రేపు తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హుజూరాబాద్‌ చుట్టూ తిరుగుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. దళిత బంధుని హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఈ మీటింగ్‌లోనే ముహూర్తం ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఇటీవల పలు దఫాలుగా దళితబంధుపై చర్చలు జరిపిన సర్కారు…ఈ పథకానికి తగిన మార్గదర్శకాలను రూపొందించడం, వీలైనంత తొందరగా అమలులోకి తీసుకురావడం, బడ్జెట్ కేటాయింపులు చేయడం తదితర అంశాలను ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

దళితవాడల్లోని సమస్యలు, అర్హుల జాబితాను అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు దళిత బీమాపై కూడా చర్చించనున్నారు.ఇక చేనేతలకు బీమాపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన తరుణంలో దానిపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. చేనేత బంధుపై సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ సైతం త్వరలో ఈ స్కీం అమలు అవుతుందని స్పష్థం చేశారు. హుజూరాబాద్‌లో ఎస్సీల తర్వాత బీసీ వర్గాల్లో చేనేతల శాతం ఎక్కువగా ఉంది. మరోవైపు 50 వేల ఉద్యోగాల భర్తీ అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.

వీటితోపాటు పంటల సాగు, ప్రాజెక్టుల తదితర అంశాలపై చర్చించనుంది. ఇక కేంద్రం కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేసిన అంశంపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది. కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కూడా కేబినెట్ చర్చించనుంది. జులైలో రెండు సార్లు కేబినెట్ సమావేశం జరిగింది. జూలై 6న మంత్రి వర్గం సమావేశం కాగా..జూలై 13న సమావేశం ఏకంగా రెండు రోజుల పాటు కొనసాగింది. ఈ భేటీల్లో రైతుబంధుతోపాటు వ్యవసాయ సంబంధమైన నిర్ణయాలు తీసుకున్నారు. రేపు మరోసారి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు..

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-