కేసీఆర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం అవసరమైన గ్రౌండ్‌ ప్రిపేర్‌లో గులాబీ దళపతి కేసీఆర్ ఉన్నారా? పైకి చెప్పకపోయినా.. ఆ పనిలో పూర్తిస్థాయిలో పావులు కదుపుతున్నారా? గతంలో DMK.. తాజాగా లెఫ్ట్‌ పార్టీల అగ్రనేతలతో భేటీ తర్వాత కేసీఆర్‌ తదుపరి కార్యాచరణ ఏంటి?

రెండేళ్ల ముందే జాతీయస్థాయి రాజకీయ పరిణామాలపై చర్చ
2024 సార్వత్రిక ఎన్నికలకు జాతీయస్థాయిలో బీజేపీని బలంగా ఢీకొట్టే వారు ఎవరు? ప్రస్తుతం రాజకీయవర్గాల్లో దీనిపైనే చర్చ. ఎవరికి వారు బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడంతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఊసెత్తలేదు. ఇప్పుడు 2024 ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగా జాతీయస్థాయిలో జరిగే రాజకీయ పరిణామాలపై చర్చ మెల్లగా ఊపందుకుంటోంది.

రానున్న రోజుల్లోనూ వివిధ పార్టీలతో కేసీఆర్‌ భేటీ?
కేంద్రంలోని బీజేపీపై రాజకీయ పోరాటం మొదలు పెట్టింది టీఆర్ఎస్. జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకంచేసే పనిని కేసీఆర్ తీసుకుంటారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిను కలిసి చర్చించారు కేసీఆర్‌. తాజాగా లెఫ్ట్ పార్టీల అగ్రనేతలతోనూ ప్రత్యేకంగా ఆయన సమావేశం అయ్యారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించారు. వీటిని చూసిన తర్వాత నేషనల్‌ లెవల్లో టీఆర్ఎస్‌ పాత్రపై విశ్లేషణలు మొదలయ్యాయి. రానున్న రోజుల్లోనూ కేసీఆర్ ఈ తరహా భేటీల కోసం ప్రయత్నాలు సాగిస్తారనే చర్చ జరుగుతుంది.

కేసీఆర్‌ ప్రయత్నాలకు లెఫ్ట్‌ కలిసి వస్తుందా?
అయితే డీఎంకే ఇప్పటికే కాంగ్రెస్‌తో జట్టుకట్టింది. జాతీయస్థాయిలోనూ ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు సాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లెఫ్ట్ పార్టీలు సైతం ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పొత్తులను నిర్ణయిస్తున్నాయి. జాతీయస్థాయిలో ఎన్నికలు ముగిసిన తర్వాతే కుటమిపై లెఫ్ట్ పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అయితే బీజేపీ వ్యతిరేకశక్తులతో కలసి సాగేందుకు వామపక్ష పార్టీలు నిర్ణయించడంతో.. సీఎం కేసీఆర్ చేసే ప్రయత్నలకు లెఫ్ట్‌ కలిసి వస్తుందా లేదా అనే చర్చ ఉంది.

ఎన్నికలు సమీపించే నాటికి మరింత స్పష్టత?
రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలతో కేసీఆర్‌ సమావేశం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదే సమయంలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సైతం ఇదే తరహా ప్రయత్నాల్లో ఉన్నారు. మరి.. ఎన్నికలు సమీపించే సమయానికి బీజేపీ వ్యతిరేక శక్తులు బలమైన వేదికను ఏర్పాటు చేసుకుంటాయో లేదో.. అందులో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎలాంటి పాత్ర పోషిస్తారో చూడాలి.

Related Articles

Latest Articles