అజేయ రికార్డు హుష్‌కాకి… ఓటమితో కొత్త ఏడాదికి స్వాగతం

కొత్త ఏడాదిని టీమిండియా ఓటమితో ప్రారంభించింది. జోహన్నెస్ బర్గ్ టెస్టులో గెలిచి తొలిసారి సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ సాధిస్తుందన్న అభిమానుల ఆశలను టీమిండియా తలకిందులు చేసింది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న జట్టు… రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 300 పరుగులు చేయకపోవడం నిరాశ కలిగించే విషయమే. దీంతో తొలిసారిగా వాండరర్స్ స్టేడియంలో టీమిండియా ఓటమి పాలయ్యింది. ఈ టెస్టు ముందు వరకు వాండరర్స్ స్టేడియంలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. రెండు మ్యాచ్‌లను గెలిచి.. మరో మూడు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. అయితే తొలిసారిగా ఈ పర్యటనలో జోహన్నెస్ బర్గ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. దీంతో ఈ మైదానంలో టీమిండియా అజేయ రికార్డుకు బ్రేక్ పడింది.

Read Also: తండ్రి అయిన దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డికాక్

మరోవైపు కొత్త ఏడాదిని ఓటమితో ఆరంభించిన భారత్‌ ముందు ఈ ఏడాది చాలా సవాళ్లు ఉన్నాయి. సొంతగడ్డపై వెస్టిండీస్, శ్రీలంకలతో సిరీస్‌లతో పాటు ఇంగ్లండ్ పర్యటన, టీ20 ప్రపంచకప్, ఆసియా కప్… ఇలా చాలా మ్యాచ్‌లు భారత్ ఆడాల్సి ఉంది. ఆయా మ్యాచ్‌లలో ఫలితాలు అనుకూలంగా రావాలంటే పటిష్ట జట్టును ఏర్పాటు చేసుకోవాలి. పరిమిత ఓవర్లకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించడంతో అతడు ఏ మేరకు రాణిస్తాడో కాలమే సమాధానం చెప్పాలి. అయితే భారత బౌలర్లు తరచూ గాయాలపాలవుతున్నారు. దీంతో జట్టును పదేపదే మార్చాల్సి రావడంతో ప్రణాళికలు దెబ్బతింటున్నాయి. బౌలింగ్ విషయంలో బుమ్రా, షమీ, ఇషాంత్, భువనేశ్వర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, హార్డిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వంటి కీలక ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ మెరుగైన ప్రదర్శన చేస్తేనే భారత్‌కు విజయాలు దక్కుతాయి.

Related Articles

Latest Articles