తెలంగాణలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులతో ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా ఆంక్షలు విధించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈనెల 20వరకూ ఆంక్షలు వున్నా అవి సరిపోవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో విద్యార్ధులకు నిర్వహించనున్న వివిధ పరీక్షలు రద్దవుతున్నాయి. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న బీడీఎస్ పరీక్షల్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.
కోవిడ్ వల్ల చాలా మంది విద్యార్థులు ఐసోలేషన్ లో ఉన్నారు. కోవిడ్ సోకిన వాళ్ళు పరీక్షా కేంద్రాలకు వచ్చి పరీక్షలు ఎలా రాస్తారు? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాపిస్తోందని తెలిసి కూడా ఆఫ్ లైన్ పరీక్షలు నిర్వహించాలని మొండిగా వ్యవహరించడం సరికాదు.
విద్యార్థుల ఆరోగ్యము, వాళ్ళ భవిష్యత్తు గురించి కొద్దిగా కూడా ఆలోచించరా? ఇప్పటికే చాలా యూనివర్సిటీలు పరీక్షల్ని వాయిదా వేసుకున్నాయి. బీడీఎస్ పరీక్షల నిర్వహణపై పై కాళోజీ నారాయణరావు వైద్య విశ్వ విద్యాలయం వెంటనే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవాలని బండి సంజయ్ కోరారు. ఇదిలా వుండగా తెలంగాణలో కొత్తగా 2447 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే కాస్త పెరుగుదల నమోదయింది. కోవిడ్ కారణంగా ముగ్గురు మృతిచెందారు.
ఇదిలా వుండగా ఈ నెల 30 వ తేదీ వరకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదని అనుబంధ కళాశాలలకు ఆదేశాలు జారీ చేశాయి జేఎన్టీయూ, ఓయూ. 30 వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశాయి. 30 వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి రెండు యూనివర్సిటీ లు.