సీఎం కేసీఆర్ డిమాండ్.. కొత్త విద్యుత్ చట్టం రద్దు చేయాలి

కేంద్రం తెచ్చిన విద్యుత్ చట్టంపై కార్మికులు, ప్రజలు, ముఖ్యంగా రైతులు ఆందోళనతో ఉన్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తాము రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని చెప్పినా కేంద్రం వినడం లేదని, బావుల దగ్గర కరెంటు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తోందన్నారు. తాము విద్యుత్ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, పార్లమెంట్‌లో సాగు చట్టాలను రద్దు చేసే సమయంలోనే దీన్ని కూడా రద్దు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్రం విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోకుంటే ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

మరోవైపు ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయాలని… అలాగే బీసీ కులగణన చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. లెక్కలు దాచిపెట్టాలని భావించడం ఏంటని ప్రశ్నించారు. పారదర్శకత కావాలంటే కేంద్రం.. ఎవరి జనాభా ఎంత ఉందో లెక్క తేల్చాలన్నారు. ఎందుకు వారి జనాభా దాచిపెట్టాలని.. ఇదేం బ్రహ్మపదార్థం కాదని కేసీఆర్ నిలదీశారు.

Read Also: అమరులైన రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా: సీఎం కేసీఆర్

రైతులకు మేలు కలిగేలా కనీస మద్దతు ధరను కేంద్రం ప్రకటించాలని కేసీఆర్ సూచించారు. ఈ విషయంలో కేంద్రం వెంటనే స్పందించాలని కోరారు. కరోనా సంక్షోభం సమయంలోనూ రైతులను ఆదుకోవాలని ప్రధాని మోదీని కోరినట్లు గుర్తుచేశారు. మరోవైపు కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వాటాలు తేల్చేందుకు ఇన్ని సంవత్సరాలు పట్టకూడదని, ఇందులో కేంద్రం విఫలమైందన్నారు. ఈ విషయమై ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రిని కలిశామని, మళ్లీ వెళ్లి కలుస్తామన్నారు. జలాల వాటాలపై త్వరగా తేల్చకుంటే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంటుందని కేసీఆర్ హెచ్చరించారు.

Related Articles

Latest Articles