తెలుగుదేశం.. ప్లాన్ బీ అమలుకు సిద్ధమైంది..!

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వానికి.. సగం కాలపరిమితి తీరింది. మరో రెండేళ్లైతే.. ఎన్నికల హడావుడి మొదలవుతుంది. ఈ లోపు ప్రజల్లో బలం పెంచుకోవాలి. బలగాన్ని కదిలించాలి. గెలుపే ధ్యేయంగా కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలి. ఇదే పనిలో ఉంది.. తెలుగుదేశం పార్టీ. ఇప్పటికే.. సమస్య చిన్నదైనా.. పెద్దదైనా.. ఎలాంటిదైనా.. జనాల్లోకి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నాయకత్వంలో వెళ్లి పోరాడుతోంది.

ఇప్పుడు.. మిగతా వర్గాలనూ.. రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే.. ఈ నెల 13 నుంచి.. అంటే రేపటి నుంచే.. మరో ఆందోళనకు టీడీపీ శ్రీకారం చుట్టింది. లోక్ సభ నియోజకవర్గ కేంద్రాల్లో.. పార్టీ శ్రేణులను పోరాట పథంలోకి తీసుకువెళ్తోంది. రైతు సమస్యలే ప్రాతిపదికగా.. తాజా కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. మీడియాకు వెల్లడించారు.

మొత్తంగా 5 రోజులపాటు.. 25 నియోజకవర్గాల్లో.. పోరాటాన్ని ప్లాన్ చేశారు. 13న ఉత్తరాంధ్ర, 14న రాయలసీమ, 15న ఉభయ గోదావరి జిల్లాలు, 16న దక్షిణ కోస్తా.. చిత్తూరు జిల్లాలు, 17న సెంట్రల్ ఆంధ్రా పరిధిలోని ప్రాంతాల్లో రైతుల కోసం.. వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడనున్నట్టు అచ్చెన్న తెలిపారు. ఈ కార్యక్రమానికి.. రైతు కోసం తెలుగుదేశం.. అని పేరు పేట్టినట్టు ఆయన ప్రకటించారు.

ఒక వైపు.. ప్రధాన సమస్యలపై ప్లాన్ ఏ లో భాగంగా లోకేశ్ ను జనాల్లోకి పంపించడం.. మరోవైపు.. ప్లాన్ బి అమలులో భాగంగా ఇలాంటి సమస్యలపై శ్రేణులన్నిటినీ ముందుకు తీసుకువెళ్లడం చూస్తుంటే.. రాను రాను టీడీపీ నాయకత్వం మరింత ప్రభావవంతగా.. ప్రజాపోరాటాలు చేయనుందని స్పష్టమవుతోంది. ఇదే జరిగితే.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సైతం.. తగ్గట్టుగానే స్పందించడం ఖాయం.

ఈ లెక్కన.. ముందుందు.. రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శల జడివాన ఖాయమని.. విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే ఎన్నికలే ఇందుకు ప్రాతిపదిక అని విశ్లేషిస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-