ఉద్యమాన్ని అణిచివేయడానికే సెలవులు: TPTF

ఉద్యమాన్ని అణిచి వేయడానికి ప్రభుత్వం సెలవులు ఇచ్చిందని టీపీటీఎఫ్‌ అధ్యక్షులు కె. రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం మొదలై నాలుగు నెలలే అయిందన్నారు. 135 పని దినాల్లో అందులో ప్రత్యేక కార్యక్రమాలు, పరీక్షలు పోనూ జరిగిన బోధనా గంటలు మరీ తక్కువ.ఈ పరిస్థితుల్లో సెలవులను కుదించి, విద్యార్థులకు నష్ట నివారణకు చర్యలు చేపట్టకుండా సెలవులు ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల్లో లోకల్‌ క్యాడరైజేషన్‌న గందరగోళంలో 15రోజుల విలువైన బోధన గంటలు వృధా అయ్యాయన్నారు. ఏ సమూహాలకు, సమావేశాలకు లేని ఒమిక్రాన్ భయం, నిబంధనలు విద్యా సంస్థలకే ఎందుకని వారు ప్రశ్నించారు. జీవో 317 పోస్టింగ్‌ ఆర్డర్లు ఇచ్చి ఉద్యమాన్ని నిలువరించేందుకు సెలవుల ప్రకటన చేశారని ఆరోపించారు. సంక్రాంతికి 3 రోజుల సెలవులు చాలన్న అభిప్రాయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. అడిగేది పక్కన పెట్టి, అనవసరమైన సెలవుల ప్రకటనలో తొందర ఎందుకని వారు మండిపడ్డారు.

Read Also: తిరుపతిలో టూరిజం ఉద్యోగి దారుణ హత్య

పారదర్శకత లేకుండా, స్థానికతను పరిగణలోకి తీసుకోకుండా హడావిడిగా చేసిన జిల్లాల కేటాయింపు ప్రక్రియను రద్దు చేసి, సరైన మార్గదర్శకాలతో తిరిగి చేపట్టాలని కొద్ది రోజులుగా ఉపాధ్యాయులు ఉద్యమిస్తున్నారన్నారు. దీనికి తోడు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు గొంతు కలుపుతున్నాయి. ఈ ఉద్యమాన్ని నిలువరించేందుకు సంక్రాంతి సెలవులను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని వారు ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంక్రాంతి ఆంధ్రా పండగ అని, ఇక్కడ పెద్దగా జరుపుకోరని ఇదే ముఖ్యమంత్రి గారు ప్రకటించి అప్పటి వరకు ఉన్న సెలవులు రద్దు చేసిన విషయం మర్చిపోవద్దని సూచించారు. టీచర్లు వ్యతిరేకిస్తున్న జిల్లాల కేటాయింపు, బదిలీలను ఏక పక్షంగా పూర్తి చేయడానికే, ఓమిక్రాన్ పేరుతో సెలవులు పొడిగించారని వారు ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా సంక్రాంతి సెలవులను 3 రోజులకు పరిమితం చేసి, లోకల్ క్యాడరైజేషన్ ప్రక్రియను పారదర్శకంగా, స్పష్టమైన మార్గదర్శకాలతో తిరిగి నిర్వహించాలని కె. రమణ, మైస శ్రీనివాసులు కోరారు.

Related Articles

Latest Articles