షర్మిలకి హరీష్‌రావు కౌంటర్.. వైఎస్‌ వారసులకి స్థానంలేదు..!

వైఎస్‌ షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు తెలంగాణ మంత్రి హరీష్‌రావు.. తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన ఆమె.. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యం అని ప్రకటించారు.. అయితే, ఇప్పుడు కొత్త కొత్త పార్టీలు వచ్చాయన్నారు హరీష్‌రావు.. గతంలో రాజ శేఖర్ రెడ్డి.. తెలంగాణ సిగరెట్టా..? బీడీనా అని అసెంబ్లీలో అడిగారని.. మా నీళ్లు, నిధులు ఆంధ్రకు తరలిస్తున్నందుకు మీకు మద్దతు ఇవ్వాలా? అని ప్రశ్నించారు.. తెలంగాణ ప్రజల హృదయాల్లో వైఎస్ వారసులుకి స్థానం లేదని స్పష్టం చేసిన హరీష్‌రావు.. నేను బతికి ఉండగా తెలంగాణ రాదని రాజశేఖర్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు.. హైకమాండ్ మెప్పు కోసం, కిరణ్ కుమార్ రెడ్డి మెప్పు కోసం ఇక్కడ కాంగ్రెస్ నాయకులు పనిచేవారని ఆరోపించిన ఆయన.. తెలంగాణకి అవమానం, అవహేళన చేసింది రాజశేఖర్ రెడ్డే అన్నారు.. ఇక, రాయల తెలంగాణ కావాలని అడ్డుకునే ప్రయత్నం చేశారన్న హరీష్‌.. 100 కోట్ల మంది ప్రజలు ఒప్పుకుంటేనే తెలంగాణ అని రాజశేఖర్ రెడ్డి చెప్పారన్నారు.

మరోవైపు.. కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్‌లో ఎక్కువ, ప్రజల్లో తక్కువ అంటూ ఎద్దేవా చేశారు హరీష్‌రావు.. సంగారెడ్డి ఎమ్మెల్యే ఫోన్ ఎత్తడు, అవసరం అయితే కనీసం స్పందించడని ఆ పార్టీ నాయకులే చెబుతారని.. కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారు, కనీస ప్రతిపక్ష హోదా కూడా లేదని సెటైర్లు వేశారు.. ఇక, జులై నెలలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని.. త్వరలో 4 వేల కోట్లతో పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో మంచినీటి కొరత, కరెంట్‌ కొరత ఉండేది.. 70 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు చేయలేనివి.. ఏడేళ్లలో టీఆర్ఎస్ చేసిందన్నారు.. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేరు, సిబ్బంది లేరు, ప్రైవేట్ హాస్పిటల్స్ ని ప్రోత్సహించారని విమర్శించిన హరీష్‌.. గతంలో సంగారెడ్డికి ముఖ్యమంత్రులను తీసుకు వచ్చేవారు తప్ప అభివృద్ధి జరగలేదని.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక లక్షా 30 వేలు ఉద్యోగాలు ఇచ్చాం.. త్వరలో మరో 50 వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇస్తామన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-