బీజేపీని డిఫెన్స్ లో పెట్టేలా కేసీఆర్ ప్లాన్ వేశారా?

రాష్ట్రంలో త్వరలో జరుగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు చావోరావో అన్నట్లుగా మారింది. ఇక్కడ పోటీ ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే నడుస్తోందని భావించినా అనుహ్యంగా కాంగ్రెస్ కూడా రేసులోకి వచ్చింది. కాంగ్రెస్ కేవలం సెకండ్ ప్లేస్ కోసమే పోటీ పడుతుండగా టీఆర్ఎస్, బీజేపీలు మాత్రం గెలిచి సత్తాచాటాలని ఉవ్విళ్లురుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హూజురాబాద్ వేదికగా ఈ రెండు పార్టీలు పొలికల్ హీట్ ను పెంచుతున్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన సీఎం కేసీఆర్ బీజేపీని ప్రస్తుతం ఢిఫెన్స్ లో పడేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

హుజూరాబాద్లో ఈటల గెలుపు ఖాయమనే ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అలర్ట్ అయ్యారు. హుజురాబాద్లో దళిత బంధు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, గొర్రెలు, పెన్షన్ల పంపిణీ వంటి చేపడుతున్నారు. అడిగిన వారికీ లేదనకుండా ఏదోఒక లబ్ధి చేకూరుస్తున్నారు. అయినప్పటికీ ఈటల వైపు గాలివీస్తుందని ఇంటలిజెన్స్ వర్గాలు సీఎం కేసీఆర్ కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా సాకుతో హూజురాబాద్లో ఎన్నిక వాయిదా పడేలా సీఎం కేసీఆర్ చేశారనే టాక్ విన్పిస్తోంది.

మరోవైపు కేసీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక సైతం మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు అర్థమవుతోంది. బీజేపీని దెబ్బతీసే వ్యూహంతో సీఎం కేసీఆర్ హస్తిన పయనమైనట్లు తెలుస్తోంది. పక్కా వ్యూహంతో సీఎం కేసీఆర్ బీజేపీని ముగ్గులోకి లాగుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏడాది కాలంగా ఢిల్లీ ముఖంచూడని కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాని మోదీని, కేంద్రమంత్రులను కలువడం వ్యూహాత్మకంగానే కన్పిస్తోంది. హుజురాబాద్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీపై వ్యతిరేకత తీసుకొచ్చేలా కేసీఆర్ ఢిల్లీ పర్యటనను ఉపయోగించుకున్నారనే టాక్ విన్పిస్తోంది.

టీఆర్ఎస్ భ‌వ‌నం భూమిపూజ కోసమని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ అక్కడే ఐదురోజులు మకాం వేశారు. ప్ర‌ధాని మోడీతో స‌హా హోంమంత్రి అమిత్ షా ఇత‌ర కేంద్ర‌మంత్రుల‌ను కలిసి రాష్ట్ర సమస్యలను ఏకరువు పెట్టారు. విభ‌జ‌న హామీల‌ను అమ‌లు చేయాల‌ని, ఢిల్లీలో తెలంగాణ ప్ర‌భుత్వ అధికారిక భ‌వ‌నానికి స్థలం కావాలని డిమాండ్ పెట్టారు. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెలకొన్న జ‌ల‌వివాదాల‌కు కేంద్ర‌మే ప‌రిష్కారం చూపాల‌ని కోరారు. గతంలో రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా తెలంగాణ‌కు హామీ ఇచ్చిన అనేక అంశాలు కేంద్రం వ‌ద్ద పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటిని కూడా మ‌రోసారి సీఎం కేసీఆర్ బీజేపీ పెద్దల వద్ద ప్రస్తావించడం ద్వారా ఆపార్టీని ఇరకాటంలోనే నెట్టినట్లు కన్పిస్తోంది.

కేంద్రాన్ని డిఫెన్స్ లో పెట్టేలా ఈ సమస్యలనే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని తెలుస్తోంది. ఇప్పుడు బీజేపీ సమస్యలు తీర్చకపోతే హుజురాబాద్ ఎన్నికల్లో వాటిని ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక సందర్భంలో సీఎం కేసీఆర్ పదేపదే పీఎం అపాయిమ్మెంట్ అడిగితే ఇచ్చారని వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా కేసీఆర్ కు కలిసొచ్చే అంశంగా మారనుంది. రాష్ట్ర ప్రయోజనాలకు కోసం బొంతపురుగునైనా కౌగిలించుకుంటానని గతంలో సీఎం కేసీఆర్ చెప్పారు. బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో తాను పదేపదే కేంద్రం పెద్దలను కలిసినా వారి నుంచి సహకారం లభించడం లేదని ప్రజలకు వివరించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారంలో ఇదే విషయాన్నే కేసీఆర్ ప్రధాన అస్త్రంగా బీజేపీపై ప్రయోగించినా ఆశ్చర్యం లేకపోవచ్చనే వాదనలు విన్పిస్తున్నాయి.

ఈ పరిణమాలన్నీ కూడా బీజేపీకి మైసస్ గా మారనుండటం కేసీఆర్ కు అడ్వాంటేజ్ మారనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హుజురాబాద్లో గెలుపు కోసం తీవ్రం ప్రయత్నం చేస్తున్న బీజేపీ తనకు అందివచ్చిన అవకాశాన్ని చేజేతుల కాలరాసుకుంటున్నట్లు కన్పిస్తోందని అంటున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ బీజేపీ వైపు వీస్తున్న గాలిని తనవైపు తిప్పుకునేలా శతవిధలా ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ముందు ఓ రేంజులో రెచ్చిపోయిన బీజేపీ ఇప్పుడు ఢిఫెన్స్ లోకి వెళ్లినట్లు కన్పిస్తోంది. దీంతో హుజూరాబాద్లో ఈటల గెలుపు ఖాయమనుకున్న పరిస్థితి నుంచి పోరాటం చేయాల్సిన పరిస్థితికి బీజేపీ చేతులారా తెచ్చుకుందనే అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-