తెలకపల్లి రవి: రేవంత్‌, షర్మిల ఎంట్రీ.. జగన్‌, పవన్‌ ‘ఎగ్జిట్‌’..!

తెలంగాణ రాజకీయాలలో ఒక్కసారిగా నాయకత్వాలు, పార్టీల పాత్రలూ ప్రవేశ నిష్క్రమణలూ జరగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వీటి ప్రభావం ఎలా వుంటుందనేదానిపై ఎవరి అంచనాలు వారికి వుంటాయి గాని మార్పు తథ్యం. పైగా ఇవన్నీ ఒకటి రెండు రోజుల తేడాతో జరగడం మరీ విశేషం. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పీసీసీ పదవి దక్కించుకున్న రేవంత్‌ రెడ్డి తనదైన శైలిలో అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించారు. చాలా కాలం తర్వాత గాంధీ భవన్‌ కళకళలాడింది. ఆ మరుసటి రోజునే వైఎస్‌ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె షర్మిల వైఎస్‌ఆర్‌టిపి ఏర్పాటును ప్రకటించారు.

కెసిఆర్‌ ఫాంహౌస్‌లో బందీగా వున్న తెలంగాణ తల్లిని విముక్తిచేయాలని కాంగ్రెస్‌ నాయకులు కార్యకర్తలు ఒక్కతాటిపై నిలిచిపనిచేయాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. ఆయన స్వంతఅనుచరగణం నినాదాలను అడ్డుకుంటూ ఎవరూ వ్యక్తిగతంగా నాయకునికి జై కొట్టరాదని హెచ్చరించారు. కెసిఆర్‌ నుంచి అధికారంగుంజుకొనడమే ఆలస్యం అన్నట్టు మాట్లాడారు. ఇక షర్మిల గతం నుంచి అంటున్నట్టే రాజన్నరాజ్యం సంక్షేమ పథకాలు నిరుద్యోగం రైతు శ్రేయస్సు వంటి విషయాలను ప్రస్తావించారు. నదీజలాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు నిముషాలు కూర్చొని పరిష్కరించుకునేబదులు వివాదంపెంచుతున్నారని ఆరోపించారు. తెలంగాణ నీటిచుక్క కూడా వదులుకోబోమని ప్రకటించారు. మహిళలకు సగం సీట్లు అన్నారు. ఆమె తల్లి, వైఎస్‌ఆర్‌సిపి గౌరవాద్యక్షురాలు విజయమ్మ తన బిడ్డలైన జగన్‌ షర్మిల ఇద్దరి పట్టుదలనూ ప్రశంసిస్తూ మాట్లాడారు. వైఎస్‌ వారసులుగా కుటుంబపరంగా షర్మిల, జగన్‌ల వేర్వేరు పార్టీలు పెట్టుకోవడం ఒకటైతే రేవంత్‌, షర్మిల ఇద్దరూ వైఎస్‌ వారసత్వం తమదని ప్రకటించడం రాజకీయ వివాదం.

వీరిహడావుడి ఒక కొలిక్కి రాకముందే బిజెపి అద్యక్షుడు బండిసంజయ్‌ 9వ తేదీ నుంచి పాదయాత్ర సంకల్పం ప్రకటించారు. షర్మిల పార్టీ ప్రారంభం అవుతున్న రోజునే ఎపి ముఖ్యమంత్రి జగన్‌ తాము తెలంగాణ రాజకీయాలలో వేలుపెట్టబోమని ప్రకటించారు. నదీజలాలసమస్యలపై విమర్శలు చేస్తూనే తెలంగాణలో గాని తమిళనాడులో గాని ఏ పొరుగురాష్ట్ర రాజకీయాలలోనూ తలదూర్చబోమన్నారు. విచిత్రమేమంటే అదే రోజున జనసేన అద్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా పార్టీల నిర్మాణానికి వేల కోట్లు కావాలని ప్రస్తుతం అంత డబ్బు తమకు లేనందువల్ల ఇప్పుడు తెలంగాణలో పార్టీ నిర్మాణం చేయలేమని ప్రకటించారు. తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు అలా ప్రకటించకపోయినా ఆపార్టీ రాష్ట్ర అద్యక్షుడు ఎల్‌రమణ రాజీనామా ఇచ్చి టిఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్టు వెల్లడిరచారు. బహుశా ఇన్ని సందర్భాలు ఒక్కసారిగా కలసి రావడం ఎక్కడైనా చాలా అరుదే.

మరోవైపునుంచి చూస్తే టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కెటిఆర్‌ నలుగురికీ ఒకే సమాధానం అన్నట్టు కొత్తబిచ్చగాళ్లు పొద్దెరగరని ఎద్దేవా చేశారు. రేవంత్‌ చిన్నపదవికే పెద్దహడావుడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కెసిఆర్‌ను తిడితే పదవులు రావనీ ప్రజలకోసంపనిచేసి చేరువ కావాలని సూచించారు. ఇక బండి సంజయ్‌ రాష్ట్రానికి కావలసినవి చేయకుండా బడాయిమాటలు మాట్లాడితే ఫలితంవుండదన్నారు. ఇలామొత్తంపైన ఎన్నికలు ఎంతో దూరంలో వుండగానే తెలంగాణ రాజకీయాలు వేడెక్కడం చూస్తున్నాం, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఇప్పుడువుండకపోవచ్చు గనక అప్పటి వరకూ వాదోపవాదాలు మరింత ముదరడం తథ్యం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-