ఈ రోజు తాజ్ డెక్కన్ లో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఐఎఫ్ఐఈ (ఇంటరాక్టివ్ ఫోరమ్ ఆన్ ఇండియన్ ఎకానమీ) సంస్థ అందిస్తున్న “ఛాంపియన్స్ ఆఫ్ ది ఛేంజ్” అవార్డుల ప్రధానోత్సవం వైభవంగా జరిగింది. అయితే.. అధికారిక కార్యక్రమాల వల్ల అవార్డు స్వీకరణకు సంతోష్ కుమార్ అందుబాటులో లేని కారణంగా.. ఆయనకు బదులుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ, మాజీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ కే.జీ బాలకృష్ణన్ చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. అవార్డు వేడుకకు అందుబాటులో లేని కారణంగా, తన సందేశం పంపించిన సంతోష్ కుమార్, అందులో.. “సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఎన్ఆర్సీ మాజీ ఛైర్మన్ జస్టీస్ కే.జీ బాలకృష్ణన్” ఆధ్వర్యంలోని జ్యూరీ ఈ అవార్డుకు తనను ఎంపిక చేయడం, పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు, అవార్డును తనకు అందించాలని నిర్ణయం తీసుకున్న “ఐఎఫ్ఐఈ ఛైర్మన్ నందన్ జా”కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించినట్టుగా భావిస్తున్నాట్టు ఆయన తెలిపారు. “ఛాంపియన్స్ ఆఫ్ ది ఛేంజ్” తెలంగాణ అవార్డు.. పచ్చని ప్రకృతి కోసం, భవిష్యత్ తరాల బాగు కోసం ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని సంతోష్ కుమార్ అన్నారు.