. మరి.. వారి ఎత్తుగడలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.