గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : ఎంపీ సంతోష్ కుమార్ పై తెలంగాణ అసెంబ్లీ ప్రసంశలు

తెలంగాణకు హరితహారంపై చర్చ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కూడా తెలంగాణ అసెంబ్లీలో ప్రతిధ్వనించింది. ఇప్పటికే రాష్ట్రంతో పాటు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను అసెంబ్లీ వేదికగా పలువురు వక్తలు ప్రశంసించారు. యువ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ పర్యావరణ అంబాసిడర్ గా పనిచేస్తున్నారని కొనియాడారు.

సీఎం కేసీయార్ భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలనే తలంపుతో తెలంగాణకు హరితహారం ప్రారంభిస్తే, దాని నుంచి స్ఫూర్తి పొందిన సంతోష్ కుమార్ పర్యావరణం ప్రాముఖ్యతను తెలిపేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా హరిత భావజాల వ్యాప్తికి కృషి చేస్తున్నారని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శాసన సభలో తన ప్రసంగం సందర్బంగా తెలిపారు.

ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా మొక్కల ప్రాధాన్యతను గుర్తిస్తూ, మేము సైతం హరితయజ్జంలో భాగమౌతామని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగమయ్యేలా చేసిన ఘనత ఎంసీ సంతోష్ కే దక్కిందని అన్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్, అంతర్జాతీయ క్రికెటర్ హనుమ విహారి తదితరులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై చేసిన ట్వీట్ లను ఆయన సభలో ప్రస్తావించారు.

అటు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కూడా పర్యావరణ రక్షణ దిశగా ఎంపీ సంతోష్ కుమార్ కృషిని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు. మొత్తం మీద సభలో మాట్లాడిన వక్తలందరూ, తెలంగాణకు హరితహారంలో ప్రభుత్వం కృషిని ప్రశంసిస్తూనే, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని కూడా అసెంబ్లీ వేదికగా కొనియాడటం సమావేశాల్లో హైలెట్ గా నిలిచింది. దీంతో అసెంబ్లీ రికార్డుల్లోనూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు చోటు దక్కినట్లు అయింది.

అసెంబ్లీ లాబీల్లోనూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హాట్ టాపిక్ అయింది. ఎమ్మెల్యేలు, నాయకులు, జర్నలిస్టులు, పోలీసులు, అసెంబ్లీ సిబ్బంది కూడా యువ ఎంపీగా సంతోష్ కుమార్ చేస్తున్న పర్యావరణ సేవలను చర్చించుకోవటం కనిపించింది.

-Advertisement-గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : ఎంపీ సంతోష్ కుమార్ పై తెలంగాణ అసెంబ్లీ ప్రసంశలు

Related Articles

Latest Articles