తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం… జగ్గారెడ్డి దీక్ష స్థానంలో ఉమ్మడి పోరాటం

ఈ నెల 17వ తేదీన హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వద్ద సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేపట్టిన దీక్ష బదులు ఉమ్మడి పోరాటం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. శనివారం నాడు జరిగిన జూమ్ మీటింగ్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ కార్యక్రమాల ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి దీక్ష స్థానంలో సీఎల్పీ నేతలు ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 17వ తేదీన జగ్గారెడ్డి పలు అంశాలపై చేయాలనుకున్న దీక్షను వాయిదా వేసుకోవాలని, ఆ స్థానంలో సీఎల్పీలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం కేసీఆర్‌కు లేఖ రాయాలని.. సీఎం అపాయింట్‌మెంట్ అడగాలని నిర్ణయించామని తెలిపారు. ఒకవేళ సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే ఉమ్మడిగా పోరాటం చేయాలని సీఎల్పీ సమావేశం నిర్ణయించిందన్నారు.

ప్రధానంగా డిజిటల్ మెంబర్‌షిప్‌ను సకాలంలో లక్షాన్ని సాధించేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. ఈనెల 17న ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు అంశాలపై సీఎం అపాయింట్ మెంట్ అడిగారని… ఇవ్వని పక్షంలో అక్కడే దీక్ష చేస్తానని ప్రకటించారని… అయితే ఆ కార్యక్రమాన్ని సీఎల్పీ తరఫున అందరం కలిసి చేద్దామని టీపీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు చెప్పడంతో జగ్గారెడ్డి అంగీకరించారని తెలిపారు. ఈనెల 18,19 తేదీలలో సీఎంను కలిసి పలు అంశాలపై వినతి పత్రం ఇస్తామని… లేనిపక్షంలో పోరాటం చేస్తామన్నారు. అలాగే 17వ తేదీన వెంకటాపురం మండలంలో మిర్చి రైతుల పరిస్థితి వడగళ్ల వర్షాలకు దెబ్బతిన్న అంశాలపై సీఎల్పీ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కలిసి పర్యటించి రైతుల సమస్యలపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

అలాగే రాష్ట్రంలో పోలీసులు శాంతి భద్రతలను పూర్తిగా విస్మరించి టీఆర్ఎస్ కార్యకర్తలుగా పని చేస్తున్నారని, ప్రజలకు సేవ చేయాల్సిన పోలీసులను టీఆర్ఎస్ నాయకులు ఊడిగం చేయించుకుంటున్నారని విమర్శించారు. పాల్వంచలో ఎమ్మెల్యే కొడుకు దారుణాల వల్ల ఒక కుటుంబం బలైనా, మంథనిలో ఒక న్యాయవాదుల జంటను దారుణంగా హత్య చేసినా పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని.. ఇలాంటివి చాలా జరుగుతున్నా ప్రజలకు భద్రత లేకుండా పోయిందన్నారు. పోలీసులు ప్రజలకు భద్రత కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా పోరాటం చేస్తామన్నారు. అలాగే 20 నుంచి 24వ తేదీ వరకు సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులు, పలువురు నిపుణులతో సమావేశం ఏర్పాటు చేస్తామని.. రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో మాట్లాడాల్సిన అంశాలపైనా, 317 జీవో, విభజన చట్టం అంశాలపై చర్చిస్తామని వివరించారు.

Related Articles

Latest Articles