తెలకపల్లి రవి : వరస ఎన్నికలకు బిజెపి ఆరెస్సెస్‌ రెడీ, మోడీ ఇమేజి కోసం మొహాల మార్పు

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గాన్నిభారీ ఎత్తున విస్తరించినపుడు అందరికీ అర్థమైంది 2022 ఎన్నికల కోణం. 2022 ఫిబ్రవరి నుంచి డిసెంబర్‌ వరకూ బిజెపికి ముఖ్యమైన చాలా రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతాయి. వీటిలో విజయం సాధించకపోతే 2024 లోక్‌సభ ఎన్నికలలో తిరిగి అధికారంలోకి రావడం కూడా కష్టతరమే అవుతుంది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కల్లోలం, మరణాలు మోడీ సర్కారుపై విమర్శలు పరాకాష్టకు చేర్చడమే గాక ఈ ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ వారి విజయావకాశాలను చాలా చోట్ల దెబ్బతీశాయి.ఇప్పుడు మూడో వేవ్‌ గురించి తీవ్రహెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఈ పూర్వరంగంలోనే మోడీ 77మందితో మంత్రి వర్గాన్ని విస్తరించి, చిన్న చిన్న భాగస్వామ్య పార్టీలకూ ప్రాతినిధ్యం కల్పించారు.2022 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సిన ఉత్తర ప్రదేశ్‌ 2019లో బిజెపికి 71 లోక్‌సభ స్థానాలిచ్చింది.

అక్కడ ఎన్నికల విజయం ఆ రాష్ట్రంలోనే గాక రేపు కేంద్రంలో తిరిగిరావడానికి కూడా కీలకం గనక ఏకంగా 15మందికి అక్కడి నుంచి అవకాశమిచ్చారు. ఇక రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం జనాభా నియంత్రణ పేరుతో ఇద్దరు పిల్లలను మించి కన్నవారికి ప్రభుత్వ సహాయం సదుపాయాలు ఉద్యోగాలు కూడా నిరాకరిస్తూ కొత్త చట్టం చర్చకు పెట్టింది. ఎక్కువ మంది పిల్లలను కంటారని పేరున్న ముస్లింలను ఇరకాటంలో పెట్టడానికి,హిందూత్వ ఓట్లను బలోపేతం చేసుకోవడానికి ఈ వ్యూహం చేపట్టారని ప్రతిపక్షాలు, మీడియా కూడా వ్యాఖ్యానించాయి. అయినా అక్కడ విజయం కష్టమేనన్న బావన వుంది. యుపితో పాటు ఎన్నికలు జరిగే పంజాబ్‌లో అకాలీదళ్‌ ఇప్పటికే బిజెపినుంచి విడగొట్టుకుంది.వంటరిగా అక్కడ విజయం సాధించే ప్రసక్తి లేదు.

ఉత్తరాఖండ్‌లోనైతే నాలుగు మాసాలలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చి హడావుడి పడుతున్నారు గాని ఇప్పటికే ఇమేజికి కావలసినంత నష్టం జరిగింది. అక్కడ కుంభమేళాలో తప్పులు దేశవ్యాపితంగా కూడా బిజెపిపై విమర్శలకు కారణమైనాయి. మణిపూర్‌ చిన్న రాష్ట్రమైనప్పటికీ మూడు పార్టీలను కలుపుకొనిబిజెపి కూటమిపాలన నడుస్తున్నది. ఇక 2022 చివరలో హిమచల్‌ ప్రదేశ్‌ గుజరాత్‌ ఎన్నికలు జరగాలి. ఇందులో ప్రధానికి గుజరాత్‌ ఎంత ముఖ్యమో చెప్పనవసరం లేదు. ఈ మధ్యన 2022 జులైలో రాష్ట్రపతి,ఆగష్టులో ఉపరాష్ట్రపతి ఎన్నికలు వస్తాయి. రాష్ట్రాలలో బలాబలాలు ఆ ఎన్నికను చాలా ప్రభావితంచేస్తాయి. 2024లో ఖచ్చితమైన తీర్పు రాకపోతే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపైరాష్ట్రపతి ముద్ర కూడా వుంటుంది.ఇన్ని కారణాల రీత్యా వచ్చే ఏడాది బిజెపికి పెద్దపరీక్షనే.

read also : వంద మంది సీఎంలు వచ్చినా ఈటల గెలుపు ఖాయం : రఘునందన్ రావు


ఈ పూర్వరంగంలో అటు కేంద్ర క్యాబినెట్‌ను పూర్తిగా మార్చేయడమే గాక బిజెపిలోనూ దాన్ని వెనకవుండి నడిపించే ఆరెస్సెస్‌లోనూ కూడా మార్పులు చేర్పులు చేస్తూనే వున్నారు. మంత్రివర్గ పునర్య్యవస్థీకరణ తర్వాత బిజెపి అద్యక్షుడు నడ్డా తమ పార్టీ ప్రధాన కార్యదర్శులు ఇతరులతో సమావేశమై లోతుగాచర్చించారు.కోవిడ్‌ తర్వాత ప్రత్యక్ష సమావేశం ఇదేనంటున్నారు. మరోవంక మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో సమావేశమైన ఆరెస్సెస్‌ విస్త్రత సమావేశం కూడా లోతుగా మంతనాలు జరిపింది. మోడీ ప్రభుత్వాన్ని విమర్శల నుంచి కాపాడ్డం, వచ్చేమూడేళ్లలో ఎన్నికలను ఎదుర్కోవడం గురించి బోలెడు సూచనలు చేసింది.బిజెపితో ఆరెస్సెస్‌ తరపున సమన్వయం జరిపే బాధ్యుడిని కూడా మార్చింది.

2015 నుంచి ఈ పాత్రలో వున్న కృష్ణగోపాల్‌ స్థానంలో అరుణ్‌కుమార్‌ను నియమించింది. వీరిద్దరూ ఆరెస్సెస్‌లో సంయుక్త ప్రధాన కార్యదర్శుల హోదాలో వున్నవారే. ఈ మధ్యన అరుణ్‌కుమార్‌ను ఇందుకోసమే ఈ హోదాలోకి తీసుకున్నారని చెబుతున్నా సంస్థ ప్రతినిధులు మాత్రం ఇదం తామామూలు మార్పేనని తోసిపారేస్తున్నారు. సమస్య ఏమంటే మోడీ సర్కారుపై ఎన్ని విమర్శ లున్నా ఆరెస్సెస్‌ ఇప్పుడు ఆయనను మార్చే సాహసం చేయలేదు, బహుశా వచ్చే ఎన్నికలలో ఆయన బొమ్మతోనే వెళ్లడానికి సిద్ధం కావచ్చు.ఈ కాయకల్ప చికిత్సలూ మొహాల మార్పులూ అన్నీ మోడీ ఇమేజి కాపాడ్డం కోసమేనని సంఘ పరివార్‌ వర్గాలు లోపాయికారిగా ఒప్పుకుంటున్నాయి. కాని అంతిమంగా ప్రతిదీ ఓటర్లపై ఆధారపడి వుంటుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-