ఇక అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

రాష్ట్రంలోని కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించేందుకు పురపాలక శాఖ సిద్ధమైంది. గ్రామపంచాయతీల అనుమతితో అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ మొదలు అన్ని మున్సిపాలిటీల్లో ఆకస్మిక తనిఖీలు చేసి కూల్చివేతలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు. ఈ విషయంలో పక్కాగా ముందుకెళ్ళాలని అధికారులు భావిస్తున్నారు.

గ్రామ పంచాయతీ అనుమతుల పేరిట హైదరాబాద్‌ శివార్లలో నిర్మించిన అక్రమ కట్టడాలపై మున్సిపల్‌ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రామ పంచాయతీ అనుమతి పేరుతో కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్త నిర్మాణాలన్నింటికీ టీఎస్‌బీపాస్‌ ద్వారా దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీల పర్మిషన్‌తో రెండు అంతస్తులకన్నా ఎక్కువ ఫ్లోర్లు ఉన్న కట్టడాలన్నీ అక్రమమేనని ప్రకటించింది.

ఇటీవల మెమో నంబర్‌ 420 పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అలాంటి భవనాలు నిర్మించిన వారి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. వారంతా టీఎస్‌బీపాస్‌ ద్వారా దరఖాస్తు చేసుకొని నిర్దేశిత రుసుము చెల్లించి అనుమతి పొందాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ అనుమతితో జీ+2కు మించి నిర్మాణాలు చేయడానికి వీల్లేదు. ఒకవేళ రెండంతస్తులకు మించి భవనాలు నిర్మించాలంటే HMDA లేదా ఇతర పట్టణాభివృద్ధి సంస్థల అనుమతి తప్పనిసరి.

గ్రామ పంచాయతీల అనుమతుల పేరుతో కొత్త మున్సిపల్‌ కమిషనర్లు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల అండతో.. భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు సాగినట్లు దుండిగల్‌లోని ఓ రియాల్టీ సంస్థ మోసంతో వెలుగులోకి వచ్చింది. దీంతో అన్ని పురపాలక సంఘాల్లో నిర్మించిన కట్టడాల వివరాలను ఉన్నతాధికారులు సేకరించారు. ఇందులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని కూల్చేసే పనిలో ఉన్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అరికట్టకుండా ప్రోత్సహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు కూడా చేపట్టారు.

Related Articles

Latest Articles