తెలకపల్లి రవి: అన్నపై అలుక కాదన్న షర్మిల, మూడు ప్రధాన పార్టీలపై ధ్వజం

వైఎస్‌ షర్మిల తెలంగాణలో ప్రారంభించిన వైఎస్‌ఆర్‌సిపి ఇంకా ప్రభావశీలంగా మారవలసే వుంది.విస్త్రత కార్యాచరణ చేపట్టవలసే వుంది.అయితే ఆమె వైఎస్‌రాజశేఖర రెడ్డి కుమార్తె కావడం, అంతకు మించి ఆమె అన్న జగన్మోహనరెడ్డి ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వుండటం వల్ల కావలసినంత ప్రచారం లబించడం సహజమే.అందుకు తోడు మీడియాలో ఒక భాగం ఆమె పార్టీ స్థాపనకు ముందునుంచే అమితంగా కథనాలు వదలడం, జగన్‌పై కోపంతోనే ఈ పార్టీ స్థాపిస్తున్నారని జోస్యాలు చెప్పడం ఆసక్తి పెంచింది.తెలంగాణలో పార్టీ పెట్టి ఎపి ముఖ్యమంత్రిపై ఎలా పోరాడతారని ఆప్పట్లో నేను ఎన్‌టివిలో గట్టిగా ప్రశ్నించాను. అంతేతప్ప ఆమె పార్టీ పెట్టే అవకాశాన్ని హక్కునూ ఎప్పుడూ ప్రశ్నించలేదు. నిజంగానే లోటస్‌పాండ్‌లో హడావుడి ఒకటి రెండు దీక్షలు, బహిరంగ సభలతర్వాత జులై8న వైఎస్‌వర్ధంతి సందర్భంగా ఆమె పార్టీ పేరును ప్రకటించారు.కెసిఆర్‌ ప్రభుత్వంపైన, సూటిగాముఖ్యమంత్రిపైన తీవ్ర అస్త్రాలు సంధించారు. మొదట్లో వీటిపై స్పందించకుండా వదిలేసిన టిఆర్‌ఎస్‌ నేతలు తర్వాత గట్టిగానే విమర్శించడం మొదలుపెట్టారు. హరిష్‌రావు వంటి సీనియర్‌ మంత్రులు కూడా తీవ్ర వ్యాఖ్యలే చేశారు.ఈ లోగా రేవంత్‌ రెడ్డి టిపిసిసి అద్యక్షుడు కావడంతో వైఎస్‌ వారసత్వం కాంగ్రెస్‌దా షర్మిలదా అనే వివాదం కూడా మొదలైంది. ఇన్నిటి మధ్యలో షర్మిల శుక్రవారం నాడు మీడియాతో సమావేశంలోతమ పార్టీ గురించి వివరమైన సమాధానాలిచ్చారు.

జగన్‌తో విభేదాల కారణంగా తాను పార్టీ పెట్టలేదని తేల్చిచెప్పడం వాటిలో మొదటిది. అన్నపై అలిగితే పుట్టింటికి పోవడం మానేస్తారు గాని పార్టీ పెట్టరని వ్యాఖ్యానించారు. అయితే తమమధ్య విభేదాలు లేవని స్పష్టంగా చెప్పడమూ జరగలేదు. కాని ఎపిలో రాజన్న రాజ్యం వస్తున్నట్టే కనిపిస్తుందని రాకపోతే అక్కడి ప్రజలే చూసుకుంటారని సమాధానమిచ్చారు. తాము వేర్వేరు ప్రాంతాలకు(అంటే రాష్ట్రాలకు) ప్రాతినిధ్యం వహిస్తున్నామని కూడా చెప్పారు. ఎపిలో ఎందుకు పార్టీ పెట్టలేదంటే తెలంగాణప్రజలకోసం పనిచేయదల్చుకున్నందునేనని కూడా పేర్కొన్నారు. అంటే కోపతాపాలతోపార్టీ పెట్టలేదని అక్కడ రాజన్న రాజ్యం వస్తున్నట్టే వుందని, వేర్వేరు ప్రాంతాలు గనక పార్టీలుగా ఘర్షణకు అవకాశం లేదని ఈ వ్యాఖ్యల సారాంశంగా కనిపిస్తుంది. గతంలో వినవచ్చినకథనాలనూ ఈ సమాధానాలనూ పోల్చి చూస్తే తమ జోస్యాలునిజమైనాయనుకున్నవారు మరోసారి ఆలోచించుకోవడం అనివార్యమవుతున్నది. నదీజలాలలో తెలంగాణ వాటాకోసం పోరాడతామని చెబుతూనే ఇతరుల వాటాను అడ్డుకోబోమని కూడాచెప్పారు. ఇవన్నీ చేయగల స్తితిలో వైఎస్‌ఆర్‌టిపి లేకపోవచ్చు గాని రాజకీయ ఆలోచనాధోరణిని మాత్రం ఈ జవాబులు వెల్లడిస్తున్నాయి.

ముఖ్యమంత్రి కెసిఆర్‌పైన, మంత్రి కెటిఆర్‌పైన వ్యాఖ్యలుచేసిన తీరులో తీవ్రత ఎలా వున్నా సమాచారలోపం, సంయమనం లోపించడం కనిపిస్తుంది. బహుశా సహాయకులు ఆమెను అప్‌డేట్‌ చేయలేదని అర్థమవుతుంది.బిజెపి మతతత్వ పార్టీ అనీ దానికి తాము వ్యతిరేకమని అంటూనే కాంగ్రెస్‌ ఎప్పుడో చచ్చిపోతే వైఎస్‌ బతికించి రెండుసార్లు గెలిపించారని వ్యాఖ్యానించడం ఆపార్టీ నేతలకు రుచించేది కాదు. అలాటి వైఎస్‌పాదయాత్ర చేస్తానంటే అనుమతించలేదని, మరణించిన తర్వాత ఆయనపేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని ధ్వజమెత్తడం పరోక్షంగా జగన్‌కు అనుకూలమైన వ్యాఖ్యే. బిజెపి టిఆర్‌ఎస్‌లలో ఎవరు షర్మిల వెనక వున్నారనే విశ్లేషణలను ఖండిరచడానికే ఆ రెండు పార్టీలపైన తీవ్రంగా స్పందించారనుకోవాలి.

అయితే షర్మిల స్పష్టత ఇచ్చారు గనక ఆమె పార్టీపైనదానివెనక శక్తులపైన వున్న వూహాగానాలు అంచనాలు అభిప్రాయాలు మీడియా కథనాలు ఒక్కసారిగా మారిపోవు. ఆ పార్టీ ఆచరణ, ప్రజల ఆదరణ,ఏదైనా ఎన్నికల్ల్లో పాల్గొంటే పడేఓట్ల సంఖ్య వంటివన్నీ చూడవలసి వుంటుంది.ఇతర పార్టీలు ముఖ్యంగా పాలక టిఆర్‌ఎస్‌ ప్రతిస్పందన మరింత కీలకమవుతుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-