పవన్‌ కల్యాణ్‌కు టీడీపీలో ప్రాధాన్యం !

శత్రువుకు శత్రువు మిత్రుడు. ఈ మధ్య టీడీపీ దీన్ని బాగా ఫాలో అవుతోంది. ఒకప్పటి ఆప్త మిత్రుడు పవన్‌కు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తోంది. ఆయన్ను వైసీపీ విమర్శిస్తే టీడీపీ కస్సుమని ఒంటి కాలిపై లేస్తోంది. అది పార్టీలోని ఓ వర్గ నేతలకు అస్సలు నచ్చడం లేదట. మనల్ని పట్టించుకోని అతనికేంటి అంత ప్రయార్టీ అంటూ ఒకటే గుసగుసలు.. రుసరుసలట..!

ఇటీవల పవన్‌కు అండగా టీడీపీ కామెంట్స్‌..!

ఇటీవల ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే పొత్తులు.. సమీకరణాలు మారే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ప్రస్తుతం మిత్రులుగా ఉన్న బీజేపీ-జనసేన మధ్య బంధం బీటలు వారి.. టీడీపీ-జనసేన మధ్య కొత్త పొత్తులు చిగురించే సూచనలున్నట్టు ప్రచారం సాగుతోంది. దీనికి తగ్గట్టుగానే పరిణామాలు ఉంటున్నాయి. టీడీపీ విషయంలో సాఫ్ట్‌గా మాట్లాడ్డం.. ప్రధానంగా కమ్మ సామాజికవర్గాన్ని వెనకేసుకురావడం వంటివి పవన్‌ కల్యాణ్‌ వైపునుంచి జరిగితే.. ఇటీవల వైసీపీ వర్సెస్‌ జనసేన ఎపిసోడ్‌లో టీడీపీ పవన్‌ కల్యాణ్‌కు అండగా నిలిచింది.

జనసేనకు అంత ఇంపార్టెన్స్‌ అవసరామా అని టీడీపీలో చర్చ!
చంద్రబాబు, లోకేష్‌లను అడ్డుకున్నప్పుడు పవన్‌ స్పందించలేదని చర్చ!

ఇదే సమయంలో టీడీపీలో మరో చర్చ జరుగుతోంది. జనసేనకు ఈస్థాయిలో ఇంపార్టెన్స్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందా? అని చాలామంది నేతలు అంతర్గత సమావేశాలు.. పిచ్చాపాటిగా భేటీలలో ప్రశ్నిస్తున్నారట. గత రెండున్నరేళ్ల కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ పోరాటాలు చేసింది. ఆందోళనా కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ విషయంలో మంత్రి పేర్ని నాని ఏ విధంగా అయితే టార్గెట్‌ చేసి దుమ్ము దులిపేశారో.. చంద్రబాబు, లోకేష్‌లను కూడా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంటి వారు అదేవిధంగా టార్గెట్‌ చేశారు. పొలిటికల్‌ ఫ్లాట్‌ఫాం దాటి వెళ్లాయి ఆ విమర్శలు. అలాగే వివిధ సందర్బాల్లో టీడీపీ చేసే కార్యక్రమాలను అధికార పార్టీ అడ్డుకోవడం.. బాధితులను పరామర్శించడానికి కూడా అనుమతివ్వకపోవడం.. చంద్రబాబు.. లోకేష్‌లను అడ్డుకుని పోలీస్ స్టేషన్లకు తరలించడం వంటి సంఘటనలు చాలా జరిగాయని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఏ ఒక్కరోజైనా పవన్‌ కల్యాణ్‌ కానీ.. ఆ పార్టీలో చెప్పుకోదగ్గ లీడరుగా ఉన్న నాదెండ్ల మనోహర్‌ కానీ స్పందించారా..? మనకు మద్దతు ఇచ్చారా? అని ప్రశ్నిస్తున్నారట.

టీడీపీకి అండగా ఉన్న సామాజికవర్గాలకు పవన్‌ గురిపెట్టారా?

ఇటువంటి పరిస్థితుల్లో పవన్‌ కల్యాణ్ విషయంలో అంతలా స్పందించాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటున్నారట. పైగా పవన్‌ కల్యాణ్‌ ఇటీవల చేసిన ప్రసంగాలను లోతుగా విశ్లేషిస్తే.. జగన్ను.. ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసుకున్నట్టు కన్పించినా.. తెలుగుదేశానికి అండగా ఉండే వివిధ సామాజికవర్గాలను.. సంప్రదాయ ఓట్లను లక్ష్యం చేసుకున్నట్టుగా ఉందని చెబుతున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే లాభమనే లెక్కలు వేసుకునే బదులు నష్టం జరుగుతుందా అనే కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారట. ఈ క్రమంలో మాజీ ఎంపీ హర్షకుమార్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు కొందరు నేతలు. చంద్రబాబు, లోకేష్‌ నిర్వహించే కార్యక్రమాలను అడుగడుగునా అడ్డుకున్న ప్రభుత్వం.. పోలీసులు.. పవన్‌ కల్యాణ్‌ను ఎందుకు అడ్డుకోవడం లేదనే రీతిలో ఆలోచన చేస్తే అన్నిరకాల ప్రశ్నలకు సమాధానం లభిస్తుందనే భావనను వ్యక్తం చేస్తున్నారు పలువురపు సీనియర్లు.

టీడీపీ బలం ఎంత పెరిగేలా దృష్టిపెట్టాలని సూచన..!

జనసేన బలం పెరిగిందా.. లేదా..? అనే విషయాన్ని పక్కన పెట్టి.. టీడీపీ బలం ఎంత వరకు పెరిగిందనే రీతిలో ఆలోచన చేస్తే పార్టీ గాడిన పడుతోందనే చర్చ తెలుగుదేశంవర్గాల్లో జోరుగా సాగుతోందట. మరి.. అధినేత వేటికి ప్రాధాన్యం ఇస్తారో చూడాలి.

-Advertisement-పవన్‌ కల్యాణ్‌కు  టీడీపీలో ప్రాధాన్యం !

Related Articles

Latest Articles