ముగిసిన తెలంగాణ కేబినెట్.. కీలక నిర్ణయాలు ఇవే

ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం కాసేపటి కిందే ముగిసింది. వానాకాలం సాగుపై వ్యవసాయశాఖ సంసిద్ధత మీద కెబినెట్ లో పూర్తిస్థాయి సమీక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం సహా అనేక సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయ సాగు భారీగా పెరగడంపై కెబినెట్ హర్షం వ్యక్తం చేసింది. గత ఏడాది వానాకాలం, యాసంగి కలిపి 1,06,03,927 ఎకరాల్లో కేవలం వరి పంట సాగు చేయడం ద్వారా సుమారు 3 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి రావడం పట్ల కేబినెట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ కృషిలో భాగం పంచుకున్న వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని, అధికారులు, సిబ్బందిని కెబినెట్ అభినందించింది.

2,601 వ్యవసాయ క్లస్లర్లలో ఏ.ఈ.ఓలు రైతు వేదికలు కేంద్రంగా రైతులకు పూర్తిగా అందుబాటులో ఉంటూ వారికి పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందించాలని, వానాకాలం సాగుకోసం రైతులను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలని క్యాబినెట్ ఆదేశించింది. చేపలు, గొర్రెల పెంపకం వంటి రంగాల్లో అద్భుతమైన కృషిని కనబరుస్తున్న మత్స్యశాఖ, పశు సంవర్ధక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను, అధికారులను, సిబ్బందిని క్యాబినెట్ అభినందించింది.
రాష్ట్రంలోని రేషన్ డీలర్ల కమీషన్ సహా ఇతర సమస్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థలోని సమస్యల పరిష్కార మార్గాల సూచనకై క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సబ్ కమిటీలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు.

హైదరాబాాద్ జిల్లా మినహా పాత తొమ్మిది జిల్లాల్లో ‘తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల (టీఎస్ ఎఫ్.పి.జెడ్) ఏర్పాటుకు క్యాబినెట్ అనుమతించింది. ఒక్కొక్కటి 250 ఎకరాలకు తగ్గకుండా రైస్ మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. అలాగే రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని కేబినెట్ సంబంధిత అధికారులను ఆదేశించింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-