కేంద్ర మంత్రి గడ్కరీతో కేసీఆర్‌ భేటీ..

హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిశారు.. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయనతో చర్చించారు. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి కొల్హాపూర్, సోమశిల, కరువేన గుండా ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యా వరకు (ఎన్.హెచ్ 167 కే. జాతీయ రహదారి నిర్మాణానికి నోటిఫికేషన్ జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్.. ఈ జాతీయ రహదారి వల్ల తెలంగాణలోని కల్వకుర్తి, కొల్హాపూర్, సోమశిల, ఆంధ్ర ప్రదేశ్ లోని ఆత్మకూరు లాంటి వెనుక బడిన ప్రాంతాలకు రహదారి సౌకర్యం సమకూరుతుందన్నారు.

జాతీయ రహదారి ప్రమాణాలతో నిర్మించనున్న ఈ రహదారిలో సోమశిల వద్ద కృష్ణా నదిపై నిర్మిస్తున్న వంతెన వల్ల హైదరాబాద్‌ నుంచి తిరుపతి, చెన్నైల మధ్య దూరం 80 కిలోమీటర్ల మేరకు తగ్గనుంది. ఇక, కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు నిర్మించనున్నట్లుగా కేంద్రం ప్రకటించిన ఈ కొత్త జాతీయ రహదారి కల్వకుర్తి నుంచి ప్రారంభకానుంది.. హైదరాబాద్ నుంచి కల్వకుర్తి మీదుగా శ్రీశైలం వరకు వెళ్లే ఎన్.హెచ్. 765 లో విపరీతమైన ట్రాఫిక్ ఉండగా.. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం 2 లైన్ల జాతీయ రహదారి ( ఎన్.హెచ్ 765)గా ఉన్న హైదరాబాద్‌—కల్వకుర్తి మార్గాన్ని 4 లైన్ల రహదారిగా అభివృధ్ది చేయాలని ఈ సందర్భంగా నితిన్‌ గడ్కరీని కోరారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు. తెలంగాణకు రాష్ట్ర రోడ్డు మౌలిక సదుపాయాల నిధుల కింద 2021 ఏడాదికి రూ. 744 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు కేవలం రూ.250 కోట్లు మాత్రమే కేటాయించారని ఆయన గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు.. ఆమోదం పొందిన రోడ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు మిగిలిన నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా 3,306 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని నిర్ణయించారు.. ఇప్పటివరకు 2,168 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన 1,138 రహదారుల్లో 4 రాష్ట్ర అత్యంత ప్రధాన రహదారులు ఉన్నాయని.. “రీజనల్ రింగ్ రోడ్డు”లో భాగమైన చౌటుప్పల్-కంది 182 కిలోమీటర్లు ఉందని.. కరీంనగర్-పిట్లం 165 కిలోమీటర్లు, కొత్తకోట – మంత్రాలయం 70 కిలోమీటర్లు, జహీరాబాద్-దేగ్లుర్ 25 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఢిల్లీలో టీఆర్ఎస్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన కేసీఆర్.. గత ఆరు రోజులుగా హస్తినలోనే మకాం వేసిన సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles

-Advertisement-