ఫైబర్ నెట్ స్కాంలో బుక్కైన టీడీపీ నేతలు

తీగ లాగితే డొంక కదిలిన చందంగా టీడీపీ నేతల లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఫైబర్ నెట్ కార్పొరేషన్లో గోల్ మాల్ జరిగిందని ఆరోపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక టీడీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ఒక్కొక్కటిగా బయటికి లాగుతున్నారు. ఇప్పటికే నాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మంత్రులను జైళ్లకు పంపిన సంఘటనలు ఉన్నాయి. ఇక ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడిపై ఫైబర్ నెట్ స్కాం ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ శ్రేణులు కలవరపాటుకు గురవుతున్నాయి.

టీడీపీ హయాంలో నారా లోకేష్ కీలకమైన ఐటీ శాఖకు మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో ఏపీలో ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో ఫైబర్ నెట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. అయితే ఇందులో 2వేల కోట్ల వరకు గోల్ మాల్ జరిగిందంటూ ప్రస్తుత ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం సీఐడీతో దర్యాప్తు చేయించి ఫైబర్ నెట్ స్కీములో జరిగిన అవినీతిపై సమాచారాన్ని రాబట్టింది. లోకేష్ కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణప్రసాద్‌కు చెందిన టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(టెరాసాఫ్ట్‌) సంస్థకు టెండర్లు కట్టబెట్టేందుకు నాటి ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కిందని విచారణలో తేల్చినట్లు సమాచారం.

ఫైబర్‌ నెట్‌ టెండర్లలో పాల్గొనేందుకు టెరాసాఫ్ట్‌ కంపెనీ ఫోర్జరీ పత్రాలను సృష్టించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారంగా అయితే బిడ్‌ దాఖలు చేసే కంపెనీ మరో రెండు సంస్థలతో కలసి కన్సార్టియంగా ఏర్పడాల్సి ఉంటుంది. కన్సార్టియం లీడ్‌ కంపెనీకి మూడేళ్లలో దాదాపు రూ.100 కోట్ల టర్నోవర్‌ ఉండాలి. మిగిలిన రెండు కంపెనీలకు ఏడాదికి దాదాపు రూ.50 కోట్ల చొప్పున టర్నోవర్‌ ఉండాలి. అయితే కన్సార్టియంలో మూడో కంపెనీ హారిజన్‌ బ్రాడ్‌కాస్ట్‌ ఏర్పాటై అప్పటికి కేవలం 8 నెలలే అయ్యిందని తేలిందట… మరోవైపు ఫైబర్‌ నెట్‌ రంగంలో పనులు చేసినట్లు టెరాసాఫ్ట్‌ ఫోర్జరీ పత్రాలు సమర్పించిందినట్లు సీఐడీ గుర్తించిందని సమాచారం. లోకేష్ సన్నిహితులకు మేలు కూర్చేలా ఫోర్జరీ పత్రాలు సృష్టించి రూ.330 కోట్ల విలువైన ఫైబర్‌నెట్‌ టెండర్లను ఆ సంస్థలకు కట్టబెట్టినట్లు సీఐడీ విచారణలో వెలుగుచూసినట్లు తెలుస్తోంది.

నిబంధనల ప్రకారమైతే.. టెండర్ల ప్రక్రియలో పాల్గొనే సంస్థలతో అనుబంధం ఉన్నవారు సాంకేతిక కమిటీలో ఉండకూడదు. కానీ నాటి ప్రభుత్వం వాటిని బేఖాతరు చేస్తూ అస్మదీయులకు టెండర్లు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పడు ఇదే టీడీపీ మెడకు చుట్టుకునేలా కన్పిస్తోంది. మరోవైపు ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌కు టెరాసాఫ్ట్‌ సరఫరా చేసిన పరికరాలు అత్యంత నాసిరకంగా ఉన్నాయని సీఐడీ తేల్చింది. అయినా వాటికి బిల్లులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఒప్పందం మేరకు పరికరాలు సరఫరా చేయకపోవడం.. నాసిరకం కారణాలతో ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌కు రూ.119.98 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ విచారణలో తేలింది.

ఈ ఫైబర్ నెట్ టెండర్లలో కీలకంగా వ్యవహరించిన వేమూరి హరికృష్ణప్రసాద్‌, కె.సాంబశివరావు సహా మొత్తం 19మందిపై సీఐడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వైపీసీ తొలి నుంచి ఫైబర్ నెట్ స్కీముపై చేస్తున్న ఆరోపణలు నిజమేనని తేలితే రాబోయే రోజుల్లో టీడీపీకి మరిన్ని ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-