తెలంగాణ ప్రతిపక్షాల టార్గెట్ ‘సెప్టెంబర్ 17’

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం పోలికల్ వార్ నడుస్తోంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగా గత కొంతకాలంగా ర్యాలీలు, సభలు, సమావేశాలు, పాదయాత్రలతో ఈ రెండు పార్టీలు తెగ హడావుడి చేస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు ఈ పార్టీలు జనసమీకరణపై దృష్టి పెట్టడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఈ రెండు పార్టీలు సెప్టెంబర్ 17 తేదీని టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సీఎం కేసీఆర్ గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రతిపక్ష పార్టీలకు సర్దుకోకుండా ఛాన్స్ లేకుండా చేశారు. ఈ నిర్ణయం టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి దోహదపడగా ప్రతిపక్ష పార్టీలకు మాత్రం దిమ్మతిరిగే షాకిచ్చింది. మరోసారి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఆశ్చర్యం లేదని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ సైతం ముందస్తుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలు కూడా తాము నిర్వహించే కార్యక్రమాలకు భారీగా జనసమీకరణ చేస్తూ టీఆర్ఎస్ కు గట్టి సవాల్ ను విసురుతున్నాయి.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం అయ్యాక ఆ పార్టీలో జోష్ నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచి టీఆర్ఎస్ కు గట్టి షాకిచ్చింది. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ధీటుగా సీట్లను సాధించింది. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ప్రచారం చేస్తూ దూసుకెళుతోంది. బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకం అవుతూ జనాలను ఆకట్టుకున్నారు. ఆయన పాదయాత్రకు జనాల్లోనూ మంచి స్పందన వస్తోంది.

ఈ క్రమంలోనే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని అధికారికంగా నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేస్తూ బీజేపీ భారీ స‌భ నిర్వ‌హించేందుకు రెడీ అవుతోంది. ఈ స‌భ‌కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజ‌రు కానున్నారని సమాచారం. ఈ సభకు పెద్దసంఖ్యలో జనాలను తరలించి కేసీఆర్ కు తన బలాన్ని చాటాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ సైతం సెప్టెంబర్ 17తేదినే టార్గెట్ చేయడం ఆసక్తిని రేపుతోంది.

రేవంత్ రెడ్డి టీపీసీసీగా నియామకం అయ్యాక కాంగ్రెస్ లో నయాజోష్ నెలకొంది. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇదేక్రమంలో ద‌ళిత‌, గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ దండోరా స‌భ‌ల పేరుతో కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇదే ఊపులో సెప్టెంబర్ 17న సీఎం కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గ‌మైన గ‌జ్వేల్‌లో ద‌ళిత‌, గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ దండోరా బ‌హిరంగ స‌భ‌ను విజ‌య‌వంతం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.

ఇందులో భాగంగానే ఇంద్ర‌వెల్లి, రావిర్యాల స‌భ‌ల‌కు మించి గ‌జ్వేల్ స‌భ‌కు జ‌న స‌మీక‌ర‌ణ చేప‌ట్టాల‌ని టీపీసీసీ నిర్ణ‌యించినట్లు తెలుస్తోంది. ద‌ళితులు, గిరిజ‌నుల‌కు ఇచ్చిన హామీల అమ‌లులో వైఫ‌ల్యంపై గ‌జ్వేల్ స‌భ‌లో సీఎం కేసీఆర్‌పై శ్వేతపత్రం విడుద‌ల చేయాల‌ని టీపీసీసీ నిర్ణ‌యించింది. మరోవైపు ఈ స‌భ‌కు రాహుల్ గాంధీని ర‌ప్పించేందుకు రేవంత్ ప్రయ‌త్నాలు చేశారనీ కానీ ఫలితం రాలేదని తెలుస్తోంది. ఈ సభకు భారీగా జనాన్నీ సమీకరించి సత్తా చాటాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. బీజేపీ సైతం ఇదే రోజున నిర్మల్లో తెలంగాణ విమోచన దినం పేరిట ఓ సభను నిర్వహిస్తుంది. దీంతో ఈ రెండు పార్టీలు జనసమీకరణ ద్వారా టీఆర్ఎస్ కు గట్టి సవాల్ విసిరేందుకు రెడీ అవుతుండటం గమనార్హం.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-