బీజేపీ అనూహ్య నిర్ణయం.. అమిత్ షా ను ‘అక్కడికి’ రప్పిస్తున్నారట..!

బీజేపీ నాయకులు.. తెలంగాణలో అందివచ్చిన వేవ్ ను కొనసాగించేందుకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలనూ చేస్తున్నట్టే కనిపిస్తోంది. దుబ్బాకలో గెలుపు ఇచ్చిన కిక్ తో పాటు.. గ్రేటర్ హైదరాబాద్ లో అందిన అనూహ్య విజయం ఆ పార్టీలో మరింత జోష్ నింపింది. ఇది కొనసాగించడంతో పాటు.. రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ అడుగులకు బ్రేక్ వేయాలన్న లక్ష్యంతో.. బండి సంజయ్ విస్తృతంగా పాదయాత్ర చేస్తున్నారు. ఇదే క్రమంలో అధికార పార్టీపైనా విమర్శల దాడి చేస్తున్నారు. ఈ వేడిని మరింత ముందుకు తీసుకుపోయే దిశగా.. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 17న.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు బీజేపీ నేతలు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనూ విమోచన దినోత్సవాన్ని ఆర్భాటంగా నిర్వహించిన ఆ పార్టీ నేతలు.. ఇప్పుడు తమకు మరింత ప్రజాదరణ రావడమే లక్ష్యంగా సూపర్ ప్లాన్ వేశారు. ఏకంగా.. పార్టీ అగ్రనేత అమిత్ షాను రప్పించి.. సభ నిర్వహించి.. పార్టీ ఉద్దేశాలను జనంలోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. విమోచన దినోత్సవాన్ని అమిత్ షా తో.. నిర్మల్ లో భారీ బహిరంగ సభతో నిర్వహించేందుకు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.

గతంలో సున్నితమైన విషయాల్లో తీవ్రమైన ఘర్షణలు జరిగిన భైంసా ప్రాంతం.. నిర్మల్ జిల్లాలోనే ఉంది. అలాంటి ప్రాంతంలో.. అత్యంత సున్నితమైన నియోజకవర్గంలో.. అమిత్ షాను రప్పించి.. సభను నిర్వహించడం అంటే.. అది మామూలుగా చూడాల్సిన విషయం ఏ మాత్రం కాదు. తెలంగాణలో ఇప్పుడు తమకు ఉన్న అనుకూలతలను మరింత బలంగా మార్చుకునేందుకు.. పార్టీ సందేశాన్ని జనంలోకి మరింత బలంగా తీసుకువెళ్లేందుకు.. ఇది ఉపయోగపడుతుందని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదే జరిగితే.. మరోసారి బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ డైలాగ్ వార్ కు.. మరో అడుగు ముందుకు పడినట్టుగానే భావించాలి. అంతే కాక.. నిర్మల్ కు అమిత్ షా అంటూ వస్తే.. త్వరలో జరగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికపైనా రాజకీయాన్ని ముందుకు తీసుకుపోవచ్చన్న అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో కీలకమైన నిర్మల్, హుజూరాబాద్ నియోజకవర్గాలపై అమిత్ షా నిర్మల్ పర్యటనతో.. తమదైన ముద్ర వేసే అవకాశాలు ఉన్నాయని వారు కసరత్తు చేస్తున్నారు.

బీజేపీ రాష్ట్ర నేతల ప్రయత్నాలు ఫలించి.. అమిత్ షా అంటూ రాష్ట్రానికి వస్తే.. పొలిటికల్ ఫైట్ మరో టర్న్ తీసుకోవడం ఖాయమని చెప్పవచ్చు.

Related Articles

Latest Articles

-Advertisement-