తెలకపల్లి రవి : బిజెపిలో ఈటెల చేరిక ఒక యాంటీ క్లైమాక్స్‌

ఈటెల రాజేందర్‌ టిఆర్‌ఎస్‌ సభ్యత్వానికి శాసనసభకు రాజీనామా చేయడంతో తెలంగాణలో గత పక్షం రోజులుగా సాగుతున్న రాజకీయ చర్చలో ఘట్టం ముగిసింది, ఢల్లీిలో బిజెపి జాతీయ అద్యక్షుడు జెపి నడ్డా తదితరులను రాష్ట్ర అద్యక్షుడు బండిసంజయ్‌ సహా కలసి వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఆ పార్టీలో చేరతారా లేదా అన్న మీమాంస అర్థం లేనిది. ఈ నెల తొమ్మిదవ తేదీన అంతకు ముందురోజో ఆయన చేరతారని బిజెపి ముఖ్యనేతలే చెబుతున్నారు. టిఆర్‌ఎస్‌లో తిరుగుబాటు తీసుకొచ్చి అసమ్మతివాదులను కూడగట్టి ఏదో దుమారం లేవనెత్తుతారని ప్రచారం జరిగినా చివరకు ఈటెల బిజెపిలో చేరడం ఒక యాంటీ క్లైమాక్స్‌ వంటిదే. పైగా ఆయన చెప్పిన వామపక్ష భావజాలం సామాజిక న్యాయం వంటి అంశాలకు బిజెపిలో చేరికతో పెద్ద ప్రాధాన్యత లేకుండా పోయినట్టే. బహుశా ఈ కారణంగా ఆయన కొంతమంది సానుభూతిని పోగొట్టుకుని వ్యతిరేకత తెచ్చుకోవచ్చు కూడా.

ఆయన రాజీనామా చేసిన హుజూరాబాద్‌లో ఉపఎన్నిక ఎప్పుడువస్తుందో గానీ ఓట్లు టిఆర్‌ఎస్‌ నుంచి ఈటెలకు మారడం ఆయనతో పాటు బిజెపికి చేరడం అంత సులభం కాదు. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలోనూచాలా నగరపాలక సంస్థల్లోనూ బిజెపికి వచ్చిన ఓటింగు చూస్తే మేమే తెలంగాణలో కాబోయే ప్రత్యామ్నాయమని వారంటున్న దానికి పెద్దగా ఆధారం కనిపించదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ మూకుమ్మడిగా చేసే దాడిని తట్టుకుని నెట్టుకురావడం ఈటెలతో పాటు బిజెపికీ పెద్ద సవాలే. ఆయన బదులు భార్య జమున పోటీ చేస్తారని వస్తున్న సూచనలకు అదే కారణం కావచ్చు. అదే జరిగితే పోటీకి ముందే ఓటమి ఛాయలు ప్రవేశించినట్టవుతుంది.

రాజీనామాకు ముందు ఈటెల ముఖ్యమంత్రి కెసిఆర్‌పైన, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపైన చాలా వ్యాఖ్యలు చేశారు కాని నిన్నటి వరకూ ఆ వ్యవస్థలో కీలకస్థానంలో వున్న వ్యక్తిగా ఆ మాటలకు పెద్ద ప్రభావం వుండదు. అదే నిజమైతే ఇంతకాలం ఎందుకు సహించారన్న ప్రశ్న వస్తుంది. ప్రగతిభవన్‌ బానిసల నిలయంగా మారిందనే మాట చాలా పెద్దది. 2016లో ప్రగతిభవన్‌ కడితే అయిదేళ్లు అక్కడ నుంచి అధికారంలో పాలుపంచుకున్న ఈటెల వంటివారు ఆ మాట అనడం ఎలా చెల్లుతుంది? మమ్ముల్ను లోపలకి రానివ్వలేదని ఆరోపించే వ్యక్తి ఆ రోజు ఎందుకు మౌనంగా వున్నారు? కెసిఆర్‌ ఏకపక్షపాలన విమర్శ ఒకటైతే ఆయనగా చర్య తీసుకునేవరకూ అక్కడే కొనసాగిన ఈటెల వంటివారు ఇప్పుడు ఆరోపణలకు గురై ధిక్కార స్వరాలు వినిపించడం విడ్డూరంగా ధ్వనిస్తుంది.

భూ కబ్జా చేయలేదని ఖండిస్తూనే భూములు కొనుగోలు చేసిన మాట నిజమని ఆయన ఆయన భార్య కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నారు. ఆయన ఒక్కరే చేశారా అనే ప్రశ్న మరో అంశం, అందరిమీద చర్య తీసుకోవలసిందే గాని అది వారిపై ఆరోపణలను తక్కువ చేయదు. ఆ మాటకొస్తే ఇప్పుడు వారుచేరాలనుకుంటున్న బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్‌ కూడా ఆయనతో పాటు అందరిపై దర్యాప్తు జరపాలని అడిగినవారే. మరి ఆ ప్రక్రియ ఏమీ జరగకుండానే చేర్చుకోవడానికి ఎందుకు తొందరపడుతున్నట్టు?ఇక ఈటెల రాజేందర్‌పై చర్యతో టిఆర్‌ఎస్‌లో ముసలం పుడుతుందనీ, సామాజిక శక్తులతో ప్రత్యామ్నాయ వేదిక వెలుస్తుందని చాలా కథలు నడిచాయి.

అవి నిజం కాకపోగా అధికార పార్టీయే ఎక్కువగా అక్కడ ఎదురుదాడి సాగించింది. ఈటెలతో వచ్చిన జిల్లా నాయకులు వేళ్లమీద లెక్కపెట్టదగినంత మంది మాత్రమే వున్నట్టు కనిపిస్తుంది.వాస్తవానికి ఆయన కాంగ్రెస్‌ బిజెపి నాయకులను కలుసుకున్నదే ఎక్కువ. కాంగ్రెస్‌తో చర్చలపై ఆపార్టీ నేతలు భిన్నస్వరాలు వినిపించగా బిజెపిలోనూ అనేక గొంతులు వినిపించాయి. ఎంఎల్‌ఎ రాజాసింగ్‌ వంటివారే బేషరతుగా ఆహ్వానం పలికారు.టిఆర్‌స్‌తో బిజెపి కలవబోదని ఈటెల హామీ కోరారని చెప్పారు గాని వారు సూటిగా అలాటిదేమీ ఇచ్చింది లేదు, ఎన్నికల్లో విడిగానే పోరాడతామనిమాత్రం చెప్పారట. టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ బిజెపి కేంద్రం విధానాలను విమర్శిస్తూనే వ్యూహాత్మకంగా అప్పుడప్పుడు మద్దతుగా మాట్లాడటం,రాజ్యసభలో అనుకూలంగా వ్యవహరించడం తెలిసిన విషయాలే.

ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వం కెసిఆర్‌ సర్కారు కూడా తమ మనుగడకు అవసరమైన వ్యూహాలే అనుసరిస్తాయి గాని ఈటెల కోసం హామీలు ఇచ్చే అవకాశం వుండదు. ఆత్మగౌరవం అనే మాట అదేపనిగా వినిపించిన మాజీ మంత్రి ఆ విషయమై బిజెపికి ఎలాటి షరతులు పెట్టినట్టు కనిపించదు. నరేంద్రమోడీ అమిత్‌షా ద్వయం అక్కడ అన్నిటినీ నిర్ణయిస్తుందని దేశమంతటికీ తెలుసు. వారి రాజకీయ నినాదం హిందూత్వ సిద్దాంతం, తెలంగాణ అస్సాం ఏదైనా ఆ తర్వాతనే, దక్షిణ భారతంలో బిజెపికి అవకాశం చాలా తక్కువ. తెలంగాణలోనూ దుబ్బాక జిహెచ్‌ఎంసిల తర్వాత వారు పెద్ద ప్రభావం చూపింది లేదు. ఈ పరిస్థితులలో ఈటెల బిజెపిలోచేరడం అస్తిత్వ పరిరక్షణ కోసం తప్ప అంతకు మించి చెప్పేవన్నీ మిథ్యమాత్రమే, 2018 ఎన్నికలతో పోలిస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో హుజూరాబాద్‌ లోబిజెపికి 24 వేల ఓట్ల వరకూ వచ్చాయి.

అయితే లోక్‌సభ ఒటింగు శాసనసభల్లో మారడం చాలాసార్లుచూస్తాం. అప్పటి పొందిక కూడా ఇప్పుడు మారింది, ఈటెల కారుదిగి కమలంతగిలించుకున్న ఈటెలకు లేదా ఆయన కుటుంబ సభ్యులకు పాత ఓటింగు వస్తుందా అనేది ఉప ఎన్నికల నాటికి కాని తేలనివిషయం. ఇప్పటికైతే టిఆర్‌ఎస్‌లో గండి పెట్టడంలో ఆయన పెద్దగా జయప్రదం కాలేకపోయారన్నది నిజం. ఆయన కెసిఆర్‌ వ్యతిరేక శక్తులన్నిటికీ కేంద్ర బిందువుగా మారతారని ఆశపెట్టుకున్నవారికి కూడా నిరుత్సాహమే మిగిలిందని చెప్పాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-