టీ కాంగ్రెస్‌ ప్రక్షాళనకు శ్రీకారం…?

తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నారా? జిల్లాలకు కొత్త నాయకత్వం రాబోతుందా? పీసీసీ చీఫ్ ఆలోచనేంటి? ఉన్న వాళ్లందరినీ మర్చేస్తారా? పదవులను కట్టబెట్టేందుకు ప్రామాణికంగా భావిస్తున్న అంశాలేంటి?

జనవరి నుంచి జిల్లాల వారీగా సమీక్షలు..!

తెలంగాణ కాంగ్రెస్‌కి పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత పార్టీ రాష్ట్ర కమిటీ కూర్పుపై ఎక్కువ చర్చ జరిగింది. ఎవరెవరు టీంలో ఉంటారు. ఎవరిని బయటకు పంపిస్తారు అని ఆరా తీశారు. రేవంత్ భారీ సభలు.. కార్యక్రమాలపై ఫోకస్‌ పెట్టడంతో రాష్ట్ర కార్యవర్గంపై చర్చ పక్కకు పోయింది. ఇప్పుడు జనవరి నుంచి పార్టీ కార్యక్రమాలు.. కొత్త కమిటీలు.. డీసీసీ అధ్యక్ష నియామకాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా సమీక్షలు, జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే… డీసీసీ అధ్యక్షుల నియామకంలో భారీగా ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయట. దీనిపై జరుగుతున్న చర్చే ఇప్పుడు గాంధీభవన్‌ వర్గాల్లో హాట్ టాపిక్‌.

పనిచేసే వారికే జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు..!

కాంగ్రెస్ సభ్యత్వం నమోదు మీద ఫోకస్ పెట్టింది. డిజిటల్ మెంబర్‌షిప్‌పై నేతలకు.. కేడర్‌కు అవగాహన కల్పిస్తోంది. క్షేత్రస్థాయిలో వీటిని ఎవరెలా నిర్వహిస్తారన్నది టాస్క్‌. అందుకే జనవరిలో కొత్త డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ మొదలు పెట్టే ఆలోచనలో రేవంత్ ఉన్నట్టు సమాచారం. పనిచేసే వారికి ప్రాధాన్యం ఇచ్చేలా నేతలను ఎంపిక చేస్తారట. సభ్యత్వం నమోదు ఆధారంగానే డీసీసీ అధ్యక్షుల నియామకం ఉండొచ్చని సమాచారం. నియోజకవర్గ బాధ్యతలు కోరుకునే వారికి కూడా అదే ప్రామాణికమట.

సభ్యత్వ నమోదే పార్టీ పదవులకు గీటురాయి..!

నియోజకవర్గ ఓటర్లలో 10 శాతం సభ్యత్వం నమోదు చేస్తేనే పార్టీ పదవులకు పరిగణనలోకి తీసుకునే ఆలోచనలో ఉందట పీసీసీ. పార్టీ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో ఎవరైతే అమలు చేస్తారో.. జిల్లాపై ప్రభావం చూపించే బలమైన నాయకులతో జాబితా సిద్ధం చేసి.. వారిలో ఒకరిని జిల్లా కాంగ్రెస్‌ సారథులను చేస్తారట. పనిచేస్తే పదవి.. లేదంటే పక్కన పెట్టడమే అని గాంధీభవన్‌ వర్గాల టాక్‌. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న డీసీసీ అధ్యక్షులలో చాలా మందిని మార్చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మిషన్‌ 2023 దిశగా ఎవరైతే చురుకుగా కదులుతారో వారికి పట్టం కడతారని మరికొందరు చెబుతున్నారు. పీసీసీ సారథి కూడా ఇదే లక్ష్యంతో జనవరి నుంచి కార్యాచరణ రూపొందించుకుంటారని సమాచారం.

నియోజకవర్గాల ఇంఛార్జ్‌లకు ప్రోగ్రస్‌ రిపోర్ట్‌..!

కేవలం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులనే కాకుండా.. ప్రస్తుతం నియోజకవర్గాల ఇంచార్జ్‌ అనుకునే వారికి కూడా ప్రోగ్రస్‌ రిపోర్ట్‌ చూశాకే పార్టీ బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నారట. మొత్తానికి పదవుల పంపకమైనా.. నేతల ఎంపికైనా జనవరి నుంచి భారీ ప్రక్షాళన తప్పదనే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. మరి.. ఇప్పుడున్న జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుల్లో ఎంతమందికి మళ్లీ పదవీయోగం ఉంటుందో.. కొత్త వాళ్లకు ఎంత మంది తెరపైకి వస్తారో చూడాలి.

Related Articles

Latest Articles