లోకేష్ వద్దకు నేతల క్యూ.. అసలు కథ వేరే ఉందా…?

చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు తెలుగు తమ్ముళ్లు వరుసగా ఆహ్వానాలు పంపుతున్నారు. తమ జిల్లాల్లో పర్యటనలు చేయాలని కోరుతున్నారట. దీనికి ఆయన కూడా సానుకూలత వ్యక్తం చేస్తూ జిల్లా పర్యటనలకు వస్తానని వారందరికీ అభయం ఇస్తున్నారట. అయితే దీని వెనుక అసలు కారణం వేరే ఉందనే చర్చ టీడీపీలోనే జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే నారా లోకేష్ ను టీడీపీ నేతలు మచ్చిక చేసుకుని సీటును కాపాడుకునే పనిలో పడ్డారని టాక్ విన్పిస్తోంది.

కిందటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం పాలైంది. ఆ ఓటమి నుంచి టీడీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమమే ప్రధాన ఏజెండాగా ముందుకెళుతున్నారు. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి ఏదోఒక లబ్ధిని చేకూరుస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్మోహన్ రెడ్డి తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొస్తున్నా ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత కన్పించడం లేదు.

వైసీపీ బలం రోజురోజుకు పెరిగిపోతుండగా టీడీపీ క్రమంగా బలహీన పడుతోంది. కిందటి స్థానిక సంస్థల ఎన్నికలే ఇందుకు నిదర్శనంగా కన్పిస్తుంది. అధికార పార్టీకి టీడీపీ కనీస పోటీ ఇవ్వలేక చతికిలబడుతోంది. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు టీడీపీ బలం సరిపోవడం లేదు. దీంతో చంద్రబాబు నాయుడు మరోసారి పొత్తులతో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని టీడీపీలో గుసగుసలు విన్పిస్తున్నాయి.

జనసేన కలిసొచ్చినా రాకున్నా ఇతర పార్టీలతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఖాయంగా కన్పిస్తుంది. దీంతో టీడీపీ తమకు కలిసి వచ్చే పార్టీల కోసం దాదాపు 40నుంచి 50సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జనసేనతో టీడీపీ కలిసి వెళుతుందనే ప్రచారం ఇటీవల జోరుగా సాగుతోంది. టీడీపీ పొత్తులతో వెళితే తమ సీటు ఉంటుందా? లేదా అన్న బెంగ తమ్ముళ్లలో పట్టుకుంది. దీంతో లోకేష్ బాబును తమ జిల్లాలను రావాలని టీడీపీ నేతలు ఆహ్వానం పంపుతున్నారు. జిల్లా సమస్యలతోపాటు తమ సీటుపై హామీని తీసుకోవాలని వారంతా భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో టీడీపీ నేతలు లోకేష్ చుట్టూ తిరిగి టిక్కెట్లు దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఒంటిరిగా పోటీ చేయడంతో టికెట్ల కేటాయింపులో పెద్దగా సమస్యలు రాలేదు. ఆయన అనుకున్న వారికి టిక్కెట్ ఇప్పించుకున్నారు. కానీ రాబోయే ఎన్నికలకు టీడీపీ పొత్తులతో వెళ్లనుంది. దీంతో ఎవరికీ టిక్కెట్ కేటాయించాలన్న కూడా సమస్య వచ్చిపడే అవకాశం ఉంది. జనసేన పార్టీ బలంగా ఉన్న చోట టీడీపీకి టిక్కెట్ దక్కే అవకాశం లేదు.

ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, రాయలసీమలోని కొన్ని ఏరియాల్లో జనసేనకు కొంతపట్టు ఉంది. ఆయా ప్రాంతాల్లో జనసేన టిక్కెట్ల కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. దీంతో అక్కడి నుంచి పోటీ చేయాలనుకున్న తమ్ముళ్లకు సీట్ల విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దీంతో ముందుగానే టీడీపీ నేతలు లోకేష్ బాబును తమ జిల్లాలకు ఆహ్వానిస్తున్నారు. తమ సీటుపై క్లారిటీ ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. నేతల ఆహ్వానం మేరకు జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్న లోకేష్ తెలుగు తమ్ముళ్లకు ఎలాంటి హామీ ఇస్తారనేది ఆసక్తిని రేపుతోంది.

-Advertisement-లోకేష్ వద్దకు నేతల క్యూ.. అసలు కథ వేరే ఉందా...?

Related Articles

Latest Articles