గౌరవ సభలు కాదు..కౌరవ సభలు!

ప్రజాస్వామ్యంలో చట్ట సభలే దేవాలయాలు. ఒకప్పుడు వాటి పట్ల ప్రజలకు ఎంతో గౌరవం. కాని నేడు చట్ట సభల సమావేశాల తీరు మారింది. ప్రతిష్ట మసకబారింది. గౌరవ సభలు కాస్తా కౌరవ సభలు అవుతున్నాయి.

చట్టసభల్లో మటలు హద్దులు హద్దులు దాటుతున్నాయి. హూందాగా సాగాల్సిన సమావేశాలు జుగుప్సాకర స్థాయికి దిగజారాయి. రాజకీయాలతో సంబంధం లేని వారిని, కుటుంబ సభ్యులను ఈ రొచ్చులోకి లాగి సమావేశాలంటేనే వెగటుపుట్టేలా చేస్తున్నారు.

వారు వీరు అని లేదు. ఎవరు అధికారంలో ఉన్నా జరుగుతోంది ఇదే. ఒక్క ఏపీకో..తమిళనాడుకో పరిమితం కాదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇదే తంతు. సభ్యులకు సహనం కరువైంది. ఇంగితం అంతకన్నా లేకుండాపోతోంది. ఏం మాట్లాడుతున్నామనే స్పృహ లేకుండా పోతోంది. అందుకే కౌరవ సభలను మించిన దృశ్యాలను అసెంబ్లీలలో చూస్తున్నాం. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యలను గాలికి వదిలేసి వ్యక్తిగత దూషషణలకు పరిమితమవుతున్నారు.

తాజాగా, ఏపీ పరిణామాలు నేత సహజ స్వరూపాలను మరోసారి బట్టబయలు చేశాయి. టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టటం అందరి దృష్టిని ఆకర్షించింది. బాబు కంటతడికి కారణం ఆయన మాటల్లోనే.. అసెంబ్లీలో అధికార పక్షం అనుచిత విధానాలు అనుసరిస్తోంది. వైసీపీ సభ్యులు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేని ఆయన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారు.

చంద్రబాబు సతీమణి గురించి ఎవరు కామెంట్‌ చేశారో తెలియదు. కాని సభలో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారనేది నిజం. అందుకే కౌరవ సభ అంటూ వ్యాఖ్యానించారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని వాకౌట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. ఏదేమైనా ఈ పరిణామాలు శాసన సభ గౌరవాన్ని మంటగలిపాయి.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో సభ్యుల పరస్పర దూషణలు కొత్త కాదు. గతంలో కూడా అనేక సందర్బాలలో ఇలాంటి వాటిని చూశాం. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో అభ్యంతరకర పద ప్రయోగాలు చేసుకున్నారు. కాని, పదిహేను సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, పార్టీ అధినేత మీడియా ముందు కన్నీరు పెట్టుకోవటాన్ని తేలికగా కొట్టిపారేయలేము. అది చూసిన వారిని తప్పకుండా బాధిస్తుంది. ఏ స్థాయిలో మనస్థాపం చెందితే అలా కంటితడి పెడతారని పరిశీలకులు అంటున్నారు. సభలో లేని వ్యక్తుల గురించి..పైగా మహిళల గురించి వ్యాఖ్యలు చేయటం ఎంత మాత్రం సరికాదు. అది ఎవరు చేసినా తప్పే. ఇందులో వారు వీరు అనే వివక్షకు తావు లేదు.

వై ఎస్‌ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికార పార్టీ సభ్యులు సభలో అనేక మార్లు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిత్వ హననానికి ప్రయత్నించారు. ఐతే, రాజకీయాల్లో లేని వారు.. సభలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావించటం తప్పు. అది సభా సంప్రదాయం కాదు. ఎవరు, ఎవరిని రెచ్చగొట్టినా వ్యక్తిత్వ హననానికి పాల్పడినా ఖండించాల్సిందే.

గడచిన రెండున్నర సంవత్సరాలుగా తనను బండ బూతులు తిట్టారని, తన జీవితంలో ఎన్నడూ ఇలాంటివి ఊహించలేదని చంద్రబాబు గద్గద స్వరంతో అన్నారు. బాబు ఎపిసోడ్‌పై ఎన్టీయార్‌ ఫ్యామిలీ ఘాటుగా స్పందించింది. ఆయన వియ్యంకుడు బాలకృష్ణ కుటుంబసభ్యులతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఈ పరిణామాలతో చాలా బాధకలిగించిందన్నారు. అసెంబ్లీలో ఉన్నామో.. పశువుల దొడ్డిలో ఉన్నామో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. మళ్లీ ఇలాంటి నీచపు, నికృష్టపు మాటలు మాట్లాడితే సహించేది లేదని వార్నింగిచ్చారు.

చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు అంతలా రియాక్ట్‌ అయ్యారంటే..అసలు అసెంబ్లీలో ఏం జ‌రిగింది? అంటే అలాంటిదేమీ లేదంటున్నారు వైసీపీ నాయకులు. నిజానికి ఆయన సతీమణి భువనేశ్వరి ప్రస్తావనే సభలో రాలేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. జరగని విషయంపై ఎన్టీఆర్ కుటుంబం మాట్లాడటం దురదృష్టకరం అంటూ వ్యాఖ్యానించారు. సభలో ఏ ఎమ్మెల్యే అలా మాట్లాడారో బయటపెట్టాలని.. ఆ రికార్డులు చూపించాలని డిమాండ్ చేశారు.

అసలు ఇదంతా చంద్రబాబుతోనే మొదలైందని వైసీపీ ఆరోపిస్తోంది. బాబాయ్, గొడ్డలి, త‌ల్లికి మోసం, చెల్లికి మోసం అంటూ ముందు ఆయనే మాటల యుద్ధానికి తెరతీసినట్టు కనిపిస్తోంది. ఆయనకు కౌంటర్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వాగ్బాణాలు ప‌డ్డాయి.

ఇలాంటి అసెంబ్లీ యుద్ధాలు కొత్తేమీ కాదు. తమిళనాడు అసెంబ్లీలో జయలలితకు జరిగిన అవమానం చూశాం.. కురుక్ష్రేతాన్ని తలపించిన హర్యనా అసెంబ్లీ చూశాం…కేరళ, జార్ఖండ్‌..జమ్మూ కశ్మీర్‌..కర్నాటక..ఉత్తరప్రదేశ్‌ ..ఎక్కడికి వెళ్లినా ఇదే తీరు. జమ్మూ కశ్మీర్‌ శాసన సభలో సభ్యులు ఏకంగా కొట్టుకున్నారు..ఇది చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు.

అసెంబ్లీలో జరిగే హైడ్రామాల ముందు సినిమాలు కూడా వేస్టే అనిపిస్తుంది. నటులను మించిన నటులు నాయకులు. తిట్ల పురాణంలో పండితులు. భౌతిక దాడులకూ వెనకాడరు. సభలో చెప్పులే కాదు కుర్చీలు కూడా విసిరేస్తారు. గతంలో పంజాబ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిండు సభలో ఏకంగా మంత్రినే బూటుతో కొట్టాడు. తమిళనాడు అసెంబ్లీ ఎప్పుడూ రణరంగాన్నే తలపించేది.

1988లో జయలలిత, జానకీరామచంద్రన్ వర్గాల మధ్య అసెంబ్లీలో పెద్ద యుద్ధమే జరిగింది. దాదాపు గంటపాటు సభ కురుక్షేత్రాన్ని తలపించింది. 20 మంది ఎమ్మెల్యేలు తీవ్రంగా గాయపడ్డారు. మైకులు. చాలా కుర్చీలు విరిగిపోయాయి. చివరకు అసెంబ్లీ లోపలికి పోలీసులు వచ్చి వారిని కంట్రోల్‌ చేయాల్సి వచ్చింది. తరువాత 1989లో డీఎంకే హయాంలో నిండు సభలో జయలలిత చీర లాగారు. తరువాత ఏఐడీఎంకే అధికారంలోకి వచ్చాక ప్రతీకార చర్యలు మామూలే. కాబట్టి ఈ విషయంలో ఎవరూ తక్కువ కాదు.

పాతికేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో పెద్ద యుద్ధమే జరిగింది. నాడు బీజేపీ అధికారంలో ఉంది, కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి. కాంగ్రెస్, బీఎస్పీ ఎమ్మెల్యేలు స్పీకర్ పైకి లౌడ్ స్పీకర్‌ను విసిరారు. ఇది ఘర్షణకు దారితీసింది. సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి మైక్రోఫోన్ స్టాండ్‌లు, పేపర్‌వెయిట్‌లు, గాజు ముక్కలు, ఫర్నిచర్‌ను స్వేచ్ఛగా ఉపయోగించుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు తీవ్రంగా గాయపడ్డారు.

2009లో మహారాష్ట్ర నవ నిర్మాణ సమితికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తోటి ఎమ్మెల్యేపై దాడి చేశారు. మరాఠీలో కాకుండా హిందీలో ప్రమాణ స్వీకారం చేయటమే అతను చేసిన తప్పు. నిజానికి ఆ ఎమ్మెల్యేకు మరాఠీ రాదు. 2011 లో ఒడిషా అసెంబ్లీ స్పీకర్‌ మీదకు కుర్చీ విసిరేందుకు యత్నించారు. అసెంబ్లీ ఉద్యోగులు అడ్డుకోవటంతో స్పీకర్‌ తప్పించుకోగలిగారు. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ్లో 2012లో టీఎంసీ, సీపీఎం సభ్యులు ఒకరినొకరు తన్నుకన్నారు.

అసెంబ్లీలోనే కాదు పార్లమెంట్‌లోనూ ఇదే లొల్లి. 2014 తెలంగాణ బిల్లు సందర్భంగా ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీలు సభలో పెప్పర్‌ స్ప్రే కొట్టారు. దాంతో ఏపీకి చెందిన 16 మంది ఎంపీలు సస్పెండయ్యారు. గుర్తుచేసుకుంటే ఇలాంటి అనేక సంఘటనలు తెరమీదకు వస్తాయి.

నిజానికి అధికార, విపక్షాల మధ్య అర్థంచేసుకునే తత్వం కొరవడింది. ప్రతీకార రాజకీయాలకే పెద్దపీట వేస్తున్నారు. అందుకే ప్రతిపక్ష సభ్యులు చెప్పేది అధికార పార్టీకి అస్సలు పట్టదు. విపక్షం ఏది అడిగినా అధికార పక్షానికి చిన్న చూపే. వారు ఏది మాట్లాడినా వీరికి వెటకారమే. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా చరిత్ర తవ్వితీస్తారు. ఎదురుదాడే సమాధానం అవుతోంది. ఈ ట్రెండ్‌ మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  • Dr. Ramesh Babu Bhonagiri

Related Articles

Latest Articles