తెలంగాణ.. ఆ విషయంలో మరో ఘనత

తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి ఎన్నో ఘనతలను సాధిస్తూ ముందుకెళుతుంది. రోజురోజుకు పురోగతి సాధిస్తూ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, రైతు భీమా, 24గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. తాజాగా మరో ఘనతను తెలంగాణ తన ఖాతాలో వేసుకుంది. ఐటీరంగం పురోగతి, ప్రభుత్వ సేవల్లో టెక్నాలజీలో తెలంగాణ అమలు చేస్తున్న విధానాలు ఆదర్శంగా ఉన్నాయంటూ పార్లమెంటరీ ఐటీ స్టాండింగ్‌ కమిటీ తెలంగాణ ప్రభుత్వానికి కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఆ కమిటీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది.

దేశంలో ఎక్కడ ఆదర్శవంతమైన కార్యక్రమాలు అమలు అవుతున్నా వాటిని ప్రజా సంక్షేమానికి వినియోగించేలా పార్లమెంటరీ ఐటీ స్టాండింగ్‌ కమిటీ చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే గత రెండ్రోజులుగా ఈ కమిటీ హైదరాబాద్లో పర్యటిస్తుంది. రాష్ట్రంలో ఐటీ రంగం పురోగతి, ప్రభుత్వ సేవల్లో టెక్నాలజీ వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కమిటీ అధ్యాయనం చేసింది. ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్ సేవలు.. ఇన్నోవేషన్ రంగంలో ఇంకుబేటర్ల ఏర్పాటు.. టీ ఫైబర్ ప్రాజెక్టులపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తెలుసుకుని ప్రశంసలు కురిపించారు.

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ ఐటీ స్టాండింగ్‌ కమిటీ తెలంగాణ ప్రభుత్వం అన్నిరకాల వివరాలను అందజేసింది. ప్రభుత్వ కార్యక్రమాలు.. ప్రాజెక్టుల విజన్‌ వివరాలను అధికారులు కమిటీకి అందజేశారు. ఇన్నోవేషన్ రంగంలో ఏర్పాటు చేసిన ఇంక్యుబేటర్ వివరాలు, టీ హబ్.. వీ హబ్.. అగ్రి హబ్.. బీ హబ్.. రిచ్.. టీ వర్క్ వంటి ప్రత్యేక కార్యక్రమాలను కమిటీకి వివరించారు. కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన టీఎస్‌ ఐపాస్‌.. ఇతర విధానపరమైన నిర్ణయాలను వారికి తెలియజేశారు.

ఐటీ పరిశ్రమతో కలిసి ప్రభుత్వం పని చేయడంతో రాష్ట్రానికి పెట్టుబడులు పెద్దఎత్తున వచ్చాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే నాలుగు అతి పెద్ద టెక్‌ కంపెనీల క్యాంపస్‌లు అమెరికా వెలుపల హైదరాబాద్‌లోనే ఉన్నాయనే విషయాన్ని గుర్తుచేశారు. ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పనతోపాటు ఐటీ ఎగుమతులను సైతం భారీగా పెంచగలిగినట్లు అధికారులకు కమిటీకి వివరించారు. దీంతోపాటు సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ధరణి పోర్టల్‌ సాంకేతిక వివరాలను కమిటీ అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కమిటీతో భేటి అయ్యారు. తెలంగాణ లాంటి కొత్త రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక సహాయం అందించేందుకు చొరవ చూపాలని కోరారు.

ఐటీఐఆర్ వంటి ప్రాజెక్టులకు కేంద్రం అదనపు ప్రోత్సాహాన్ని అందించేలా చూడాలని కమిటీ సభ్యులను కేటీఆర్ కోరారు. తెలంగాణలో డిజిటల్ ఎకానమీ.. గవర్నెన్స్‌లో ఐటీ టెక్నాలజీ వినియోగంపై మంత్రి కేటీఆర్‌ ను అడిగి వివరాలను కమిటీ తెలుసుకుంది. ఈ సంరద్భంగా రాష్ట్రంలోని మీసేవా కార్యకలాపాల్లో వచ్చిన మార్పులు.. మొబైల్ ఆధారిత ప్రభుత్వ సేవలు.. కాంటాక్ట్ లెస్ గవర్నెన్స్ దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు.. టీ వాలెట్ తో ప్రభుత్వం సాధించిన ఘనతలు చర్చకు వచ్చాయి.

రాబోయే రోజుల్లో ఐటీ రంగంలో హైదరాబాద్ మరింత అభివృద్ధి సాధిస్తుందని కమిటీ ఈసంద్భంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలను దేశంలోని పలు రాష్ట్రాలకు స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చుకునేలా కమిటీ సూచనలు చేయనుందని పేర్కొంది. ఐటీ ఆధారిత సేవల్లోనూ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుండటంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-