శ్రీ రాముల వారి కంట కన్నీరు.. ప్రమాదంలో భక్తులు

దేశంలో ఎన్నో వింతలను చూస్తూనే ఉంటాం.. వినాయకుడు పాలు తాగాడు.. వేప చెట్టుకు పాలు వస్తున్నాయి.. సాయి బాబా ఆహారం తిన్నాడు.. ఇవన్నీ వింతలే.. అందులో నిజమెంత అనేది పక్కన పెడితే.. ఆ వింతను చూడడానికి మాత్రం భక్తులు భారీసంఖ్యలో హాజరవుతున్నారు. ఇక తాజాగా ప్రకాశం జిల్లాలో శ్రీరాముడు కంట కన్నీరు రావడం అనేది వింతగా మారింది. శ్రీరాముడి విగ్రహం నుంచి నీరు ధారాళంగా కారడంతో భక్తులు భయపడిపోతున్నారు. రాములవారిని చూడడానికి వేలసంఖ్యలో హాజరవుతున్నారు.

వివరాలలోకి వెళితే.. కొనకనమిట్ల మండలంలోని మునగపాడులో వింత చోటుచేసుకుంది. గత రెండు రోజుల నుంచి గ్రామంలోని రాముడి ఆలయంలో శ్రీరాముడు ఏడుస్తున్నాడు. ఆయన కంటి నుంచి కన్నీరు ధారాపాతంగా కారుతోంది. కేవలం సీతారాముల విగ్రహాల నుంచేకాక లక్ష్మణ, హనుమ విగ్రహాల నుంచి కూడా ఇలాగే నీరు కారుతుందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. దీని చూసి భక్తులతో పాటు పూజారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి ముప్పు వాటిల్లుతోందని, భక్తులు ప్రమాదంలో ఉన్నారని పూజారులు భయాందోళన చెందుతున్నారు. ఇక రాముల వారి కంట నీరు అని తెలియడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా ఆలయానికి చేరుకొని ఆ వింతను చూడడానికి ఎగబడుతున్నారు. అసలు విగ్రహం నుంచి నీరు ఎందుకు వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

Latest Articles