అనగాని బాలయ్యను అడ్డంగా బుక్ చేశారా?

సినిమా టికెట్ల ధరల విషయంలో ఆ ఎమ్మెల్యే సొంతపార్టీ హీరోనూ బుక్‌ చేశారా? రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నంలో పార్టీ ఉండగా.. ఆయన కామెంట్స్‌ టీడీపీ శిబిరాన్నే ఇరుకున పెట్టేలా ఉన్నాయా? తెలుగుదేశం వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?

సినిమా టికెట్‌ ధరలపై టీడీపీ నేతల ఆసక్తికర కామెంట్స్‌
సినిమా టిక్కెట్ల వ్యవహారం ఏపీలో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌. టిక్కెట్‌ రేట్లు మొదలుకుని.. థియేటర్ల సీజ్‌ వరకు ప్రభుత్వం వర్సెస్‌ టాలీవుడ్‌ అన్నట్టుగా ఉంది. సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ఈ సమస్యపై స్పందిస్తుంటే.. మరికొందరు టచ్‌ మీ నాట్‌ అన్నట్టుగా ఉంటున్నారు. దీంతో ఈ మొత్తం ఎపిసోడ్‌ను టీడీపీ అడ్వాంటేజ్‌గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే కొందరు టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్సే ఆసక్తిగా మారి.. పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి.

రీల్‌ హీరోలుగా మిగిలిపోతున్నారని అనగాని ప్రెస్‌నోట్‌..!
సినీ పరిశ్రమతోపాటు.. థియేటర్ల యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఓ ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేశారు. అందులో ప్రస్తావించిన అంశాలే చర్చగా మారాయి. సినీ రంగాన్ని వేధిస్తుంటే.. సినిమా పెద్దలు ఎందుకు నోరు మెదపడం లేదు? సినిమాల్లో చూపించే మీ హీరోయిజాన్ని.. వైసీపీ సర్కార్‌పై ఎందుకు చూపించడం లేదని ఓ రేంజ్‌లో ప్రెస్‌నోట్‌ ద్వారా ఫైర్‌ అయ్యారు అనగాని. రీల్‌ హీరోలుగానే మిగిలిపోతున్నారు తప్ప.. రియల్‌ హీరోలుగా మారరా..? అని సూటిగా.. సుత్తి లేకుండానే ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యే.

బాలయ్యను కూడా అనగాని ప్రశ్నించారా?
ఇంతకీ అనగాని కామెంట్స్‌ చేసింది ఎవరిని అనే సన్నాయి నొక్కులు టీడీపీలో మొదలయ్యాయి. సినిమా ఇండస్ట్రీలో ఎమ్మెల్యేగా ఉన్న హీరో బాలకృష్ణ కూడా ప్రధానమైన వ్యక్తే. ఆ విషయాన్ని అనగాని మర్చిపోయారా అన్నది కొందరి ప్రశ్న. రీల్‌ హీరోలు.. రియల్‌ హీరోలు అని బాలయ్యను కూడా ప్రశ్నించారా? ఆ కామెంట్‌ బాలకృష్ణను ఉద్దేశించి కూడా చేశారా అని అంతర్గత సమావేశాల్లో చర్చ పెడుతున్నారట.

బాలయ్యనూ రీల్‌ హీరోగానే చూశారా?
సినిమా టికెట్ల విషయంలో ముందుగా పవన్‌ కల్యాణ్, ఆ తర్వాత హీరో నాని, సిద్ధార్థలు స్పందించారు. తర్వాత ఒక్కొక్కరుగా ఈ అంశంపై మాట్లాడుతున్నారు. అయితే ఈ అంశం నుంచి తప్పించుకున్న లేక స్పందించని వాళ్లల్లో బాలయ్య కూడా ఉన్నారని కొందరు గుర్తు చేస్తున్నారు. అఖండ సినిమా రిలీజ్ తర్వాత బెజవాడలో బాలయ్య మాట్లాడినా.. అది పెద్దగా చర్చల్లోకి రాలేదు. దాంతో బాలయ్యను కూడా రీల్‌ హీరోగానే అనగాని చూసి ఉంటారని పార్టీలో మరికొందరు అభిప్రాయపడుతున్నారట.

ప్రెస్‌నోట్‌ గురించి అనగానికి తెలుసా?
ఇదే సమయంలో మరో చర్చా జరుగుతోంది. అసలు ప్రెస్‌నోట్‌ ఇస్తున్న విషయం అనగానికి తెలుసా .. లేక పార్టీనే ప్రెస్‌నోట్‌ తయారు చేసేసి పంపేసిందా అనే అనుమానాలు ఉన్నాయట. గతంలో స్పీకర్‌ను ఉద్దేశించి అచ్చెన్నాయుడు పేరుతో ఒక ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ అయింది. దాంతో అచ్చెన్న ప్రివిలేజ్‌ కమిటీ ముందు హాజరు కావాల్సి వచ్చింది. ఆ సందర్భంగా అచ్చెన్న వివరణపై ఆసక్తికర చర్చ జరిగింది. ఆ ప్రెస్‌నోట్‌లో తన సంతకం లేదని.. పార్టీ కార్యాలయం తనకు తెలియకుండానే ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేసిందని వివరణ ఇచ్చారు అచ్చెన్న. ఇప్పుడు అనగాని విషయంలోనూ అదే జరిగిందా అన్నది పార్టీ కొందరి డౌట్‌. మరి.. అనగాని మనసులో ఏముందో.. ఏమో?

Related Articles

Latest Articles