తెలకపల్లి రవి : పెగాసస్‌ నిఘా భగభగలు

భారత దేశంలో జర్నలస్టులు ఉద్యమకారులు, హక్కుల కార్యకర్తలు, మేధావులతో పాటు ప్రతిపక్ష నేతలు, స్వంత పార్టీలోనే మంత్రులపైన కూడా నిఘా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయిల్‌ సృష్టించిన పెగాసస్‌ పరికరాన్ని ప్రయోగించిందన్న వార్త పార్లమెంటును కుదిపేస్తున్నది.అందులోనూ పార్టమెంటు సమావేశాలకు ముందురోజే వాషింగ్టన్‌ పోస్ట్‌ లీమాండేలతో సహా ప్రపంచంలోని అనేక ప్రముఖ పత్రికలలో ఈ వార్త వివరాలతో సహాప్రచురితమైంది.భారతదేశంలో దవైర్‌న్యూస్‌ దీన్ని ప్రచురించింది.నిరసనలను అణచివేయడంలోనూ ప్రత్యర్థులపై నిఘావేయడంలోనూ నిర్బంధం సాగించడంలోనూ ఇజ్రాయిల్‌ పేరు మోసింది. ఆ దేశానికి చెందిన ఎస్‌.ఎస్‌.వోగ్రూపు పెగాసస్‌ను తయారు చేసింది. ఎవరిఫోన్లనైనా హ్యాక్‌ చేయగల శక్తి దీనికివుంటుంది. అయితే దీన్ని కేవలం ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తామని ఎస్‌ఎస్‌వో చెబుతున్నది.

అంటే భారతప్రభుత్వం దీన్ని తీసుకుని వుండాలి. ఈ విషయమై పార్లమెంటులో నిరసన ప్రతిధ్వనించినప్పుడు కొత్తగా ఐటి శాఖ చేపట్టిన అశ్విని వైష్ణవ్‌ మాట్లాడుతూ అనధికారికంగా ఫోన్లపై నిఘా వేయడం సాధ్యం కాదన్నారు.అంటే అధికారిక అనుమతితోనే చేసినట్టు స్పష్టం అవుతుంది.భారతదేశంలో వందలాది మంది జర్నలిస్టులే గాక ప్రతిపక్ష నాయకుల ఫోన్ల నెంబర్లు నిఘాకు గురైన జాబితాలో వున్నాయి.ఇదే విధంగా ప్రపంచంలో మొత్తం యాభై వేల ఫోన్లను హ్యాక్‌ చేసిన ఘటనలు జరిగాయని నివేదికలు చెబుతున్నాయి. మోడీ మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రుల నెంబర్లు,సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఒకరి ఫోన్‌ నెంబర్‌ , అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌గోగోయ్‌పై ఆరోపణ చేసిన మహిళ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌, రాహుల్‌గాంధీల నెంబర్లు కూడా అందులో వున్నాయి. 2019లో కర్ణాటక ప్రభుత్వాన్ని కూలదోసిన పథకంలో ఈ విధంగా సేకరించిన సమాచారాన్నివాడుకున్నట్టు ఇప్పుడు తెలుస్తున్నది. వ్యాపారవేత్తలనూ వెంబడిరచడం బట్టి తమవారికి మేలు చేయడం కోసం దీన్ని దుర్వినియోగపర్చినట్టు అర్థమవుతుంది.

వాస్తవానికి రెండేళ్ల కిందటే రాజ్యసభలో సిపిఎం సభ్యుడు రాగేశ్‌ పెగాసస్‌ వ్యవహారాన్ని లేవనెత్తి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.వాట్సప్‌లో స్పైవేర్‌ ద్వారా ఆ గుట్టు బహిర్గతమైంది,. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా ప్రభుత్వం ఎస్‌ఎస్‌వో సేవలు వినియోగించుకుంటున్న విషయాన్ని నిరాకరించలేదు. ఇందుకు సంబందించిన నియమనింబధనలేమిటి? ఖర్చు చేసిన నిధులెన్ని? అసలు భారతదేశంలో చట్టాలు, సుప్రీం కోర్టు తీర్పులు నిఘాకోసం సాప్ట్‌వేర్‌ను వినియోగించడం రాజ్యాంగ విరుద్దం. వ్యక్తుల గోప్యతకు ప్రాథమిక హక్కులకు భంగకరం.ఈ విధమైన అక్రమ మార్గాలలోనే ఎందరో కార్యకర్తల కంప్యూటర్లలోదూరి ఏవో సమాచారం సేకరించి, జొప్పించి అక్రమ కేసులలో నిర్బంధించారు. ఇప్పుడు ఒక్కసరిగా వివరాలు బహిర్గతమయ్యేసరికి సమర్థించుకోలేక సతమతమవుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి నిజాలు దేశం ముందుంచి సంజాయిషీ చెప్పడం మోడీ ప్రభుత్వ బాధ్యత.భవిష్యత్తులో ఇలాటివి జరగకుండానివారించకపోతే ప్రజలు ప్రతిపక్ష నాయకులు పాత్రికేయులు మాట్లాడుకోవడమే సమస్యగా మారుతుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-