బద్వేల్ ఉప ఎన్నిక: ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు?


బద్వేల్ ఉప ఎన్నిక ఏపీ రాజకీయాన్ని మార్చివేయనుందా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు. కానీ ఈ ఉప ఎన్నిక మాత్రం ఏపీలో ఎవరు మిత్రులు.. ఎవరు శత్రువులు అనే దానిపై ప్రజలకు క్లారిటీ ఇవ్వనుంది. బద్వేల్ లో నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రోజురోజుకు కీలక పరిణామాలు చోటుచేసుకుంది. ఒక పార్టీలో బరిలో ఉంటామని ప్రకటిస్తుండగా మరోపార్టీ పోటీ నుంచి తప్పుకుంటున్నామని చెబుతోంది. దీంతో బద్వేల్ రాజకీయం ఒకింత ఆసక్తిని రేపుతోంది.

బద్వేల్ నియోజకవర్గం కడప జిల్లాలో ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఇక్కడ జరిగే ఉప ఎన్నికలో విజయం ఏకపక్షమేనని అర్థమవుతోంది. ఈ ఉప ఎన్నిక సైతం వైసీపీ ఎమ్మెల్యే మరణంతో వచ్చింది. సదరు ఎమ్మెల్యే భార్యనే వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచింది. అధికార బలంతోపాటు సానుభూతి పవనాలు వైసీపీ అభ్యర్థికి ప్లస్ కానున్నాయి. మరోవైపు ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమని తెల్సినప్పటి నుంచే టీడీపీ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం చేస్తుంది.

కడప జిల్లాలో వైసీపీ బలంగా ఉంది. కిందటి ఎన్నికల్లో ఈ జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఇక్కడ గెలుపు వైసీపీకి నల్లేరు మీద నడకే కానుంది. ఇక గత కొద్దిరోజులుగా ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా మారిపోయింది. పవన్ కల్యాణ్ ఓ సినిమా వేదికపై చేసిన వ్యాఖ్యలు జనసేన, వైసీపీ మధ్య చిచ్చుపెట్టాయి. ఇదికాస్తా వివాదం కావడం నేతలు మాటలయుద్ధానికి దిగారు. ఇదే సమయంలో బద్వేల్ లో జనసేన అభ్యర్థి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది.  

అయితే అనుహ్యంగా రాజమండ్రి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ బద్వేల్ ఉప ఎన్నిక నుంచి తాము తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాజకీయ సంప్రదాయాలను గౌరవిస్తూ తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు జనసేనాని స్పష్టం చేశారు. దీంతో హోరాహోరీగా బద్వేల్ ఉప ఎన్నిక జరుగుతుందని భావించినా అలాంటిది ఏమి ఉందని తేలిపోయింది. ఇక జనసేన దారిలోనే చంద్రబాబు నాయుడు సైతం వెళుతున్నారు. తాజాగా బద్వేల్ ఉప ఎన్నిక నుంచి తమ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

రెండు ప్రధాన పార్టీలు బద్వేల్ ఉప ఎన్నిక నుంచి తప్పుకోవడంతో వైసీపీకి గెలుపు మరింత సులువైనట్లు కన్పిస్తోంది. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ బరిలో నిలుస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. వారసత్వ రాజకీయాలను తాము వ్యతిరేకమంటూ బద్వేల్ లో పోటీకి రెడీ అయ్యింది. అయితే బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. సాంప్రదాయాలను గౌరవిస్తూ పవన్ కల్యాణ్ ఈ పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన బీజేపీకి ఏమాత్రం ప్రచారం చేసే అవకాశం లేదని తెలుస్తోంది.

టీడీపీ సైతం ఈ పోటీ నుంచి తప్పుకోవడం ద్వారా జనసేనకు దగ్గరయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. పవన్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య మళ్లీ పాతస్నేహం చిగురించే అవకాశాలున్నాయి. మరోవైపు బీజేపీ, జనసేన బంధానికి బీటలువారే అవకాశాలు కన్పిస్తున్నాయంటున్నారు. మొత్తానికి బద్వేల్ ఉప ఎన్నిక ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు అనే దానిపై స్పష్టత ఇవ్వనుంది. దీంతో బద్వేల్ ఉప ఎన్నిక కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టబోతుందనే టాక్ విన్పిస్తుంది.

-Advertisement-బద్వేల్ ఉప ఎన్నిక: ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు?

Related Articles

Latest Articles