కేఆర్‌ఎంబీకి తెలంగాణ మరో లేఖ

కృష్ణా నది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.. లేఖల పర్వం నడుస్తూనే ఉంది. తాజాగా కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాశారు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్.. 50 : 50 శాతంలో కృష్ణా నీటివాటా కేటాయించాలని కోరిన ఆయన.. ఏపీ ప్రభుత్వం కృష్ణా నీటిని బేసిన్ పరిధి దాటి మళ్లిస్తుందని కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, లేఖలోని కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే.. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపునకు త్రిసభ్య కమిటీ ఆమోదం లేకుండా అనుమతించకూడదని పేర్కొన్నారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి తెలంగాణకు అభ్యంతరం లేదన్న ఈఎన్సీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ చేసిన 811 టీఎంసీలు గంపగుత్త కేటాయింపులని తెలిపింది.. ఈ విషయాన్ని ధృవీకరించిన సుప్రీంకోర్టు.. రెండు రాష్ట్రాల మధ్య పునర్‌ కేటాయింపుల అంశం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతున్నందున 2021-22 వాటర్ ఇయర్ నుంచి 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరపాలని కోరింది.

ఇక, బేసిన్ లో ఉండే ప్రాంతాల అవసరాలు తీరిన తర్వాతనే బేసిన్ అవతలి ప్రాంతాలకు నీటిని తరలించడానికి అనుమతించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డును కోరింది తెలంగాణ ఇరిగేషన్‌ ఈఎన్సీ.. కృష్ణాలో వరద ఉన్న కారణంగా అన్ని జల విద్యుత్ కేంద్రాల నుంచి జల విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో చేయడానికి అనుమతించాలని కేఆర్‌ఎంబీని విజ్ఞప్తి చేసింది.. కాగా, తెలంగాణ జల విద్యుత్‌పై ఇప్పటికే పలు దఫాలుగా కేంద్రానికి, కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేస్తూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో తెలంగాణ విజ్ఞప్తిపై కేఆర్‌ఎంబీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-