ఎక్కువ అవినీతి జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి : జేపీ నడ్డా

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన ఘటన తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో నేడు బీజేపీ శ్రేణులు ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో పాల్గొనడానికి ఢిల్లీ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే జేపీ నడ్డాను అడ్డుకునేందుకు అప్పటికే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న పోలీసులు తెలంగాణలోని కోవిడ్‌ నిబంధనల గురించి వివరించారు.

దీంతో ఆయన కోవిడ్‌ నిబంధనల ప్రకారమే నిరసన తెలియజేస్తానన్నారు. దీంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి రోడ్డు మార్గంలో సికింద్రాబాద్‌లోని మహాత్మగాంధీ విగ్రహం వద్దకు చేరుకొని అక్కడ మహాత్ముడికి నివాళులు అర్పించారు. అయితే అందరూ ర్యాలీ నిర్వహిస్తారనే ఉత్కంఠతో ఎదురుచూస్తుండగా నిరసనను అక్కడే ముగించి నేరుగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి జేపీ నడ్డా వెళ్లారు. అయితే సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఉద్యోగుల పోరాటానికి మద్దతు ఇవ్వడానికి వచ్చానని ఆయన తెలిపారు. అంతేకాకుండా తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని, అవినీతి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాటం కోనసాగిస్తామన్నారు.

ఎంపీ బండి సంజయ్‌పై పోలీసులు చేయిచేసుకున్నారని, బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కేసీఆర్‌ ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించారు. ఎక్కువ అవినీతి జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆయన ఉద్ఘాటించారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని, వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లు.. కేసీఆర్‌ పాలన ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం వస్తోందని ఆయన అన్నారు.

Related Articles

Latest Articles